‘ఎయిర్ ఇండియా వన్’కు అత్యాధునిక క్షిపణి నిరోధక వ్యవస్థ విక్రయానికి అమెరికా ఆమోదం

ఫొటో సోర్స్, Getty Images
భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి ప్రయాణించే ‘ఎయిర్ ఇండియా వన్’ విమానాలకు మరింత పటిష్ఠమైన రక్షణ అందుబాటులోకి రానుంది. అత్యాధునికమైన క్షిపణి నిరోధక వ్యవస్థలను ఎయిర్ ఇండియా వన్ కోసం భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది.
అమెరికా, భారత్ వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు సహకరించే ఈ విక్రయ ఒప్పందం అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రతకు తోడ్పడుతుందని పెంటగాన్ అభిప్రాయపడింది.
లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ కౌంటర్‌మెజర్స్(ఎల్ఏఐఆర్‌సీఏఎం) సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్(ఎస్‌పీఎస్)గా పిలిచే క్షిపణి నిరోధక వ్యవస్థలను సుమారు 19 కోట్ల డాలర్ల(సుమారు రూ. 1360 కోట్లు) ధరకు విక్రయిస్తున్నట్లు యూఎస్ డిఫెన్స్ సెక్యూరిటీ కోపరేషన్ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాని, రాష్ట్రపతిల విమానాలకు క్షిపణి దాడుల ముప్పు తప్పించేందుకు గాను ఇటీవల భారత ప్రభుత్వం ఈ అత్యాధునిక వ్యవస్థలను తమకు విక్రయించాలని కోరిన మేరకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ ఇండియా వన్ విమానాలకు వీటిని అమర్చితే అమెరికా అధ్యక్షుడి 'ఎయిర్‌ఫోర్స్ వన్' విమానంతో సరిసమానమైన భద్రత కలుగుతుంది.
లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ కౌంటర్‌మెజర్స్ వ్యవస్థను అమర్చితే క్రూ వార్నింగ్ టైం పెరగడంతో పాటు, పొరపాటున వచ్చే హెచ్చరికలు తగ్గుతాయని.. మధ్యశ్రేణి క్షిపణి వ్యవస్థలపై ఆటోమేటిగ్గా ప్రతిదాడి చేస్తుందని అమెరికన్ సైంటిస్ట్స్ ఫెడరేషన్ వెల్లడించింది.
ముప్పు కలిగించే క్షిపణులను గుర్తించినవెంటనే ఈ వ్యవస్థ పైలట్‌కు సమాచారం అందించి సిబ్బంది అవసరం లేకుండా ఆటోమేటిగ్గా ప్రతిదాడి చేస్తుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్(ఎస్‌పీఎస్)తో మరింత బలమైన నిరోధక వ్యవస్థను ఎయిర్ఇండియా వన్ సంతరించుకుంటుంది. ప్రాంతీయంగా ఎదురయ్యే ముప్పులను నివారించడానికి ఇవి ఉపయోగపడతాయి.

ఫొటో సోర్స్, Getty Images
''ఏఎన్/ఏఏక్యూ 24(వీ)ఎన్ లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రారెడ్ కౌంటర్‌మెజర్స్, ఏఎల్‌క్యూ-211(వీ)8 అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్సివ్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్(ఏఐడీఈడబ్ల్యూఎస్), ఏఎన్/ఏఎల్ఈ-47 కౌంటర్ మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్(సీఎండీఎస్) ఉన్న రెండు ఎస్‌పీఎస్ కావాలని భారత్ మమ్మల్ని కోరింది'' అని పెంటగాన్ తన నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
''ఇందులో 12 గార్డియన్ లేజర్ ట్రాన్స్‌మిటర్ అసెంబ్లీలు ఏఎన్/ఏఏక్యూ 24(వీ)ఎన్ ఉంటాయి.(ఆరింటిని విమానాల్లో అమర్చుతారు, ఆరు అదనంగా ఉంటాయి). ఎనిమిది ఎల్ఏఐఆర్‌సీఎం సిస్టమ్ ప్రాసెసర్ రీప్లేస్‌మెంట్స్(వీటిలో రెండిటిని విమానాలకు అమర్చుతారు, ఆరు అదనంగా రిజర్వ్‌లో ఉంటాయి). 23 మిసైల్ వార్నింగ్ సెన్సర్లు. 5 కౌంటర్‌మెజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్స్ ఉంటాయి'' అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ విక్రయం వల్ల ఆ ప్రాంతంలో ఇప్పుడున్న సైనిక సమతుల్యతలో ఎలాంటి మార్పూ ఉండదని అమెరికా వెల్లడించింది.
అమెరికా భారత్‌కు రెండో అతిపెద్ద ఆయుధ ఎగుమతి దేశం. 2018లో అమెరికా భారత్‌కు స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్-1 హోదా కల్పించింది. దక్షిణాసియాలో అమెరికా నుంచి ఈ హోదా పొందిన ఏకైక దేశం భారత్. ఆసియాలో చూసుకుంటే భారత్ కంటే ముందు జపాన్, దక్షిణకొరియాలకు ఈ హోదా ఉంది. ఈ హోదా ఉంటే అమెరికా నుంచి రక్షణ కొనుగోళ్లు సులభతరమవుతాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








