పుంగ్యె-రి వద్ద ఉత్తర కొరియా అణుపరీక్షల సొరంగాల 'పేల్చివేత'

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియా తమ దేశంలోని ఏకైక అణుపరీక్షల స్థలం వద్ద ఉన్న సొరంగాల్ని పేల్చివేసినట్టు తెలుస్తోంది. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఈ చర్య చేపట్టిందని భావిస్తున్నారు.
భారీ పేలుళ్లు జరగడాన్ని తాము ప్రత్యక్షంగా చూశామని పుంగ్యె-రి వద్ద ఉన్న విదేశీ పాత్రికేయులు తెలిపారు.
దక్షిణ కొరియా, అమెరికాలతో దౌత్య సంబంధాల్ని మెరుగుపర్చుకునే ప్రయత్నాల్లో భాగంగా, ఈ అణుపరీక్షల స్థలాన్ని మూసేస్తామని ఉత్తర కొరియా ఈ యేడాది ప్రారంభంలోనే స్పష్టం చేసింది.
అయితే, 2017 సెప్టెంబర్‌లో జరిగిన చివరి పరీక్ష తర్వాత ఇది పాక్షికంగా ధ్వంసమైందనీ, దాంతో అది పనికి రాకుండా పోయిందని శాస్త్రవేత్తల అభిప్రాయం.
దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న పర్వతాల్లో ఉన్న పుంగ్యె-రి స్థలాన్ని ధ్వంసం చేసే సందర్భంగా స్వతంత్ర పర్యవేక్షకులెవరినీ ఉత్తర కొరియా అనుమతించలేదు.

గురువారం ఏం జరిగింది?
ఎంపిక చేసిన 20 మంది విదేశీ పాత్రికేయుల సమక్షంలో వరుసగా జరిగిన పేలుళ్ల ద్వారా మూడు సొరంగాల్ని పేల్చివేశారు.
రెండు పేలుళ్లు ఉదయం జరిగాయని, నాలుగు పేలుళ్లు మధ్యాహ్నం జరిగాయని తెలుస్తోంది.
పేలుళ్ల సందర్భంగా ఆ స్థలానికి వెళ్లేందుకు అనుమతి పొందిన విదేశీ పాత్రికేయులలో స్కై న్యూస్‌కు చెందిన టామ్ చెషైర్ ఒకరు. "మేం కొండపైకి ఎక్కాం. ఈ పేల్చివేతను కేవలం 500 మీటర్ల దూరం నుంచి గమనించా" అని ఆయన చెప్పారు.
"వాళ్లు మూడు, రెండు, ఒకటి అంటూ కౌంట్‌డౌన్ ప్రారంభించారు. ఆ తర్వాత చాలా పెద్ద పేలుడు సంభవించింది. మా వైపు బాగా దుమ్ము వచ్చింది. బాగా వేడిగా అనిపించింది. ఇది చెవులు చిల్లులు పడేంత పెద్ద శబ్దం" అని తెలిపారు.
ఈ సొరంగాల్ని అనేక వైర్లతో కనెక్ట్ చేసినట్టు టామ్ చెప్పారు.

ఫొటో సోర్స్, CNES - NATIONAL CENTRE FOR SPACE STUDIES VIA AIRB
ఈ పరీక్షా స్థలం ప్రత్యేకతలేంటి?
మంటాప్ పర్వతం దిగువన నిర్మించిన పలు సొరంగాల్లో ఉత్తర కొరియా 2006 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆరు అణు పరీక్షలు నిర్వహించింది.
ఉత్తర కొరియాలో ఇదే ప్రధానమైన అణుపరీక్షా స్థలం. ప్రపంచంలో క్రియాశీలంగా ఉన్న అణుపరీక్షా స్థలం కూడా ఇదొక్కటే.
పరీక్ష చేసే పరికరాలను సొరంగాల చివరి భాగాన పాతిపెడతారు. వాటిని ఒక హుక్‌తో కలుపుతారు.
టన్నెల్ వెనుక భాగాన్నంతా నింపేస్తారు. ఆ విధంగా రేడియోధార్మిక లీకేజి ఏదీ జరగకుండా చేసిన తర్వాత దాన్ని పేల్చివేస్తారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








