ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?

రాబర్ట్ వాద్రా

ఫొటో సోర్స్, Getty Images

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీన జైపూర్‌లోని ఈడీ కార్యాలయంలో జరగనుంది.

ఈ నేపథ్యంలో రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి? ఆ కేసుల్లో ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలేంటి? ఎన్డీటీవీ కథనం ప్రకారం...

యునైటెడ్ కింగ్‌డమ్ ఆస్తుల కేసు

లండన్‌లోని 12, బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లో 1.9 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.17.77 కోట్లు) విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని, ఈ ఆస్తి రాబర్ట్ వాద్రాకు చెందినదేనని ఈడీ ఆరోపిస్తోంది.

బ్రయాన్‌స్టోన్‌లోని భవనంతోపాటు 4 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.37.42 కోట్లు) విలువైన మరో రెండు ఆస్తులు, 5 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.46.77 కోట్లు) విలువైన ఇంకో రెండు ఆస్తులు... మొత్తం 6 భవనాలు వాద్రాకు ఉన్నాయని ఈడీ భావిస్తోంది. ఈ భవనాలన్నింటి ఖరీదు రూ. వంద కోట్లపైమాటేనని అంచనా వేస్తోంది. 2005 నుంచి 2010వ సంవత్సరం మధ్యలో ఈ ఆస్తులను కొనుగోలు చేశారు.

బికనీర్ భూముల కేసు

బికనీర్ సమీపంలోని కొలాయట్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీ స్కై లైట్ హాస్పిటాలిటీ భూములు కొనుగోలు చేసిన వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందని 2015 సెప్టెంబర్‌లో ఈడీ కేసు నమోదు చేసింది. పేద గ్రామాల పునరావాసానికి సంబంధించిన భూములు అవి.

69.55 హెక్టార్ల (సుమారు 173 ఎకరాల) భూమిని రూ.72 లక్షలకు కొనుగోలు చేసి.. అక్రమ లావాదేవీల ద్వారా రూ.5.15 కోట్లకు అల్లెగెన్సీ ఫిన్‌లీజ్ అనే సంస్థకు అమ్మేశారని ఈడీ చెబుతోంది.

అల్లెజెన్సీ అనే సంస్థకు అసలు వాస్తవంగా ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలూ లేవని, ఇదొక నకిలీ సంస్థ అని తమ విచారణలో తేలినట్లు ఈడీ వివరించింది.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోలియం ఒప్పందంలో అవినీతి

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో 2009వ సంవత్సరంలో జరిగిన పెట్రోలియం ఒప్పందంలో రాబర్ట్ వాద్రా, ఆయన అనుయాయులకు లంచాలు అందాయని ఈడీ ఆరోపిస్తోంది.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన పెట్రోలియం, రక్షణ ఒప్పందాల ద్వారా వాద్రా లబ్ధి పొందారని, ఆ సొమ్ముతోనే లండన్‌లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు కొనుగోలు చేశారని బీజేపీ ఆరోపించింది.

పెట్రోలియం ఒప్పందంలో పొందిన లంచాలతోనే వాద్రా లండన్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఈడీ కూడా తెలిపింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని సాన్‌టెక్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి ఈ నిధులు వెళ్లాయని, వర్టెక్స్ అనే ఒక ప్రైవేటు సంస్థ నుంచి బ్రయాన్‌స్టోన్ స్క్వేర్‌లోని బంగళాను సాన్‌టెక్ కొనుగోలు చేసిందని... ఆ తర్వాత వర్టెక్స్ షేర్లు స్కైలైట్ ఇన్వెస్ట్‌మెట్ సంస్థకు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. స్కైలైట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు విదేశాల్లో స్థిరపడిన భారతీయ వ్యాపారవేత్త సీ తంపి నేతృత్వం వహిస్తున్నారు.

గురుగావ్ భూముల కేసు

గురుగావ్ (ప్రస్తుత గురుగ్రామ్)లో భూముల కొనుగోళ్లలో అవకతవకలపై 2018 సెప్టెంబర్‌లో రాబర్ట్ వాద్రా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాలపై కేసు నమోదయ్యింది.

వాద్రా కంపెనీ స్కైలైట్ హాస్పిటాలిటీ షికొపూర్ గ్రామంలోని 3.5 ఎకరాల భూమిని వాస్తవ ధర కంటే ఎక్కువ మొత్తానికి డీఎల్‌ఎఫ్ సంస్థకు విక్రయించిందని, ఈ లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)