హైస్పీడ్ రైలు, మొబైల్ చెల్లింపులను నిజంగా చైనానే కనిపెట్టిందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రతీక్ జఖర్
- హోదా, బీబీసీ మానిటరింగ్
చైనా ప్రభుత్వ మీడియా: హైస్పీడ్ రైలును, మొబైల్ పేమెంట్‌ను, ఈ-కామర్స్‌ను, సైకిళ్ల షేరింగ్‌ను చైనాయే కనిపెట్టింది.
వాస్తవం: ఈ నాలుగింటిలో ఏదీ చైనా కనిపెట్టలేదు. కాకపోతే ఈ నాలుగు టెక్నాలజీల వినియోగంలో చైనా ముందంజలో ఉంది.
ఈ టెక్నాలజీలను చైనాయే ఆవిష్కరించిందనే మాట 2017 మే నుంచి చైనా ప్రభుత్వ మీడియాలో పదే పదే కనిపిస్తోంది.
ఇటీవల చైనా జాతీయ చట్టసభ 'నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ)' డిప్యూటీ అయిన ప్రముఖ వాణిజ్యవేత్త మా హువాటెంగ్ కూడా ఇదే మాట చెప్పారు. ఆయన్ను పోనీ మా అని కూడా పిలుస్తారు. ఆయన చైనా ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ టెన్సెంట్‌కు ముఖ్య కార్యనిర్వాణాధికారి. 'హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్' ప్రకారం చైనాలో అత్యంత సంపన్నుడు ఆయనే.
ఎన్‌పీసీ వద్ద పోనీ మా జర్నలిస్టులతో మాట్లాడుతూ- హైస్పీడ్ రైలు, మొబైల్ పేమెంట్, ఈ-కామర్స్, సైకిళ్ల షేరింగ్ రూపంలో చైనా 'నాలుగు సరికొత్త మహా ఆవిష్కరణలు' తీసుకొచ్చిందని చెప్పారు. వీటిలో ఏదీ చైనాలో కనిపెట్టకపోతే మరి ఈ ప్రచారం ఎక్కడ నుంచి వచ్చింది?
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీజింగ్ ఫారన్ స్టడీస్ యూనివర్శిటీ 2017 మేలో ఒక సర్వే చేపట్టింది. ''చైనా నుంచి మీ దేశానికి తీసుకెళ్లాలనుకొనే నాలుగు టెక్నాలజీలు ఏవి'' అని ఈ సర్వేలో భాగంగా 20 దేశాలకు చెందిన యువతను నిర్వాహకులు ప్రశ్నించారు. వారి సమాధానాల జాబితాలో అగ్రభాగాన కనిపించిన టెక్నాలజీలు ఏవంటే- హైస్పీడ్ రైలు, మొబైల్ పేమెంట్, ఈ-కామర్స్, సైకిళ్ల షేరింగ్. ఈ వివరాలు వెల్లడైనప్పటి నుంచి ఈ టెక్నాలజీలను 'నాలుగు సరికొత్త మహా ఆవిష్కరణలు'గా చైనా ప్రభుత్వ మీడియాతోపాటు అధికారులు చెబుతున్నారు.
చైనా పూర్వకాలంలో కాగితం తయారీని, గన్ పౌడర్‌ను, ముద్రణను, దిక్సూచిని కనిపెట్టింది. ఈ నాలుగు ప్రాచీన ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకొని హైస్పీడ్ రైలు తదితర నాలుగు ఆవిష్కరణలను 'నాలుగు సరికొత్త మహా ఆవిష్కరణలు'గా చైనా మీడియా, అధికారులు పేర్కొంటున్నారు.
లక్ష్యం: 2020లోగా 'ఆవిష్కరణల దేశం'గా చైనా
2020లోగా తాను 'ఆవిష్కరణల దేశం'గా అవతరించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక పరిజ్ఞానంలో అభివృద్ధిని సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తోంది. ''టెక్నాలజీలో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలే ఇంతకాలం ఆధిపత్యం వహిస్తూ వచ్చాయి. కీలక టెక్నాలజీలను తనంతట తాను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను చైనా గుర్తించింది. వీటిని సొంతంగా అభివృద్ధి చేసుకోగలిగితేనే చైనా ఈ విషయంలో స్వతంత్రతను సాధించగలదు, భాగస్వాములు, పోటీదారుల గౌరవాన్ని పొందగలదు'' అని జిన్హువా వార్తాసంస్థ వ్యాఖ్యానించింది.
పరిశోధనపై నిధుల వ్యయం: రెండో స్థానంలో చైనా
వరల్డ్ ఎకనమిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) గణాంకాల ప్రకారం పరిశోధన-అభివృద్ధిపై ప్రపంచంలోకెల్లా అత్యధింగా అమెరికా నిధులు వెచ్చిస్తుండగా, ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. పరిశోధన-అభివృద్ధిపై 2015లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేయగా, ఇందులో చైనా వెచ్చించిన సొమ్ము 21 శాతంగా ఉంది. 2010 నుంచి 2015 మధ్య చైనా వ్యయం ఏటా సగటున 18 శాతం పెరిగింది.

ఫొటో సోర్స్, AFP/GETTY/JIJI PRESS
ఏది హైస్పీడ్ రైలు?
'హైస్పీడ్ రైలు'కు ప్రామాణిక నిర్వచనమంటూ ఏదీ లేదు. యూరోపియన్ యూనియన్(ఈయూ) అయితే కొత్త పట్టాలపై గంటకు కనీసం 250 కిలోమీటర్లు, పాత పట్టాలపైనైతే గంటకు కనీసం 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలును హైస్పీడ్ రైలుగా పేర్కొంటుంది.
వరల్డ్‌వైడ్ రైల్ ఆర్గనైజేషన్(యూఐసీ) సమాచారం ప్రకారం- ప్రపంచంలో తొలి హైస్పీడ్ రైలు సేవలు 1964లో జపాన్‌లో మొదలయ్యాయి. ఆ రైలును షింకాన్సెన్ అని బుల్లెట్ రైలు అని పిలుస్తారు. టోక్యో, ఒసాకా మార్గంలో ఈ సేవలు మొదలయ్యాయి. మొదట్లో ఈ మార్గంలో రైళ్లు గంటకు 210 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించేవి.
జపాన్‌లో కంటే ముందు ఫ్రాన్స్‌లో 1955లో ఒక రైలు గంటకు 331 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఇంత వేగంతో రైళ్లు నిత్యం రాకపోకలు సాగించింది మాత్రం టోక్యో-ఒసాకా మార్గంలోనే.
చైనా తన తొలి హైస్పీడ్ రైలు మార్గాన్ని బీజింగ్, టియాన్‌జిన్ మధ్య 2008లో ఒలింపిక్స్ క్రీడాపోటీల ప్రారంభానికి ముందు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
మొబైల్ చెల్లింపులు
మొబైల్ ద్వారా కొన్ని చెల్లింపులు తొలిసారిగా 1997లో ఫిన్‌లాండ్‌లో జరిగాయి. ఒక పేఫోన్ నంబరుకు కాల్ చేయడం ద్వారా చెల్లింపులు జరిగేలా టెలికం ఫిన్‌లాండ్ ఏర్పాట్లు చేసింది. ఒక మ్యూజిక్ జ్యూక్‌బాక్స్‌కు, పానీయాల విక్రయ యంత్రాలకు ఈ విధానంలో చెల్లింపులు జరిపేందుకు వీలు కల్పించింది. ఈ ఏర్పాట్లు చేసిన పానీయ విక్రయ కేంద్రాల్లో హెల్సింకీ విమానాశ్రయంలోని కోకాకోలా విక్రయ యంత్రాలు కూడా ఉన్నాయి. కొందరేమో 2014లో 'ఆపిల్ పే' వచ్చిన తర్వాతే మొబైల్ చెల్లింపు టెక్నాలజీ వినియోగంలోకి వచ్చిందని చెబుతారు.
ఆన్‌లైన్ షాపింగ్
ఆన్‌లైన్ షాపింగ్ విధానాన్ని బ్రిటన్ వాసి మైకేల్ ఆల్డ్రిచ్ 1979లోనే కనుగొన్నారు. ఇంగ్లండ్‌లోని గేట్స్‌హెడ్ పట్టణంలో వీడియోటెక్స్ అనే టెక్నాలజీని ఉపయోగించి, ఆయన ఒక సాధారణ టీవీని టెలిఫోన్ లైన్ ద్వారా స్థానిక దుకాణదారుడి కంప్యూటర్‌కు అనుసంధానించారు. ఈ-వాణిజ్యం 1990ల్లో బాగా వ్యాప్తిలోకి వచ్చింది. 1995లో అమెజాన్, ఈబే తమ వెబ్‌సైట్లు ప్రారంభించిన తర్వాత ఈ-కామర్స్ విధానం జనాదరణను చూరగొంది.

ఫొటో సోర్స్, AFP/Getty Images
సైకిళ్ల షేరింగ్
సైకిళ్ల షేరింగ్ విధానం తొలిసారిగా నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో అమల్లోకి వచ్చింది. దీనిని 'వైట్ బైసికిల్ ప్లాన్'గా పిలిచేవారు. ఈ విధానం విస్తృతంగా 1990ల్లో ఐరోపా నగరాల్లో అమల్లోకి వచ్చింది. డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో దీనిని తొలిసారిగా ప్రవేశపెట్టారు. మొబైక్, ఓఫో లాంటి చైనా సంస్థలు టెక్నాలజీ అండతో ఈ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. స్మార్ట్‌ఫోన్ల సాయంతో సైకిళ్ల లభ్యతను గుర్తించి, వాటిని వాడుకొని, ఎక్కడ కావాలనుకొంటే అక్కడ వదిలివేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది.
వినియోగంలో అందరికన్నా ముందు
హైస్పీడ్ రైళ్లు, మొబైల్ చెల్లింపు, ఈ-కామర్స్, సైకిళ్ల షేరింగ్ టెక్నాలజీలను అందిపుచ్చుకొని, పెద్దయెత్తున వినియోగించడంలో చైనా ఇతర దేశాల కన్నా ముందంజలో ఉంది.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హైస్పీడ్ రైల్వే వ్యవస్థ చైనాలోనే ఉంది. సుమారు 25 వేల కిలోమీటర్ల మేర ఇది అందుబాటులో ఉంది. ఈ పరిధిని 2030లోగా రెండింతలు చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా పరిశ్రమలు, ఐటీ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 2017లో జనవరి నుంచి అక్టోబరు వరకు 12.7 లక్షల కోట్ల డాలర్ల విలువైన మొబైల్ చెల్లింపులు జరిగాయి.
ప్రపంచంలోకెల్లా చైనా అతిపెద్ద, అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్ అని 2017లో ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ చేసిన ఒక సర్వే తెలిపింది. దేశంలోఇంటర్నెట్ వాడకందారులు 70 కోట్లకు పైనే ఉన్నారు.
చైనా రవాణాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో వెల్లడించిన వివరాల ప్రకారం సైకిళ్ల షేరింగ్‌కు సంబంధించి దేశంలో 40 కోట్ల మంది రిజిస్టర్డు వాడకందారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








