వాణిజ్య యుద్ధాలు మంచివేనన్న డొనాల్డ్ ట్రంప్.. మండిపడుతున్న చైనా, ఇతర దేశాలు

ఫొటో సోర్స్, EPA
అమెరికాలో దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంలపై పన్ను విధించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించడంపై ఉక్కు ఎగుమతి దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇలాంటి నిర్ణయాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అమెరికాకు ఉక్కు సరఫరా చేసే కెనడా, ఈయూ తెలిపాయి.
మెక్సికో, చైనా, బ్రెజిల్ కూడా ఇదే విధంగా ప్రతిస్పందించాయి. 'ఆమోదయోగ్యం కాని వాణిజ్య విధానాల వల్ల అమెరికా పతనమవుతోంది' అని ట్రంప్ ట్వీట్ చేశారు.
దేశంలో ఉక్కు దిగుమతిపై 25 శాతం, అల్యూమినియం దిగుమతిపై 10 శాతం సుంకాలు విధించనున్నట్లు ఆయన తెలిపారు.
అయితే, ఈ చర్యల వల్ల అమెరికాలో ఉద్యోగ భద్రత పోతుందని, అంతిమంగా దేశంలో వినియోగదారులపైనే ఈ భారం పడుతుందని విమర్శకులు అంటున్నారు. ట్రంప్ ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్ డోజోన్స్ 1.7 శాతం క్షీణించింది.
ఎవరెలా స్పందించారు?
అమెరికా నిర్ణయంతో యూరప్‌లో ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్ క్లాడ్ జంకర్ పేర్కొన్నారు.
'అలాంటి చర్యల మూలంగా మా పరిశ్రమలు దెబ్బతింటుంటే చూస్తూ కూర్చోం. మా ప్రయోజనాలను రక్షించుకునే విధంగా సరైన చర్యలు తీసుకుంటాం' అని అమెరికాకు భారీ స్థాయిలో ఉక్కు ఎగుమతి చేస్తున్న కెనడా పేర్కొంది.
కొత్త పన్ను నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఆ దేశ వాణిజ్య మంత్రి ప్రాంకోయిస్ ఫిలప్పీ అన్నారు.
ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలిగిస్తుందని బ్రెజిల్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ వాణిజ్య సంస్థ(వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నిబంధనలను అమెరికా ఉల్లంఘిస్తుందని, ట్రంప్ నిర్ణయం జర్మనీ ఉక్కు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆ దేశ ఉక్కు సమాఖ్య డబ్ల్యూవీ స్టాల్ తెలిపింది.
ప్రపంచంలో అత్యధికంగా ఉక్కు ఉత్పత్తి చేసే చైనా ఈ నిర్ణయంపై స్పందిస్తూ.. అన్ని దేశాలూ అమెరికా బాటలో నడిస్తే.. అతర్జాతీయ వర్తకంపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పింది.
అయితే, పన్ను విధింపుపై నిర్మాణాత్మక చర్చలు జరిపేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆర్థిక సలహాదారు లీ హీ గురువారం ట్రంప్ పరిపాలన అధికారిని కలిశారని వైట్‌హౌజ్ తెలిపింది.
ట్రంప్ ఏమంటున్నారు?
అమెరికాలో ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలకు పూర్వవైభవం తీసుకొస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు.
దశాబ్దాలుగా అసమంజస విధానాలతో ఇతర దేశాలతో చేసుకున్న తప్పుడు ఒప్పందాల వల్లే దేశంలో ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.
'మన దేశం అల్యూమినియం, ఉక్కులను ఉత్పత్తి చేయకపోతే మనం ఒక దేశంగా మనలేం. ఉక్కు, అల్యూమినియంలను ఉత్పత్తి చేసే గొప్ప తయారీదారులు మనకు కావాలి' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇతర దేశాలు భారీ స్థాయిలో ఉక్కును అమెరికాకు సరఫరా చేసి ఇక్కడి ఉక్కు పరిశ్రమలను, కార్మికులను నాశనం చేస్తున్నాయని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే విమర్శించారు.
వాణిజ్య యుద్ధాలు మంచివేనని, వాటిని గెలవటం కూడా సులభమని.. ఉక్కు ఉత్పత్తులపై పన్ను నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు.

ఫొటో సోర్స్, PA
అమెరికా ఉక్కు పరిశ్రమ ఎలా ఉందంటే?
అమెరికా తన ఎగుమతులకంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉక్కు దిగుమతి చేసుకుంటుంది. దాదాపు 100 దేశాలు అమెరికాకు ఉక్కును సరఫరా చేస్తున్నాయి.
2008 ఆర్థిక మాంద్యం తర్వాత దేశంలో ఉక్కు పరిశ్రమ మళ్లీ నిలదొక్కుకుంటుందని అమెరికా ఇంధన వనరుల విభాగం తెలిపింది.
2000వ సంవత్సరంలో 112 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసిన అమెరికా.. 2016లో 86.5 మిలియన్ టన్నుల ఉక్కు మాత్రమే ఉత్పత్తి చేసింది.
ఇవి కూడా చదవండి:
- అసలు న్యూక్లియర్ బటన్ ట్రంప్ వద్దే ఉంటుందా?
- అణు దాడి జరిగితే ట్రంప్ ఎక్కడ తలదాచుకుంటారు?
- పండ్ల రసాలు తాగుతున్నారా! పళ్లు జాగ్రత్త!!
- సిరియా: అసలేం జరుగుతోంది? ఎవరు ఎవరి వైపు?
- ఈ బిల్లు మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటుందా?
- చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
- డొనాల్డ్ ట్రంప్: విమర్శించిన నోటితోనే చైనాను పొగడటానికి కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









