ఇరాన్‌పై ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేయాలి: ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
అణు ఒప్పందం విషయంలో ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందని హెచ్చరించారు.
ఇరాన్ ఉగ్రవాదానికి ఊతమిచ్చే చర్యలకు పాల్పడుతోందని ట్రంప్ ఆరోపించారు. అణ్వాయుధాలకు కళ్లెం వేసే 2015 ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందన్నారు. ఇరాన్‌పై కొత్త ఆంక్షలను ప్రతిపాదించారు.
శుక్రవారం వైట్‌హౌస్‌లో ప్రసంగించిన ట్రంప్ ఇరాన్‌పై నిప్పులు చెరిగారు. ఆ దేశానికి అణ్వాయుధాలు అందే దారులన్నింటినీ మూసివేసే దిశగా తాను పనిచేస్తున్నట్లు తెలిపారు.
"ఇరాన్‌కు కావాల్సింది హింస, ఉగ్రవాదం అన్న విషయం అందరూ ఊహించేదే. అణు ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించడం చాలా ప్రమాదకరమైన విషయం. అందుకు మేం ఏమాత్రం అంగీకరించబోం" అని ట్రంప్ స్పష్టం చేశారు.
అయితే ఇరాన్ ఒప్పందానికి పూర్తిగా కట్టుబడి నడుచుకుంటోందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
ట్రంప్ ఎందుకిలా చేస్తున్నారు?
ఇరాన్ అణు ఒప్పందాన్ని సమర్థిస్తూ ప్రతి 90 రోజులకోసారి అమెరికా అధ్యక్షుడు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అది ఆ ఒప్పందంలో భాగం. ఇప్పటి వరకు రెండు సార్లు ధ్రువీకరించిన ట్రంప్, మూడోసారి నిరాకరించారు. ఈ ఆదివారంతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయన ఇలా నిరాకరించడంతో చర్చనీయాంశమైంది.
ఇప్పుడు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలా? వద్దా? అన్న విషయాన్ని ఆ దేశ కాంగ్రెస్ 60 రోజుల్లోగా నిర్ణయించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేందుకే ట్రంప్ మొగ్గుచూపుతున్నారని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదన్నది కాంగ్రెస్ నిర్ణయించాల్సి ఉంది.

ట్రంప్ కోరుతున్న మార్పులేంటి?
- అణు ఒప్పందంలోని "సన్‌సెట్ క్లాజ్" ప్రకారం 2025 తర్వాత ఇరాన్ అణు సంపత్తిని విస్తరించుకోవడంపై నిబంధనల సడలింపు ఉంటుంది. ఆ క్లాజ్‌కు స్వస్తి పలకాలన్నది ట్రంప్ డిమాండ్.
- ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌పై కొత్త ఆంక్షలు విధించాలి.
- ఇరాన్ ఖండాంతర క్షిపణుల ప్రయోగంపై నియంత్రణలు ఉండాలి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








