అభిప్రాయం: రాజీవ్‌కు బోఫోర్స్.. మోదీకి రఫేల్?

- రచయిత, స్వాతి చతుర్వేది
- హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తన మాటల చాతుర్యంపై చాలా నమ్మకం ఉంది. ఆయన్ను ఒక మంచి వక్తగా భావిస్తారు. అయితే, రఫేల్ ఒప్పందం గురించి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాస్స్‌వో హోలన్ సంచలన వ్యాఖ్యలు చేసి 48 గంటలైనా ప్రధాని మౌనంగానే ఉన్నారు.
కోట్ల రూపాయల రఫేల్ ఒప్పందంలో అనిల్ అంబానీని భారత ప్రభుత్వమే ఆఫ్సెట్ పార్ట్‌నర్‌లా మాపై 'రుద్దిందని' హోలన్ చెప్పారు. దీంతో ఈ ఒప్పందంలో పార్ట్‌నర్ ఎంచుకోవడంలో ప్రభుత్వ ప్రమేయం లేదని, విమానాలు తయారు చేసే దసో ఏవియేషనే దానిని ఎంచుకుందన్న మోదీ సర్కారు వాదనల్లో పసలేదని తేలిపోయింది.
రక్షణపై జరిగిన క్యాబినెట్ భేటీ(సీసీఎస్)లో పాల్గొన్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లాంటి టాప్ మంత్రులు కూడా అదే మాట చెబుతూ వచ్చారు.
అసలు దసో ఏ కంపెనీని తమ భాగస్వామిగా ఎంచుకుందో కూడా ప్రభుత్వానికి తెలీదని సీతారామన్ చెప్పారు. కానీ, ఈ వాదన అంత నమ్మకంగా అనిపించదు. ఎందుకంటే, నాగ్‌పూర్‌లో అంబానీ ఫ్యాక్టరీని ఆమె సహచర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ప్రారంభించారు.
అయినా మోదీ ప్రభుత్వం వైపు నుంచి నమ్మలేని వాదనలు, ప్రకటనలు వినిపిస్తూనే ఉన్నాయి. గత వారం విజయ్ మాల్యా పారిపోయే ముందు తనను కలిశాడని చెప్పడంలో నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
మాల్యాకు తనెప్పుడూ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చెప్పారు. కానీ మీటింగ్ జరిగింది, మాల్యా పారిపోయారు కూడా. కానీ మన ఆర్థిక మంత్రి తనను కాపాడుకోడానికి బలం లేని లీగల్ రీజన్స్ చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రఫేల్ కుంభకోణం
ఈ కుంభకోణం మూలం చూస్తే, మోదీ ద్వారా కోట్ల డాలర్ల జెట్ విమానాలు కొనుగోలు చేశారు. దానికి అవసరమైన అనుమతులు స్పష్టంగా లేవు. దానికి తోడు అనిల్ అంబానీ ఆయనతో ఉన్నారు. ఆయన కొన్ని రోజుల ముందే రక్షణ నిర్మాణ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించారు.
మోదీ పారిస్‌లో ఈ ఒప్పందం గురించి ప్రకటించారు. ఆ సమయంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా అది విని ఆశ్చర్యపోయారు.
ప్రపంచంలోని టాప్ రక్షణ కంపెనీల్లో ఒకటైన దసోను భారత ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ రంగంలో ఏమాత్రం అనుభవం లేని, ఇటీవల ఏర్పడిన ఒక కంపెనీతో కలిపింది. ఆ పని కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను కూడా పక్కన పెట్టారు. అటు దసో కూడా ఎలాంటి ఎదురు ప్రశ్నలు వేయకుండా వారు చెప్పినట్టే చేసింది.

ఫొటో సోర్స్, DASSAULT RAFALE
బలహీనంగా ప్రభుత్వం డిఫెన్స్
సాధారణంగా సమస్యలపై పెద్దగా పట్టుబట్టని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారీ రఫేల్ ఒప్పందంలో భాగస్వామిని ఎంచుకోవడంలో కుంభకోణం జరిగిందని గట్టిగా వాదిస్తున్నారు.
మోదీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి బలమైన డిఫెన్స్ లేకుండానే ఆ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. సీతారామన్ మొదట ఆ జెట్ విమానాల ధర ఎంతో చెబుతానని అన్నారు. కానీ తర్వాత అందులో రహస్యంగా ఉంచాల్సిన 'గోప్యతా నిబంధనలు' ఉన్నాయని మాటమార్చారు.
ఈ మధ్యలో మోదీ ప్రభుత్వంలోని 'చీర్ లీడర్స్, ఆయన ప్రచారకులు' మాత్రం 'ఈ ఒప్పందంలో అవినీతి కాదు, తెలివితక్కువ తనం ఉందని' ఎలాంటి విచారణ లేకుండానే మోదీ ప్రభుత్వానికి మీడియాలో క్లీన్ చిట్ ఇచ్చేశారు.
ప్రస్తుత సర్కారును కీర్తించడంలో మునిగిపోయిన భారత మీడియాలోని ఒక భాగం దీన్ని పట్టించుకోకపోయినా, రఫేల్ కుంభకోణం మోదీ ప్రభుత్వానికి పెద్ద షాకే ఇచ్చింది.
ఇప్పుడు, మోదీ మౌనంగా ఉండడం వల్ల ఆయనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇటు, అనిల్ అంబానీ కూడా 'రక్షణ రంగంలో ఎలాంటి అనుభవం లేని వారికి ఈ ఒప్పందం అప్పగించారని' ప్రశ్నించిన విపక్ష నేతలపైనే పరువు నష్టం కేసులు వేస్తున్నారు.
మీడియా తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆపాలని కూడా అంబానీ అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందు ముందు ఏం జరుగుతుంది?
ఇక్కడ గమనిస్తే, ఇలాంటి ఆఫ్‌సెట్ ఒప్పందాల్లో అత్యున్నత స్థాయి రక్షణ నిర్మాణం ట్రాక్ రికార్డ్ ఉండడంతోపాటు, మొదటి నుంచీ ప్రభుత్వ సంస్థ అయిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)ను కేంద్రం పక్కనపెట్టిందనే విషయం తెలుస్తుంది.
రక్షణ మంత్రిగా ఉన్న ప్రతిపక్షంలోని ఒక సీనియర్ నేత అయితే 'ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం షాక్ తిన్నట్టు కనిపిస్తోందని' అన్నారు.
ప్రజల డబ్బుకు తనను తాను చౌకీదార్(గార్డ్)గా చెప్పుకున్న మోదీ వాదనపై కుంభకోణం ప్రభావం ఎక్కువగా పడుతుంది. రఫేల్ ఒప్పందం విషయంలో మోదీ స్వయంగా ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఉంటే, జరగబోయే నష్టంతో ఆయన వ్యక్తిత్వంపై కూడా ప్రభావం పడుతుంది.

ఫొటో సోర్స్, AFP
ప్రతిపక్షంలోని ఒక సీనియర్ నేత చెప్పినట్టు రఫేల్ డీల్ రాబోవు సాధారణ ఎన్నికల్లో పెద్ద అంశంగా అవుతుంది. రాహుల్ గాంధీ కూడా తన ప్రతినిధుల సమావేశంలో ఇదే మాట చెప్పారు. "మోదీ, అనిల్ అంబానీ కలిసి భారతీయ భద్రతాదళాలపై 130 వేలకోట్ల రూపాయల సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. మోదీజీ మీరు మన అమర జవాన్ల రక్తాన్ని అవమానించారు. అందుకు సిగ్గుపడాలి. మీరు భారత్ ఆత్మను మోసం చేశారు" అన్నారు.
విపక్షాలు ప్రధానిపై ఆరోపణలు సంధిస్తున్న ఈ జోరును చూస్తే మరో సంకేతం కూడా కనిపిస్తోంది. ఫ్రాన్స్‌వో హోలన్ వ్యాఖ్యల గురించి ఫ్రాన్స్ మీడియా తొందరలోనే ఫాలోఅప్ ఇస్తుందనే ఆశించవచ్చు.
ఇప్పటివరకైతే నాకు ఒకటే అనిపిస్తోంది. పాత భూతం బోఫోర్స్‌లా, మళ్లీ ఒక రక్షణ ఒప్పందం మరో ప్రధానమంత్రి వ్యూహాలను తలకిందులు చేయవచ్చు.
( రచయిత్రి వ్యక్తిగత అభిప్రాయం )
ఇవి కూడా చూడండి:
- ఇద్దరమ్మాయిలు.. ఒక చిన్న విమానం.. లక్ష్యం 23దేశాలు.. గడువు 100 రోజులు
- పాకిస్తాన్‌లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు?
- కొత్త రాజధానిలో జనాలు కరవు
- బొమ్మ కాదు బాంబు: పిల్లలను చంపేస్తున్న క్లస్టర్ బాంబులు
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దక్షిణ కొరియా జేమ్స్ బాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








