దెయ్యాల భయం వదిలించడానికి హేతువాదుల చొరవ
దెయ్యం వల్ల చేటు జరుగుతుందనే మూఢనమ్మకాన్ని పోగొట్టేందుకు తెలంగాణలో కాశీగూడ అనే గ్రామంలో హేతువాదుల బృందం వినూత్న ప్రయోగం చేసింది. 'దెయ్యంతో సెల్ఫీ (సెల్ఫీ విత్ ఘోస్ట్)', 'దెయ్యంతో భోజనం (డిన్నర్ విత్ డెవిల్)' పేర్లతో కార్యక్రమాలు చేపట్టింది. శనివారం అర్ధరాత్రి కాశీగూడలోని శ్మశానం నుంచి ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించింది.
కాశీగూడ తెలంగాణలోని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఉంది. ''ఊళ్లో ఆడ దెయ్యం తిరుగుతోంది. మగాళ్లను చంపేస్తోంది'' అనే ప్రచారంతో పలు కుటుంబాలు ఊరు వదిలి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో, సైన్స్ ఫర్ సొసైటీ, ఇండియన్ హ్యూమనిస్ట్స్, బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి.
ప్రముఖ హేతువాది బాబు గోగినేని, విజయవాడకు చెందిన జర్నలిస్టు, హేతువాది కుమార్ సాయి, చంద్రయ్య, కృష్ణారావు, అజయ్ కుమార్, లక్ష్మణ్‌రావు, సుదర్శన్ తదితరులు స్థానికుల్లో అవగాహన కల్పించేందుకు శనివారం, ఆదివారం ఇంద్రజాలం, నిప్పుల మీద నడక, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు.
ఫేస్‌బుక్ లైవ్ కార్యక్రమంలో కుమార్ సాయి అడిగిన ప్రశ్నలకు బాబు గోగినేని బదులిస్తూ- సహజ మరణాలను, కలుషిత నీటివల్ల వచ్చే టైఫాయిడ్, కామెర్లు లాంటి ఆరోగ్య సమస్యలు, జన్యు లోపాల వల్ల వచ్చే వ్యాధులు, లేదా ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను లేని దెయ్యాలకు ముడిపెట్టడం సరికాదని చెప్పారు.
''మాతో సెల్ఫీ దిగాలని దెయ్యాన్ని కోరాం. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్- నాలుగు భాషల్లో పిలిచినా 'దెయ్యం' రాలేదు. అసలు ఉంటేగా రావడానికి..'' అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఫేస్‌బుక్ లైవ్ ప్రధానాంశాలను ఈ వీడియోలో చూడండి. వీడియో క్రెడిట్: కుమార్ సాయి/బాబు గోగినేని ఫేస్‌బుక్ గ్రూప్/సునీల్.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)