ఉత్తర కొరియా అణ్వాయుధాల తయారీని మొదట కనిపెట్టింది ఈ గూఢచారే

- రచయిత, కిమ్ హ్యుంగ్-యిఉన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది ఒక దక్షిణ కొరియా జేమ్స్ బాండ్ కథ. ఉత్తర కొరియా అణ్వాయుధాలు తయారు చేస్తోందని అందరికంటే ముందు కనిపెట్టింది ఈ గూఢచారే.
నిఘా ఆపరేషన్స్ నిపుణులైన పార్క్ చే సియో.. ఉత్తర కొరియాలోని అణ్వాయుధాల గురించి 1992లోనే వివరాలు సేకరించారు.
ఆ సమయంలో పార్క్ చే సియో అమెరికా ఏజెన్సీ సీఐఏతో కలిసి పని చేశారు.
దక్షిణ కొరియా సైన్యంలోని నిఘా విభాగం తమ పొరుగు దేశం పరమాణు సామర్థ్యం గురించి ఆధారాలు సేకరించాలనుకుంది.
పార్క్ చే సియో, మరో నిఘా అధికారి 1990 నుంచి ఈ మిషన్ కోసం పనిచేయడం మొదలు పెట్టారు.
దానికి ఏడాది ముందే ఉత్తర కొరియాలోని యోంగ్‌బ్యాన్‌లో ఉన్న అణు ప్లాంట్ శాటిలైట్ ఫొటో మొదటిసారి వెలుగులోకి వచ్చింది.
పార్క్ ఈ మిషన్ కోసం ఒక న్యూక్లియర్ ఎనర్జీ ప్రొఫెసర్‌ను సంప్రదించి, ఉత్తర కొరియా పరమాణు కార్యక్రమం వివరాలు తెలుసుకున్నారు.
దీంతో ఆయన నైపుణ్యం చూసిన దక్షిణ కొరియా నిఘా ఏజెన్సీ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆయన రంగంలోకి దిగేందుకు అంగీకరించింది.

ఫొటో సోర్స్, Kim Dang
మిషన్ లక్ష్యం
1995లో ఉత్తర కొరియాలో చొరబడి గూఢచర్యం చేసేందుకు పార్క్ చే సియోను ప్రత్యేకంగా ఎంచుకున్నారు.
చైనా రాజధాని బీజింగ్ వెళ్లిన పార్క్, మిలిటరీ కమాండర్ నుంచి వ్యాపారవేత్తగా మారిన వ్యక్తిగా తనను తాను పరిచయం చేసుకున్నారు.
ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్క్.. తాను ఉత్తర కొరియా ప్రస్తుత దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్‌ను స్వయంగా కలిసినట్లు వెల్లడించారు.
ఉత్తర కొరియాలోకి అడుగుపెడుతున్న వారు ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుందని అన్నారు.

ఫొటో సోర్స్, Kim Dang
ఉత్తర కొరియా గురించి ఏదైనా వివరాలు రాబట్టాలంటే దానికి ముందు అక్కడికి వస్తూపోతూ ఉండే స్వేచ్ఛ ఉండాలి.
దానికంటే మొదట ఉత్తర కొరియా నుంచి ఆ స్వేచ్ఛకు గ్యారంటీ కోరాలి.
ఉత్తర కొరియా ప్రభుత్వంలోని పెద్ద అధికారులు కూడా కలవాలనుకునేంతగా.. తాను ఒక పెద్ద హోదాలో ఉన్నట్టు పార్క్ వారిని నమ్మించారు.
నాటి దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ యాంగ్ శామ్ సన్నిహితుల నుంచి తనకు ఈ విషయంలో సాయం లభించిందని పార్క్ తెలిపారు.
అయితే ఎవరినైనా కలవడం అనేది ఒక విషయం, వారి నమ్మకం గెలుచుకోవడం అనేది మరో విషయం.

ఫొటో సోర్స్, Kim Dang
ఆ సమయంలో పార్క్ ఒక దక్షిణకొరియా అడ్వటైజింగ్ సంస్థ ప్రతినిధిగా, ఒక ఉభయ కొరియా అడ్వటైజింగ్ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు నటిస్తున్నారు.
ఉత్తర కొరియా అధికారులు పార్క్‌ను కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళ్లారు. ఆయనను ఒప్పించి ఆ ప్రాజెక్టు పొందాలి.. అదీ పార్క్ ముందున్న సవాలు.
ఉత్తర కొరియా అధికారులు ఎవరితో అయినా కలిసి పనిచేయాలని అనుకున్నప్పుడు, వారి దగ్గర తమ దేశానికి నమ్మకస్తుడుగా ఉండాలని ప్రమాణం చేయిస్తారు. ఒక దస్తావేజుపై సంతకం చేయించుకుంటారు. దానినంతా చిత్రీకరిస్తారు కూడా.
కానీ పార్క్ దీనికి ఒప్పుకోలేదు. తాను గతంలో దక్షిణ కొరియా ఆర్మీ మేజర్ అని, తానక్కడికి వ్యాపారం నిమిత్తం వచ్చానని, అందువల్ల తనను బలవంత పెట్టవద్దని కోరారు.

ఫొటో సోర్స్, Kim Dang
సుప్రీం లీడర్‌తో కలయిక
పార్క్ చే సియో జూన్, 1997లో ఉత్తర కొరియా చైర్మన్ కిమ్ జోంగ్ ఇల్‌ను కలిసారు.
''నన్ను చైర్మన్ కిమ్ జోంగ్ ఇల్ వద్దకు తీసుకెళుతున్నారంటే, నన్ను నమ్మినట్లే'' అని పార్క్ వివరించారు.
కానీ ఒక కమ్యూనిస్టు ప్రభుత్వ అధినేతకు అడ్వటైజింగ్ పాజెక్ట్ గురించి ఎలా వివరించాలి?
కిమ్ జోంగ్ ఇల్‌ను కలిసినపుడు ఆయన చాలా సౌమ్యంగా కనిపించాడని, తనతో చాలా మర్యాదగా ప్రవర్తించారని పార్క్ తెలిపారు.
ఆయనకు మంచి నిర్ణాయక శక్తి ఉందని, చాలా పట్టుదల గల వ్యక్తిగా కనిపించారని వివరించారు.
''ఆయన సూటిగా, ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడతారు'' అని పార్క్ తెలిపారు.

ఫొటో సోర్స్, Kim Dang
కథలో ట్విస్ట్
ఈ భేటీ వల్ల కిమ్ జోంగ్ ఇల్‌కు 1997 డిసెంబర్‌లో జరగబోయే ఎన్నికలలో దక్షిణ కొరియా అధ్యక్ష అభ్యర్థి కిమ్ డే జంగ్ గెలవడం ఇష్టం లేదని అర్థమైంది. (అయితే ఆయన అభీష్టానికి భిన్నంగా కిమ్ డే జంగ్ ఎన్నికల్లో విజయం సాధించారు. 2000లో ఆయనే ఉభయ కొరియాల చరిత్రాత్మక సదస్సును ఏర్పాటు చేశారు.)
ఈ విషయాన్ని పార్క్ దక్షిణ కొరియా ఇంటలిజెన్స్ ఏజెన్సీకి కూడా తెలిపారు. అయితే ఆయనకు తెలిసింది ఏమిటంటే ఆ ఇంటలిజెన్స్ ఏజెన్సీకి కూడా కిమ్ డే జంగ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇష్టం లేదు. అందువల్ల అది ఈ విషయంలో ఉత్తర కొరియాతో చేతులు కలపడానికి సిద్ధమైంది.
డీమిలిటరైజ్డ్ జోన్ వద్ద ఉత్తర కొరియా ఒక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేస్తే, దాని వల్ల ఓటర్లు కిమ్ ప్రత్యర్థి లీ హోయి చాంగ్ వైపు మొగ్గు చూపుతారని ఏజెన్సీ వ్యూహం పన్నింది.
అయితే అది సరికాదని భావించి పార్క్ ఈ విషయాన్ని కిమ్ డే జంగ్ మద్దతుదారులకు సమాచారం అందించారు.
అలాగే ఉత్తర కొరియా అధికారులు కూడా ఎలాంటి నిరనస ప్రదర్శనలు నిర్వహించకుండా చేయగలిగారు.
ఎట్టకేలకు కిమ్ డే జంగ్ గెలవడంతో ఉభయ కొరియాల మధ్య సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభం అయింది.
ఎన్నికలు పూర్తయ్యాక, కిమ్ డే జంగ్ గెలవకుండా చూడాలని తనను ఒప్పించిన అధికారులను కిమ్ జోంగ్ ఇల్ అంతమొందించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఫొటో సోర్స్, Kim Dang
అండర్ కవర్ ఏజెంట్ అన్న విషయం ఎలా బయటపడింది?
పార్క్ కిమ్ జోంగ్ ఇల్‌ను కలిసిన ఏడాది తర్వాత కిమ్ డే జంగ్ అధికార పగ్గాలు చేపట్టారు.
ఆ సమయంలో దక్షిణ కొరియా ఇంటలిజెన్స్ ఏజెన్సీ కావాలని ఎన్నికల ముందు తాము ఉత్తర కొరియాతో కలిసిన విషయం ఉన్న ఫైల్‌ను లీక్ చేసింది.
కేవలం కిమ్ డే జంగ్ ప్రభుత్వం మరింత లోతుగా పరిశోధన చేసి, తాము చేసిన పని గుర్తించకుండా చేయడానికి పన్నిన ముందస్తు వ్యూహం అది.

ఫొటో సోర్స్, Kim Dang
'బ్లాక్ వీనస్'
ఇదే ఫైలులో 'బ్లాక్ వీనస్' గురించి సమాచారం కూడా ఉంది. అది పార్క్ కోడ్ నేమ్.
దీంతో పార్క్ ఇక గూఢచారిగా పని చేసే అవకాశం లేకుండా పోయింది. ఆయన బీజింగ్‌కు వెళ్లి తన కుటుంబంతో పాటు 2010 వరకు 'సాధారణ జీవితం' గడిపారు.
అదే సంవత్సరం 'బ్లాక్ వీనస్' దక్షిణ కొరియాకు చెందిన రహస్య సమసాచారాన్ని ఉత్తర కొరియాకు అందజేశాడని ఆరోపించారు.
పార్క్‌కు ఆరేళ్ల జైలుశిక్ష విధించగా, ఆయన దానిని పూర్తి చేశారు.
అయితే తాను ఉత్తర కొరియాకు కొంత సమాచారం అందించిన మాట నిజమే కానీ అది రహస్య సమాచారం కాదని పార్క్ అంటున్నారు.
తనను 'డబుల్ ఏజెంట్' అని ఆరోపించడంపై పార్క్, ''ఇంటలిజెన్స్ పరిభాషలో డబుల్ ఏజెంట్ అన్న పదం చాలా అసహ్యకరమైనంది. నేను అలాంటి పని ఎన్నడూ చేయలేదు'' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అయితే తన స్వదేశం మీద తనకెలాంటి కోపమూ లేదని ఆయన అన్నారు.
''నేను నా దేశాన్ని ప్రేమిస్తాను. ఆ మిషన్‌లో నేను చాలా కష్టపడ్డాను. కొన్నిసార్లు దానికి తగిన ప్రతిఫలం లభించింది. నేను చేసిన పనిపై నాకెలాంటి పశ్చాత్తాపం లేదు.'' అని చెప్పారు.
(పార్క్ సాహసాలపై తీసిన 'ద స్పై గాన్ నార్త్' అనే సినిమాను ఈ ఏడాది కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆగస్టులో దక్షిణ కొరియా సినిమా థియేటర్లలో కూడా దాన్ని విడుదల చేశారు.)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








