దక్షిణ కొరియాతో చర్చలకు అంగీకరించిన ఉత్తర కొరియా

ఫొటో సోర్స్, Getty Images
వచ్చే వారంలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా అంగీకరించిందని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.
ఫిబ్రవరిలో దక్షిణ కొరియాలో జరగనున్న వింటర్ ఒలంపిక్స్‌కు తన క్రీడాకారులను పంపించాలని ఉత్తర కొరియా ప్రయత్నిస్తోంది. అందుకోసం దక్షిణ కొరియాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు.
దక్షిణ కొరియా కూడా అందుకు సానుకూలంగా స్పందించింది.
అదే విషయంపై ఈ నెల 9న ఇరు దేశాల మధ్య జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించనున్నారు.
రెండు దేశాల సరిహద్దులోని పన్ముంజోమ్ గ్రామంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.
ఈ గ్రామానికి 'శాంతి నిలయం' అన్న పేరుంది. గతంలోనూ ఇరు దేశాల మధ్య జరిగిన అనేక చర్చలకు వేదికైంది.

ఫొటో సోర్స్, Getty Images
వింటర్ ఒలంపిక్స్ క్రీడలే ఈ సమావేశంలో ప్రధానాంశం అవుతుందని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయ అధికారి తెలిపారు.
ఒలంపిక్స్ అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత.. ఇరు దేశాల మధ్య మైత్రిని పెంపొందించే దిశగానూ చర్చలు జరుగే అవకాశముందని దక్షిణ కొరియాలోని వార్తా సంస్థతో ఆ అధికారి అన్నారు.
2015 డిసెంబర్ తర్వాత ఈ దేశాల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరగడం ఇదే తొలిసారి. అయితే.. ఈ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారు? అన్న విషయం తెలియాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Reuters
కొరియా దేశాల మధ్య మైత్రిని పెంచుకునేందుకు వింటర్ ఒలంపిక్స్ 'మంచి అవకాశం'గా ఉపయోగపడుతుందని ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయిన్ అన్నారు.
ఆ తర్వాత ఉత్తర కొరియా చర్చలకు ద్వారం తెరుస్తూ గతవారం దక్షిణ కొరియాను ఫోన్‌లో సంప్రదించింది.
అనంతరం ఫ్యాక్స్ ద్వారా తమ అంగీకారాన్ని తెలియజేసినట్టు దక్షిణ కొరియా తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
'ఇది తాత్కాలికమే'
కొన్నాళ్లుగా అమెరికా.. ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్నాయి.
ఇరు దేశాలూ పరస్పరం అణు దాడులకు దిగుతామంటూ బెదిరించుకున్నాయి.
ఎవరు చెప్పినా వినేది లేదంటూ వరుసగా అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణుల పరీక్షలు చేయడంతో ఉత్తర కొరియాపై అంతర్జాతీయంగా ఆంక్షలు తీవ్రమయ్యాయి.
ఒలంపిక్స్ జరిగే సమయంలోనే దక్షిణ కొరియా - అమెరికా సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టాల్సి ఉంది.
అయితే.. ఒలంపిక్స్ సజావుగా జరగాలన్న ఆలోచనతో దక్షిణ కొరియా చేసిన విజ్ఞప్తికి స్పందించిన అమెరికా డ్రిల్స్‌ను వాయిదా వేసింది.
ఈ మిలిటరీ డ్రిల్స్ తాత్కాలికంగా మాత్రమే వాయిదా వేశామని.. క్రీడలు ముగిశాక మార్చిలో యథావిధిగా డ్రిల్స్ ఉంటాయని అమెరికా రక్షణ శాఖ సెక్రటరీ జేమ్స్ మ్యాటిస్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
"జాయింట్ మిలిటరీ డ్రిల్స్ వాయిదా వేయడమంటే ఉత్తర కొరియాపై ఒత్తిడి పెంచడంలో రాజీకి వచ్చామని కాదు. ఆ దేశంపై అంతర్జాతీయంగా మరింత ఒత్తిడి పెంచుతాం. ప్రస్తుతం జపాన్ చుట్టూ నెలకొన్న పరిస్థితులు రెండో ప్రపంచ యుద్ధం కాలం కంటే ప్రమాదకరంగా ఉన్నాయి" అని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









