అమెరికా వీసాకు.. ఫేస్‌బుక్ ఖాతాకూ లంకె!

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా రావాలని అనుకుంటున్న ప్రతి ఒక్కరి సోషల్ మీడియా చరిత్రను సేకరించాలని అమెరికా భావిస్తోంది.
అమెరికా కొత్తగా తెచ్చిన ప్రతిపాదన ప్రకారం.. చాలా మంది వీసా దరఖాస్తుదారులు తమ ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతా వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది.
గత అయిదేళ్లలో వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల వివరాలను చెప్పాల్సి ఉంటుంది.
ఈ ప్రతిపాదన వల్ల ఏటా 1.47 కోట్ల మంది ఇబ్బంది పడే వీలుందని అంచనా.

ఫొటో సోర్స్, Getty Images
వీటితో పాటు.. గత అయిదేళ్లలో వినియోగించిన టెలిఫోన్ నంబర్లు, ఈమెయిల్ చిరునామాలు, పర్యటన చరిత్ర వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
వీసాకు దరఖాస్తు చేసుకునేటపుడు తాము గతంలో ఏ దేశం నుంచైనా బహిష్కరణకు గురయ్యారా.. తమ బంధువులు ఎవరైనా ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్నారా వంటి వివరాలను కూడా వెల్లడించాలి.
ఈ సమాచారం ఆధారంగా ఇమిగ్రెంట్.. నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం చూస్తున్నవారి దరఖాస్తులను గుర్తించి పక్కన పెట్టేందుకు వీలుంటుంది.
ఈ ప్రతిపాదన వల్ల వీసా అవసరం లేకుండా అమెరికాకు వెళ్లే హోదా ఉన్న బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
కానీ.. వీసా కోసం ఏటా వేల దరఖాస్తులు పంపే భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపే వీలుంది.
భారత్, చైనా, మెక్సికో వంటి దేశాలకు చెందిన వారు అమెరికాకు రావాలంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పేలా లేదు.

ఫొటో సోర్స్, Facebook/USCIS
అయితే ప్రతిపాదనను అమెరికా అధికారులు మాత్రం గట్టిగా సమర్థిస్తున్నారు. తీవ్రవాదులను గుర్తించేందుకు ఇది సహకరిస్తుందని చెబుతున్నారు.
మరోవైపు, ఈ ప్రతిపాదనను పౌర హక్కుల సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
అయితే ఈ అంశం ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై రెండు నెలల పాటు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుంది. తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.
కేవలం ఫేస్‌బుక్, ట్విటర్లే కాకుండా ఇన్‌స్టా, లింక్డిన్, రెడ్డిట్, యూట్యూబ్ వంటి సైట్లను కూడా ఈ తనిఖీ జాబితాలో చేర్చాలని భావిస్తున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








