ఉత్తర కొరియా: దేశం వదిలి పారిపోయింది ఒకరైతే హింస మరొకరిపై

- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తర కొరియాలో తప్పు చేసిన వాళ్లకే కాదు, చేయని వాళ్లకూ చిత్రహింసలు తప్పట్లేదు.
ఓ మహిళ దేశం వదలి పారిపోతే ఆమె సోదరిని అరెస్టు చేసి చిత్ర హింసలు పెట్టారు. ఆమెతో సమాధులకు గోతులు తవ్వించారు.
మి రి యోంగ్ పదిహేనేళ్ల క్రితం ఉత్తర కొరియాలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీని నిర్వహించేవారు. ఓ రోజు ఆమె సోదరి కుటుంబం ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయింది.
అక్కడికి వెళ్లాక తామెవరన్న విషయాన్ని మి రి యోంగ్ సోదరి ఓ టీవీ ఛానెల్‌తో పంచుకున్నారు. దాంతో ఉత్తర కొరియాలో ఉండే మి రి యోంగ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది.
సోదరి దేశం వదిలి వెళ్లడంతో తమ దేశంలో ఉండే మి రి యోంగ్‌ను ఉత్తర కొరియా అధికారులు అరెస్టు చేశారు.
జైల్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. జైల్లో చనిపోయిన వారిని పూడ్చడానికి గోతులు తవ్వించి ఆమెతోనే ఖననం చేయించారు. ఆ సమయంలో అనుభవించిన వేదనను మాటల్లో చెప్పలేనంటారు మి రి యోంగ్.
‘నన్ను కొన్నాళ్లపాటు జైల్లో చిత్ర వధ చేశారు. అక్కడ పోలీసుల చేతిలో దెబ్బలు తిని చనిపోయిన వారిని నాతోనే ఖననం చేయించేవారు.
నేను బయటికొచ్చాక నా భర్తతో విడాకులిప్పించారు. సొంతూరి నుంచి నన్ను దూరంగా పంపించారు.
నా కూతుర్ని కూడా నా వెంట రానివ్వలేదు. దాంతో నేను చైనా పారిపోవాలని నిర్ణయించుకున్నా’ అంటూ తన బాధల్ని గుర్తు చేసుకుంటారు మి రి యోంగ్.

ఫొటో సోర్స్, AFP
సోదరి సహాయంతో మి రి యోంగ్ ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు.
అక్కడ బతుకుదెరువు కోసం ఓ రెస్టారెంట్‌లో రోజుకు పదిహేను గంటల పాటు పనిచేసేవారు.
ఉత్తర కొరియాలో జీవితం నరకప్రాయమనీ, తన కూతురు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయిందనీ అంటారు మి రి యోంగ్.
1953లో కొరియా యుద్ధం ముగిశాక 30వేల మందికి పైగా ఉత్తర కొరియన్లు దక్షిణ కొరియాకు పారిపోయారు. వాళ్లంతా ఉత్తర కొరియాలో నానా ఇబ్బందులూ పడి అక్కడ జీవించలేక చైనా మీదుగా దక్షిణ కొరియాలో అడుగు పెట్టారు.
వలసదారుల్లో చాలామంది ఇప్పటికీ ఉత్తర కొరియాపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాము తప్పించుకోగలిగినా తమ బంధువులు చాలామంది క్లిష్టమైన పరిస్థితుల్లో ఆ దేశంలో బతుకుతున్నారని వారు చెబుతారు. వాళ్లలో చాలామంది తమ బంధువుల్ని ఉత్తర కొరియా నుంచి బయట పడేయాలని ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు.
ఉత్తర కొరియాలో మనుషులు రోబోల్లా జీవిస్తారనీ, వారికి అక్కడ ఏమాత్రం గౌరవం దక్కదనీ చెబుతారు మమ్ మిహ్వా అనే మరో మహిళ. ఆమె కూడా ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోయి వచ్చినవారే.

మమ్ మిహ్వా భర్త గతంలో ఉత్తర కొరియా ఆర్మీలో అధికారిగా పనిచేసేవారు. 1990ల్లో ఆ దేశంలో తీవ్రమైన కరవు నెలకొంది. దాంతో అక్కడి నుంచి పారిపోవాలని మమ్ మిహ్వా నిర్ణయించుకున్నారు.
దేశ సరిహద్దును దాటే క్రమంలో ఆమె ముగ్గురు కూతుళ్లలో ఒకరు తప్పిపోయారు. మమ్ మిహ్వా పారిపోయిన విషయం తెలీడంతో ఆమె భర్తను ఉత్తర కొరియా ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది.
ప్రస్తుతం మమ్ మిహ్వా దక్షిణ కొరియాలోనే ఉంటున్నారు. ఎప్పటికీ తనకు ఉత్తర కొరియా వెళ్లే ఆలోచన లేదంటున్నారు.
కొన్నేళ్లుగా ఉత్తర కొరియా నుంచి పారిపోయే వాళ్ల సంఖ్య బాగా తగ్గినా వలసలు పూర్తిగా ఆగలేదు.
‘ఉత్తర కొరియా నుంచి పారిపోయి వచ్చిన వాళ్లు దక్షిణ కొరియాలో ఇమడడానికి చాలా సమయం పడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న వాళ్లకైనా ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు కొత్తగా అనిపిస్తాయి. వాళ్లను ఇక్కడి సమాజంతో మమేకం చేయడానికి మా వంతు ప్రయత్నిస్తాం’ అంటారు ఉత్తర కొరియా శరణార్థుల సంఘం అధ్యక్షురాలు ఆక్నిం చంగ్.
దక్షిణ కొరియాకు వలస వచ్చి చాలా కాలమైనా, ఇప్పటికీ కొందరు శరణార్థులు తమ చేదు జ్ఞాపకాలను మరచిపోలేకపోతున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









