బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’

ఫొటో సోర్స్, ఫొటో క్రెడిట్: డీఎల్ నరసింహ
- రచయిత, డీఎల్ నరసింహ
- హోదా, బీబీసీ కోసం
'కర్నూలు జిల్లాలో కోవెలకుంట్లలో అప్పులపాలైన ఓ భర్త.. బాకీ తీర్చడం కోసం భార్యాబిడ్డలను అమ్మకానికి పెట్టారు..' ఈ వార్త ఇటీవల తెలుగు, ఆంగ్ల, హిందీ మీడియాలో మారుమోగింది. ఆ భర్త పేకాటకు, తాగుడుకు బానిసయ్యాడని దాని వల్ల ఈ దారుణానికి పాల్పడ్డారన్నది ఆ వార్తల సారాంశం. ఇందులో నిజమెంత? నిజంగా అతను భార్యా బిడ్డలను అమ్మాకానికి పెట్టారా?
ఈ విషయం తెలుసుకునేందుకు బీబీసీ క్షేత్ర స్థాయికి వెళ్లింది. నంద్యాలలోని వైఎస్ నగర్ బుడగజంగాల కాలనీలో ఓ చిన్న డేరాలో ఉంటున్న బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను, ఆ కుల పెద్దలను, స్థానిక పోలీసులను, అధికారులను కలిసి మాట్లాడింది.
అప్పుడు అది అమ్మకం కాదు అది కులాచారమని తెలిసింది. పోలీసులు, అధికారులు ఇది దురాచారమని వీటిని వెంటనే అరికట్టాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఏరకంగా అయినా సరే అది బాల్యవివాహంగా లేక భార్యా బిడ్డలను అమ్మినట్లుగా తేలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇంతకీ ఏంటా కులాచారం?
కన్యాశుల్కం అనేది ఒక సంప్రదాయం. అంటే పెళ్లి సమయంలో వరుడు వధువుకు కొంత డబ్బు చెల్లిస్తారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పట్లో ఉండేది. ఆ సంగతి పక్కన పెడితే కన్యాశుల్కం వంటి ఆచారం ఇప్పటికీ బుడగ జంగాలు, పూసల అనే రెండు కులాల్లో కనిపిస్తోంది.
ఆడపిల్ల తండ్రి తన బిడ్డను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి పిల్లోడి తండ్రి దగ్గర అప్పు తీసుకునే సంప్రదాయం ఈ కులంలో ఉందని బుడగ జంగం కాలనీ పెద్ద మౌలాలి చెబుతున్నారు. ఈ మేరకు కులపెద్దల సమక్షంలో ఓ ఒప్పంద పత్రం రాసుకుంటారని వివరించారు. కులపంచాయతీలు శక్తిమంతమైనవి కనుక ఒక్కో సారి ఇక్కడ నోటిమాటకూ చాలా విలువ ఉంటుందని తెలిపారు.

ఫొటో సోర్స్, ఫొటో క్రెడిట్: డీఎల్ నరసింహ
మౌలాలి చెప్పినదాని ప్రకారం..
"ఇలా ఒప్పందం కుదిరి డబ్బు తీసుకున్న సమయం నుంచి ఆ ఆడపిల్లను డబ్బు ఇచ్చిన వారి సొత్తుగానే భావిస్తుంటారు. ఆ అమ్మాయి తల్లిదండ్రుల వద్ద పెరుగుతున్నా సర్వహక్కులు డబ్బు ఇచ్చిన వారికే ఉంటాయి.
యుక్తవయస్సు వచ్చాక అమ్మాయిని.. డబ్బులిచ్చిన వారి అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడతారు. వారిద్దరూ ఇష్టపడితే పెళ్లి చేస్తారు. లేదంటే అమ్మాయి తండ్రి తీసుకున్న డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వివిధ ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్త ప్రకారం అమ్మకానికి గురైన అమ్మాయి బుడగ జంగాల కులానికి చెందిన వారు కాదు. పూసల కులానికి చెందినవారని మౌలాలి తెలిపారు. బుడగ జంగాలు ఈ ఆచారాన్ని వదిలేశాయి.. కానీ పూసల కులంలో కొనసాగుతోందని వివరించారు.

ఫొటో సోర్స్, ఫొటో క్రెడిట్: డీఎల్ నరసింహ
కోవెలకుంట్ల ఘటనలో వివాదం ఏంటి?
ఈ కులాల్లో జిర్ర అనే ఆచారం ఉంది. దీని ప్రకారం ఒక అమ్మాయికి పెళ్లి అయితే.. ఆమె తనకు పుట్టే ఆడపిల్లను తన సోదరునికి ఇచ్చి పెళ్లి చేయాలి అని స్థానికుడు సంజన్న తెలిపారు.
కర్నూలు జిల్లా కోవెలకుంట్లలో తలెత్తిన తాజా వివాదంలో భర్త తరఫున పంచాయతీ పెద్దమనిషిగా సంజన్న ఉన్నారు. ఈ జిర్ర వలనే వివాదం తలెత్తిందని ఆయన చెప్పారు.
"కోవెలకుంట్లకు చెందిన వెంకటమ్మ తన పెద్ద కూతుర్ని సోదరునికి ఇచ్చే పెళ్లి చేస్తానని చెప్పి నంద్యాలలో ఉన్న తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుంది.. అని సంజన్న'' అన్నారు.
పెద్ద కుమార్తె పెళ్లి గురించి ఆ భార్యాభర్తలు తరచూ గొడవపడుతున్నట్లు సంజన్న తెలిపారు.
"పెద్ద కుమార్తెను తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే విధంగా గతంలో వెంకటమ్మ ఒప్పందం చేసుకుంది. బదులుగా తండ్రి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుంది. మూడు నెలల కిందట పెద్ద కూతురు పెద్దమనిషి అయ్యింది. ఆ పాప వయసు 13 ఏళ్లు. ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఆమె తన కూతురుని, తమ్ముడుకి ఇచ్చి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తోంది. కానీ భర్త... పిల్ల వయసు చాలా తక్కువ కనుక మరికొన్ని సంవత్సరాలు ఆగుదామని అంటున్నాడు. ఈ విషయంపై ఇద్దరూ గొడవపడుతున్నారు" అని మౌలాలి వివరించారు.
వెంకటమ్మ తండ్రి ఏమంటున్నారు?
డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని వెంకటమ్మ తండ్రి చెప్పారు. "అప్పుల్లో ఉన్న నా కూతురు నన్ను ఆర్థిక సాయం అడిగింది. బదులుగా ఆమె పెద్దకుమార్తెను నా కుమారునికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చింది. ఆ ఒప్పందం మీద రూ.లక్షన్నర ఇచ్చాను" అని ఆయన తెలిపారు.
మరి భార్యాపిల్లల అమ్మకం వాస్తవమా?
ఈ మాటల్లో వాస్తవం లేదని ఊరి పెద్ద మౌలాలి అంటున్నారు. తాగుడుకి బానిసై లక్షల రూపాయలు అప్పు చేసిన తన భర్త, ఏదో ఒకరోజు బాకీకి బదులుగా పెద్ద కూతుర్నిఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడేమోనని వెంకటమ్మ భయపడుతోందని తెలిపారు. అందువల్ల తన మాటను నెగ్గించుకోవడం కోసం ఇలా పిల్లలను అమ్ముతున్నాడంటూ అబద్ధాలు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అంతేకానీ ఆయన భార్యాబిడ్డలను అమ్మడం లేదని వివరించారు.
వార్తలో వచ్చినట్లుగా పెద్ద కూతురికి 17 ఏళ్లు కాదని స్థానికులు తెలిపారు.

ఫొటో సోర్స్, ఫొటో క్రెడిట్: డీఎల్ నరసింహ
మరి భార్యను అమ్మారన్న వార్త?
భార్యభర్తల మధ్య గొడవకు ప్రధాన కారణం అప్పులు. వివిధ కారణాలతో తన అల్లుడు రూ.14-15 లక్షలు అప్పు చేసినట్లు వెంకటమ్మ తండ్రి చెబుతున్నారు. ఈ అప్పులు తాము తీరుస్తామని అతని సోదరులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఇందుకు బదులుగా జీవితాంతం వారితోనే ఉండాలని, వారు చెప్పినట్లు వినాలని వివరించారు. ఒకవిధంగా ఇది బానిసత్వం లాంటిదని, తమ కులంలో ఎప్పటి నుంచో వస్తున్న కులాచారమని ఆయన చెప్పుకొచ్చారు.
వెంకటమ్మను భర్త తన సోదరునికి రూ.5 లక్షలకు అమ్మేందుకు సిద్ధమయ్యారన్నది కూడా అవాస్తవమని పెద్దలు చెబుతున్నారు.
"భర్త సోదరుల కింద బానిసగా ఉండటానికి నా కూతురు ఇష్టపడటం లేదు. కానీ ఇది పెద్దల కాలం నుంచి వస్తున్న ఆచారం కాబట్టి తప్పదని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాం" అని ఆయన అన్నారు.
కేసు ఎందుకు పెట్టారు?
తన మాట వినని భర్తను బెదిరించడం కోసమే వెంకటమ్మ కేసు పెట్టినట్లు ఆమె తండ్రి చెప్పారు. "భర్తను భయపెట్టేందుకు వెంకటమ్మ కేసు పెడతానంది. కేసు ఎందుకులే ఎస్‌ఐతో నాలుగు మాటలు చెప్పించమని అన్నాను" అని ఆయన తెలిపారు.
భర్త తనను బెదిరిస్తుండటం వల్లే కేసు పెట్టినట్లు వెంకటమ్మ చెబుతున్నారు. "నా భర్త తాగుడుకు బానిసయ్యాడు. ఆయనకు అక్రమ సంబంధాలున్నాయి. రూ.15 లక్షల దాకా అప్పుచేశాడు. ఉన్న ఇల్లు కూడా అమ్మేశాడు. చివరకు రూ.1.50 లక్షలకు నా కూతుర్ని అమ్మేందుకు ఒప్పందం రాసుకున్నారు. నాతో బలవంతంగా సంతకాలు చేయించేందుకు నా భర్తా అతని సోదరులు చిత్రహింసలు పెడుతున్నారు. భయపడి మా అమ్మానాన్నల దగ్గరకు వచ్చేశాను. నా భర్త ఇక్కడికి కూడా వచ్చి బెదిరిస్తుంటే పోలీసు కేసు పెట్టాను" అని ఆమె తెలిపారు.
"నా పిల్లలు, నా భర్తతో కలిసి మేం విడిగా ఉండాలి. మాతో నా భర్త సోదరులకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. వారి నుంచి మాకు, నా పుట్టింటివారికి ప్రాణహాని ఉంది. నా భర్త సోదరులు మా కుటుంబానికి, మా పుట్టింటివారికి ఎటువంటి హానీ తలపెట్టమంటూ రాసివ్వాలి" అంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు.
ఆమె ఆరోపణలపై వివరణ కోరేందుకు భర్త, వారి సోదరులను సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ వారిని రిమాండ్‌కు తరలించడం వల్ల ఆ అవకాశం లభించలేదు. ఆమె చెబుతున్నవన్నీ అవాస్తవాలని భర్త తరపు బంధువు సంజన్న అంటున్నారు.
ఒప్పందం ప్రకారం తన మనుమరాలితో తన కుమారుడి పెళ్లి చేస్తామని హామీ ఇస్తే కేసు వెనక్కి తీసుకుంటామని ఆమె తండ్రి అంటున్నారు. కేసు వెనక్కి తీసుకునేందుకు తన కుమార్తెను కూడా ఒప్పిస్తానని ఆయన చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ఫొటో క్రెడిట్: డీఎల్ నరసింహ
కులాచారామైనా సరే.. అమ్మినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం
తన భర్తతో ఉన్న విభేదాల కారణంగానే పిల్లలను అమ్ముతున్నారంటూ ఆమె ఆందోళన చేసిందని నంద్యాల గ్రామీణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జి.రామకృష్ణా రెడ్డి తెలిపారు. అందులోని వాస్తవం లేదని తమ విచారణలో తేలినట్లు చెప్పారు.
కొద్ది రోజుల కిందట ఆమె కేసు పెట్టినప్పుడు తన భర్త, అతని సోదరులు వేధిస్తున్నట్లుగా ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. కానీ అందులో పిల్లల అమ్మకం గురించి ఎక్కడా ప్రస్తావించలేదని సీఐ తెలిపారు. ఆ తరువాత కేసు తన దృష్టికి వచ్చినప్పుడు కూతుర్ని అమ్మడానికి ప్రయత్నించినట్లు ఆమె చెప్పారని వెల్లడించారు.
ఈ విషయాలపై దర్యాప్తు జరుపుతున్నామని కులాచారం ప్రకారమో.. లేక ఏరకంగా అయినా సరే అమ్మినట్లుగా ఏవైనా ఆధారాలు దొరికితే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు.
వెంకటమ్మ ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతున్నట్లు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ అధికారి ఆగ్నేస్ ఏంజెలా తెలిపారు. అమ్మకం వాస్తవమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవాస్తవమయితే భార్యభర్తల మధ్య విభేదాలు తొలగించేందుకు ప్రయత్నిస్తామని ఆమె అన్నారు.
ఆ దురాచారాన్ని ఇక అనుమతించకూడదు: మహిళా శిశు సంక్షేమ శాఖ
ఏపీ మహిళ, శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. అది ఆచారమైనా.. అమ్మకమైనా బాల్య వివాహం కిందకే వస్తుందని నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం నిందితులపై బెయిలబుల్ కేసు ఉందని.. దాన్ని నాన్ బెయిలబుల్ కేసుగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఈ కేసులో ఇరువర్గాలనూ పిలిపిస్తున్నామని చెప్పారు.
ఇలాంటి దురాచారాలను ఎవరూ అనుమతించకూడదని అన్నారు. వీటి వల్ల బాలల భవిష్యత్తు నరకమవుతుందని అభిప్రాయపడ్డారు. వీటిని వెంటనే ఆపాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి.
- భారత్, అమెరికాలది ప్రేమా? ద్వేషమా?
- దక్షిణాది రాష్ట్రాల సీఎంలను మోదీ చిన్నచూపు చూస్తున్నారా
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- #గ్రౌండ్రిపోర్ట్: ఉద్దానం - ఎవరికీ అంతుబట్టని కిడ్నీ వ్యథలు
- ఉపగ్రహ చిత్రాలు: భారత్లో గాలి ఎందుకిలా మారింది?
- సంజయ్ గాంధీకి చరిత్ర అన్యాయం చేసిందా?
- కడప జిల్లా: వీరికి గబ్బిలాలు ‘దేవతలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









