డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అన్‌బరసన్ ఎతిరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి, థింపూ
అబ్బురపరిచే పర్వతాలు, కొండలపై వెలసిన బౌద్ధ ఆరామాలు, ప్రాకృతిక సౌందర్యంతో పర్యాటకులను కట్టిపడేసే హిమాలయ దేశం- భూటాన్! మహానగరాల్లో నిత్యం భారీ రద్దీని, తీవ్రమైన కాలుష్యాన్ని చూసిన వారికి, భూటాన్ రాజధాని థింపూ చాలా భిన్నంగా అనిపిస్తుంది.
స్వచ్ఛమైన గాలి, ఆకుపచ్చ రంగులో కనిపించే కొండలు, కొండలను తాకే మేఘాలతో థింపూ చూపరుల మదిని దోచుకుంటుంది.
రాజధాని నగరంలో భూటాన్ సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు, పెద్దలు ఎక్కువగా నడుస్తూ కనిపిస్తారు. ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థలు లేని ఏకైక దేశం భూటానే కావొచ్చు. ట్రాఫిక్ పోలీసులు చేతులతోనే సిగ్నళ్లు ఇస్తుంటారు.
సుమారు ఎనిమిది లక్షల జనాభా ఉండే భూటాన్‌లో ఇవన్నీ పైకి కనిపించే దృశ్యాలు. కానీ గత ఏడాది నుంచి, బయటకు కనిపించని ఆందోళన ఈ దేశ ప్రజల్లో దాగి ఉంది.

అటు చైనా, ఇటు భారత్
ఉత్తరాన చైనా, దక్షిణాన భారత్‌తో భూటాన్ సరిహద్దులు పంచుకొంటుంది. చైనా, భారత్, భూటాన్ కూడలిలో ఉండే డోక్లాం పర్వత ప్రాంతంలో నిరుడు భారత్, చైనా రక్షణ బలగాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు భూటాన్‌లో ఆందోళన మొదలైంది.
డోక్లాం తమదేనని అటు చైనా, ఇటు భూటాన్ వాదిస్తున్నాయి. భూటాన్ వాదనకు భారత్ మద్దతిస్తోంది.
2017 జూన్‌లో చైనా ఈ ప్రాంతంలో ఒక రోడ్డును విస్తరించే పనులు చేపట్టినప్పుడు, భారత బలగాలు వెళ్లి, పనులను అడ్డుకున్నాయి. ఈ పరిణామం ఇరు దేశాల బలగాల మధ్య ప్రతిష్టంభనకు దారితీసింది.
ఈ రోడ్డు కారణంగా తనకు భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని భారత్ భావించింది.
భవిష్యత్తులో చైనాతో సైనిక ఘర్షణ జరిగితే చైనా బలగాలు ఈ రోడ్డును ఉపయోగించుకొని, వ్యూహాత్మకంగా కీలకమైన (పశ్చిమ బెంగాల్‌లోని) సిలిగురి కారిడార్‌ను చేజిక్కించుకుంటాయనే ఆందోళన భారత్‌లో ఉంది.
సిలిగురి కారిడార్‌ను ఆ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని 'చికెన్స్ నెక్' అని పిలుస్తారు. ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపేది ఈ ప్రాంతమే.

అప్పటివరకు వారికి డోక్లాం ప్రాధాన్యం తెలియదు
నిరుడు డోక్లాంపై చైనా, భారత్ మధ్య వివాదం రేగే వరకు భూటాన్‌లో అత్యధికులకు ఈ ప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యం గురించి తెలియదని థింపూలో మల్టీమీడియా జర్నలిస్టుగా పనిచేస్తున్న నాంగే జామ్ చెప్పారు.
అప్పటివరకు అసలు అదెక్కడుందో కూడా చాలా మందికి తెలియదని ఆమె పేర్కొన్నారు. వివాదం రేగినప్పటి నుంచే డోక్లాం గురించి తమ దేశంలో చర్చించుకొంటున్నారని తెలిపారు.
డోక్లాం ప్రతిష్టంభన భారత్, చైనా మధ్య యుద్ధానికి దారితీస్తుందేమోననే భయాందోళన భూటాన్‌లోని చాలా మంది ప్రజలకు అప్పట్లో కలిగింది.
73 రోజులపాటు ప్రతిష్టంభన
నాటి భారత బలగాల చర్యను 'భారత బలగాల దురాక్రమణ'గా చైనా పేర్కొంది. రెండు దేశాల మధ్య కొన్ని వారాలపాటు విస్తృత దౌత్య సంప్రదింపుల అనంతరం, 73 రోజుల ప్రతిష్టంభనకు తెర పడింది. ఆ ప్రాంతం నుంచి భారత్ బలగాలు వెనక్కు వచ్చాయి.
డోక్లాం ప్రతిష్టంభన గురించి చర్చించేందుకు భూటాన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన తొలగిపోవడాన్ని స్వాగతిస్తూ నిరుడు ఆగస్టులో విడుదల చేసిన ప్రకటనలో ఆచితూచి స్పందించింది.

భూటాన్ విదేశాంగ విధానంపై చర్చ
చైనాతో భూటాన్ సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవాల్సిన సమయం వచ్చిందా అనే చర్చ, భూటాన్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించాలనే వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో కనిపించాయి. భారత ప్రభావం నుంచి భూటాన్ బయటపడాలనే వాదనలూ వినిపించాయి.
భూటాన్‌కు దశాబ్దాలుగా భారత్ సాయం
1950లలో చైనా టిబెట్‌ను ఆక్రమించుకొని, దానిని కలిపేసుకున్న వెంటనే, భూటాన్ భారత్ వైపు స్నేహహస్తం చాచింది. నాటి నుంచి భూటాన్- భారత్ ప్రభావం కిందే ఉంది.
భూటాన్‌కు భారత్ ఆర్థిక, సైనిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. భారత్ సహాయాన్ని అందుకుంటున్న దేశాల్లో ఈ హిమాలయ దేశానిదే ప్రథమ స్థానం. గత పంచవర్ష ప్రణాళిక కింద భారత్, భూటాన్‌కు దాదాపు రూ.5 వేల కోట్ల సహాయాన్ని అందించింది.
వందల మంది భారత సైనికులు భూటాన్‌లో ఉన్నారు. వాళ్లు భూటాన్ బలగాలకు శిక్షణ ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు. భూటాన్ సైనిక ప్రధాన కార్యాలయం డోక్లాంకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'హా'లో ఉంది.
చాలా మంది భూటాన్ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా భారత్ చేస్తున్న సాయంపై కృతజ్ఞత వ్యక్తం చేస్తుండగా, కొందరు, మరీ ప్రత్యేకించి యువత మాత్రం తమ దేశం సొంత కాళ్లపై నిలబడాలని కోరుకొంటున్నారు.
1949లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం, భారత భద్రతా సమస్యలను భూటాన్ పరిగణనలోకి తీసుకుంటుంది. 2007లో ఈ ఒప్పందంలో మార్పులు చేశారు. దీనివల్ల భూటాన్‌కు విదేశీ విధానంలో, సైనిక కొనుగోళ్లలో మరింత స్వేచ్ఛ లభించింది.
'భారత్ నీడలోంచి బయటకు రావాలి'
కొందరు భూటానీలు మాత్రం తమ దేశంపై భారత ప్రభావాన్ని భరించలేకపోతున్నామంటున్నారు.
''ప్రజాస్వామ్యం పరిణతి చెందేకొద్దీ మేం భారత్ నీడలోంచి బయటకు రావాలి. కొందరు అంటున్నట్లు భారత్ కూడా భూటాన్‌ను తమ అధీనంలో ఉన్న దేశంగా భావించకూడదు. భూటాన్ భవిష్యత్తును భూటానే నిర్ణయించుకోనివ్వాలి'' అని రచయిత, రాజకీయ విశ్లేషకులు గోపీలాల్ ఆచార్య వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP
'చైనాతో భూటాన్ ఒప్పందం చేసుకోవాలి'
భూటాన్, చైనాలకు ఉత్తరం, పశ్చిమం వైపున ఉన్న భూభాగాల విషయంలో వివాదాలున్నాయి. భూటాన్‌లోనే ఒక వర్గం చైనాతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తోంది.
రాజకీయ విశ్లేషకులు కర్మా టెన్‌జిన్ మాట్లాడుతూ- ''వీలైనంత తొందరగా చైనాతో ఒప్పందం చేసుకోవాలనేది నా భావన. ఆ తర్వాత దౌత్యపరంగా ముందుకు సాగవచ్చు. లేకపోతే ఈ డోక్లాం సమస్య మళ్లీ మళ్లీ తలెత్తుతూ ఉంటుంది'' అని తెలిపారు. ''భూటాన్ లాంటి శాంతిని ప్రేమించే దేశం ముంగిట రెండు శక్తిమంతమైన దేశాలు ఒకరితో ఒకరు తలపడడం మంచిది కాదు'' అన్నారు.
థింపూలో నేను కొందరితో మాట్లాడగా, భారత్ కొంచెం ఓపిక పట్టి ఉంటే డోక్లాం ప్రతిష్టంభనను నివారించి ఉండొచ్చని వాదించారు. చైనాతో భూటాన్‌కు సుదీర్ఘకాలంగా ఉన్న సరిహద్దు సమస్య పరిష్కారంపై ఈ పరిణామం ప్రభావం చూపొచ్చని వారు ఆందోళన చెందుతున్నారు.
దక్షిణాసియా దేశాలైన నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్‌లలోకి చైనా చొచ్చుకుపోతుండటాన్ని భారత్ నిలువరించలేకపోతోంది. ఈ ప్రాంతంలో భూటాన్ మాత్రమే చైనాతో దౌత్య సంబంధాలు లేని దేశం.
భారత్ తమ సహజ వనరులను దోపిడీ చేస్తోందని భూటాన్‌లోని కొన్ని వర్గాల వారు భావిస్తున్నారు. భారత్ 'పెద్దన్న' తీరు కారణంగా చైనాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని అనుకొంటున్నారు.
భారత్‌తో సంబంధాల విషయంలో నేపాల్.. చైనా కార్డును ఉపయోగిస్తోందని వారు ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
'సమానత్వమే ప్రాతిపదిక కావాలి'
''మా భవిష్యత్తు భారత్‌తో బంధంపైనే ఆధారపడి ఉంది. కానీ భారత్, భూటాన్ మధ్య సంబంధాలు సమానత్వం ప్రాతిపదికగా ఉండాలి. ఇరు దేశాలకూ సముచిత స్థానం ఉండేలా మా ద్వైపాక్షిక బంధాన్ని పునర్ నిర్వచించుకోవాల్సి ఉంది'' అని గోపీలాల్ ఆచార్య చెప్పారు.
ఒకవైపు అంతకంతకూ పెరిగిపోతున్న చైనా ఆర్థిక, సైనిక ప్రాబల్యం భారత్‌కు సవాలుగా పరిణమిస్తున్న తరుణంలో, భారత విదేశాంగ విధానానికి 'పరస్పర గౌరవం' ప్రాతిపదిక కాకపోతే భారత్ తన మిత్రదేశాలను కోల్పేయే ముప్పుంది.
భూటాన్ ఒక చిన్న దేశమే కావొచ్చు, కానీ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. భారత్-చైనా వైరంలో తాము నలిగిపోవడం భూటాన్ ప్రజలకు ఇష్టం లేదు. తమ దేశ సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు ఒకరితో ఒకరు తలపడటాన్ని వారు చూడాలనుకోవడం లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








