ప్రెస్‌రివ్యూ: ‘చంద్రబాబు చంద్రగిరి నుంచి కాకుండా కుప్పం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?’

ఫొటో సోర్స్, ysjagan/facebook
ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచే వైకాపా గెలుపు ప్రారంభం కావాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారని సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
కుప్పంలో రిటైర్డు ఐఏఎస్ అధికారి కె.చంద్రమౌళిని గెలిపిస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుంటానని జగన్ ప్రకటించారు.
'చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరి నుంచి కాకుండా కుప్పం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఆయన సొంత గ్రామం నారావారి పల్లె కూడా చంద్రగిరిలోనే ఉంది. చంద్రగిరిలో బీసీలు తక్కువ. కుప్పంలో బీసీలు చాలా ఎక్కువ. బీసీలు అమాయకులని.. వారిని తేలిగ్గా మోసం చేయొవచ్చని.. చంద్రగిరి కాకుండా కుప్పంను ఎంచుకున్నారు. బీసీ సోదరులు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నా' అంటూ జగన్ వ్యాఖ్యానించారు.
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 52వ రోజు గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర సాగింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగడానికి వీల్లేదు - హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలను కట్టడి చేయాల్సిందేనని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది.
2016 డిసెంబరు 26 తామిచ్చిన ఉత్తర్వులను ఈ సంక్రాంతికి కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పిందని ఈనాడు ఓ కథనాన్ని ప్రచురించింది.
తమ ఉత్తర్వులకు విరుద్ధంగా పందేలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
కోడి పందేలను నిలువరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలు సమర్పించాలని ఏపీ సీఎస్, డీజీపీలను ధర్మాసనం ఆదేశించింది.
అధికారులు కళ్లు మూసుకోవచ్చేమోగానీ న్యాయస్థానం కళ్లు మూసుకుని లేదనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఈ సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందేలు జరగడానికి వీల్లేదని ఏసీజే స్పష్టం చేశారు.
తమ ఉత్తర్వులపై అభ్యంతరముంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని సూచించారు.

ఫొటో సోర్స్, dgptelangana/facebook
త్వరలో 14,400 కానిస్టేబుళ్ల నియామకాలు
త్వరలో పోలీసుశాఖలో 14,400 కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ ఆర్థికశాఖ అనుమతి మంజూరుచేసిందని నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.
ఇందుకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుమతికోసం వెళ్లినట్టు సమాచారం. దీనిపై సీఎం సంతకం చేసిన తర్వాత నియామక ప్రక్రియ మొదలవుతుంది. త్వరలోనే పోలీసు నియామక మండలి నుంచి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పోలీసు సిబ్బందిని పెంచాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖాపరమైన నివేదిక కోరారు.
దాంతో రాష్ట్రంలో 30,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు అవసరమంటూ పోలీసు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
వాటిలో ఇప్పటికే 12,000 మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తై.. అర్హత పొందిన అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు మిగతా 14,400 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది.

ఫొటో సోర్స్, CHANDAN KHANNA/AFP/Getty
రూ.200 నోటు కోసం రూ.120 కోట్ల ఖర్చు
ఏటీఎంల ద్వారా పూర్తిస్థాయిలో రూ.200 నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులపై దాదాపు రూ.120 కోట్ల భారం పడుతుందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
గతేడాది ఆర్‌బీఐ విడుదల చేసిన రూ.200 నోట్లను ఎటీఎంల ద్వారా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి.
ఇందుకోసం ఎటీఎంలలో మార్పులు చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా 30 వేల క్యాష్ రీసైకిలర్స్ సహా దాదాపు 2.4 లక్షల ఏటీఎంలు ఉన్నాయి.
ఈ ప్రక్రియ మొత్తం పూర్తవ్వాలంటే బ్యాంకులు దాదాపు రూ. 100-120 కోట్ల వరకు ఖర్చును భరించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు.
ఇప్పటికే కొన్ని బ్యాంకుల ఏటీఎంలలో మార్పులు చేసినట్టు ఎన్‌సీఆర్ కార్పొరేషన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవ్రోజ్ దస్తర్ వెల్లడించారు.
కొన్ని బ్యాంకుల మార్గదర్శకాలకు అనుగుణంగా 2,000 రూపాయల నోటు స్థానంలో 200 నోటుకు స్థానం కల్పించినట్లు మరో సంస్థ హిటాచీ ఎండి లోనీ ఆంటోని తెలిపారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM/getty
ఫీజులు పెంచొద్దు
వచ్చే 2018-19 విద్యాసంవత్సరానికి గానూ ఫీజులు పెంచవద్దని సెంట్రల్ సిలబస్ పాఠశాలలకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు నవ తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించాల్సి ఉందనీ, ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ 2017-18 సంవత్సరం ఫీజులనే కొనసాగిం చాలని ఆదేశించారు.
డీఈఓలు, ఆర్‌జేడీలు అన్ని పాఠశాలలకు సమాచారమివ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇతర కథనాలు:
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
- కాలేజీలను తిట్టడం సరే, తల్లిదండ్రులుగా మనమేం చేస్తున్నాం?
- #గమ్యం : 2020 తర్వాత వైద్యరంగంలో ఈ కోర్సులదే హవా
- హెచ్-1బీ: అమెరికా వీసాల వివాదానికి కారణాలేంటి? భారతీయులకు ఎంత నష్టం?
- పిల్లల్లో సోషల్ సంఘర్షణ
- ఇంటెల్, ఏఎమ్‌డీ, ఏఆర్ఎమ్ చిప్స్‌లో తీవ్రమైన లోపాలు.. సరిదిద్దే పనిలో టెక్ సంస్థలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








