రివెంజ్ పోర్న్: అసభ్యకర చిత్రాలకు చెక్ పెట్టనున్న ఫేస్‌బుక్

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమలో విఫలమైన అబ్బాయిలు తమ మాజీ గాళ్‌ఫ్రెండ్స్‌కి సంబంధించిన అభ్యంతరకర ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ కక్ష సాధింపునకు పాల్పడే ట్రెండ్ ఇటీవలి కాలంలో విస్తరిస్తోంది. దానికి చెక్ పెట్టేందుకు ఫేస్‌బుక్ ఓ కొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.
అబ్బాయిల నుంచి ముప్పు ఉందని భావించే అమ్మాయిలు తమ ఫొటోలను ఫేస్‌బుక్ సంస్థకి పంపిస్తే, వాటి లింక్‌ని భద్రపరచుకొని దాని ఆధారంగా ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ కాకుండా చూసేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. దీని కోసం ‘ఫింగర్ ప్రింట్’ అనే కొత్త సాంకేతికను ఆ సంస్థ పరీక్షిస్తోంది.
ఆస్ట్రేలియాలో 18-45ఏళ్ల మధ్య వయసున్న ఆడవాళ్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఫొటోల ద్వారా వేధింపులకు గురయ్యారని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే ఫేస్‌బుక్ ఈ సాంకేతికతను పరీక్షించడానికి మొదట ఆ దేశాన్నే ఎంచుకుంది. అబ్బాయిలు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టడానికి ముందే వాటిని తమకు పంపిస్తే, వాటి లింక్‌ని సేకరించి, దాని ఆధారంగా ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ కాకుండా చూస్తామని ఆ సంస్థ భరోసా ఇస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది?
ఫేస్‌బుక్ అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ మొదట ఫొటోకి సంబంధించిన ‘ఫింగర్ ప్రింట్’ని తీసుకుంటుంది. అంటే.. ఫొటోని కాకుండా దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే నిక్షిప్తం చేసుకుంటుంది. కృత్రిమ మేధస్సు, ఫొటో మ్యాచింగ్ సాఫ్ట్‌వేర్‌ల సాయంతో ఆ ఫొటోలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ కాకుండా నివారించేలా టెక్నాలజీని అభివృద్ధి చేసింది.
అమ్మాయిలు పంపే ఫొటోల లింక్ మాత్రమే ఫేస్‌బుక్ దగ్గర ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లే వాటిని ప్రాసెస్ చేస్తాయి. ఏ వ్యక్తికీ వాటిని తెరిచి చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఆసక్తి ఉన్న అమ్మాయిలు ఎలాంటి భయం లేకుండా అభ్యంతరకర చిత్రాలను తమకు పంపించొచ్చని ఫేస్‌బుక్ ఆస్ట్రేలియా విభాగం చెబుతోంది.
‘రివెంజ్ పోర్న్ సంస్కృతి ఆస్ట్రేలియాలో రోజురోజుకీ పెరుగుతోంది. దాన్ని అరికట్టేందుకు ఫేస్‌బుక్ చేస్తోన్న ఈ ప్రయత్నం అభినందనీయం’ అంటారు ఆస్ట్రేలియా ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ గ్రాంట్.
‘ఈ టెక్నాలజీ కొంత వరకూ ఉపయోగపడుతుంది. కానీ రోజూ వేల సంఖ్యలో అమ్మాయిల నగ్న చిత్రాలు ఫేస్‌బుక్‌లోకి అప్‌లోడ్ అవుతున్నాయి. వాటిని అరికట్టడానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సంస్థలూ వీటిపైన దృష్టిపెట్టాలి’ అంటారు డర్హమ్ లా స్కూల్‌కి చెందిన న్యాయ నిపుణురాలు ప్రొఫెసర్.క్లేర్ మెక్‌గ్లిన్.

ఫొటో సోర్స్, Getty Images
‘తమకు అందే చిత్రాల భద్రతపైన ఫేస్‌బుక్ దృష్టిపెట్టాలి. అవి బయటకు రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి’ అని సూచిస్తారు గ్రహమ్ క్లూలీ అనే సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్.
ఇదిలా ఉండగా... ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో అసభ్యకర చిత్రాలను నివారించేందుకు ఫేస్‌బుక్ చర్యలు చేపట్టింది. ఈ మార్చిలో అమెరికాకు చెందిన మెరైన్ యునైటెడ్ అనే ప్రైవేట్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో తోటి ఉద్యోగినుల అసభ్యకర చిత్రాలను పంచుకుంటున్న విషయం బయటికొచ్చింది. దాంతో ‘ఫొటో మ్యాచింగ్’ టెక్నాలజీని రంగంలోకి దించిన ఫేస్‌బుక్ ఆ ఫొటోలను తొలగించడంతో పాటు, అలాంటి చిత్రాలను పంచుకుంటున్న గ్రూప్‌ల ఖాతాలనూ రద్దు చేసింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










