అమెరికా-చైనా ట్రేడ్ వార్: భారత్‌పై ప్రభావం ఎంత?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై చైనా 3 బిలియన్ డాలర్ల పన్నులు విధించింది.
చైనా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, అల్యూమినియంలపై 60బిలియన్ డాలర్ల వార్షిక పన్ను విధిస్తూ మార్చి 23న అమెరికా ఆదేశాలు జారీ చేసింది.
దీనికి ప్రతీకారంగా తాజాగా చైనా కూడా అమెరికా నుంచి వచ్చే 128 వస్తువులపై సుంకాలను 25శాతం వరకు విధించింది.
పన్నులు విధించిన జాబితాలో అమెరికా మద్యం, పలు రకాల పండ్లు, పంది మాంసం, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి.
అమెరికా విధించిన ఆంక్షల వల్ల కలిగే నష్టాన్ని పూడ్చుకునేందుకు, తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు చైనా తెలిపింది.
వాణిజ్యంలో అమెరికా కోట్ల డాలర్లు నష్టపోతున్నప్పుడు ట్రేడ్‌వార్ వల్ల మంచే జరుగుతుందని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కొన్ని అమెరికా వస్తువులకు చైనా ప్రధాన మార్కెట్.
ఉదాహరణకు అమెరికా పంది మాంసం దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా మూడో అతిపెద్ద దేశం.
ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
ట్రేడ్ వార్ భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
ఈ వివాదం మరింత తీవ్రమైతే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అసోచామ్ అభిప్రాయపడింది.
భారత ఎగుమతులపై ఆ ప్రభావం ఉంటుందని తెలిపింది. అందుకే భారత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హార్వర్డ్ యూనివర్శిటీ ప్రొఫెసర్, ఆర్ధికవేత్త గీతా గోపీనాథ్ స్పష్టం చేశారు.
ప్రపంచ స్వేచ్ఛాయుత వాణిజ్యంలో భారత్ కూడా భాగస్వామి. వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే భారత్‌పై ఆ ప్రభావం తప్పకుండా పడుతుందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పత్రికతో ఆయన చెప్పారు.
ఒక్క అంతర్జాతీయ వాణిజ్యమే కాదు, బ్యాంకులు, వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణంపైనా ఆ ప్రభావం ఉంటుందని, మొత్తంగా భారత వృద్ధిరేటు మందగించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషించారు.
అమెరికా-చైనా వ్యాపార యుద్ధం భారత వజ్రాల పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది.
వజ్రాలు, ఆభరణాలను భారత్, చైనా నుంచి అమెరికా అధికంగా దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం వీటిపై అమెరికా 6 శాతం సుంకం విధించింది.
చైనా స్టీల్, అల్యూమినియంతో పాటు వజ్రాలు, ఆభరణాలపై కూడా పన్నులు వేస్తే ఆ ప్రభావం భారత ఎగుమతులపైనా ఉంటుందని ఎకనమిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
అయితే, ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉందని, దానిపై ట్రేడ్ వార్ ప్రభావం ఉండకపోవచ్చని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ అభిప్రాయపడింది.
అమెరికా-చైనా మధ్య పూర్తిస్థాయిలో వాణిజ్య యుద్ధం మొదలైతే అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ రాబర్టో హెచ్చరించారు.
తమ దేశ ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో అమెరికా-చైనాలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.
ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళనలు ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









