బొమ్మ కాదు బాంబు: పిల్లలను చంపేస్తున్న క్లస్టర్ బాంబులు

ఫొటో సోర్స్, legacies of war
లావోస్‌లో ఓ పదేళ్ల బాలిక స్కూలుకు వెళ్తోంది.. దారిలో గుండ్రంగా బంతిలా కనిపిస్తున్న ఇనుప వస్తువొకటి కనిపించింది.
ముచ్చటపడి దాన్ని తన సంచిలో వేసుకుని స్కూలుకు తీసుకెళ్లింది.. అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులంతా చిన్నపాటి వేడుక ఏర్పాటు చేసుకుంటే అక్కడికీ తీసుకెళ్లింది.
కానీ, ఆమె అనుకున్నట్లు అది బంతి కాదు, బాంబు.
కుటుంబసభ్యులంతా సరదాగా వేడుక చేసుకుంటున్న సమయంలో అది పేలి ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
1964-73 మధ్య యుద్ధ సమయంలో అమెరికా వైమానిక దాడుల్లో జారవిడిచిన ఆ బాంబు నలభయ్యేళ్ల తరువాత సృష్టించిన విధ్వంసమది.
ఈ ఒక్క పాపే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏటా వందలాది మంది ఇలా ఆ నాటి క్లస్టర్ బాంబులకు బలవుతున్నారు.

ఫొటో సోర్స్, legacies of war
వందలాది చిన్నచిన్న బాంబులను కలిపి తయారుచేసేవే క్లస్టర్ బాంబులు.. వీటిని నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయినా, ఇప్పటికీ సిరియా, యెమెన్ యుద్ధాల్లో వీటిని వాడుతున్నారు. వీటి కారణంగా వేలాది మంది చనిపోయారు.
క్లస్టర్ బాంబును విమానంలోంచి జార విడిచేటప్పుడు అది విడిపోయి బాంబులను వెదజల్లుతుంది. దీనివల్ల ఎక్కువ విస్తీర్ణంలో బాంబుల వర్షం కురిపించినట్లవుతుంది.
చెల్లాచెదురుగా ఎక్కువ ప్రాంతంలో ఇవి పడడం వల్ల సాధారణంగా పౌరుల ప్రాణాలు పోతుంటాయి.
అంతేకాదు.. ఎప్పుడో వీటిని జారవిడిచినా కూడా అందులో పేలకుండా ఉండిపోయినవి ఇలా దశాబ్దాల తరువాత కూడా ఎవరినో ఒకరిని బలితీసుకుంటుంటాయి.

ఫొటో సోర్స్, legacies of war
చిన్నారులే సమిధలు
ముఖ్యంగా ఇవి చిన్నారుల పాలిట శాపం అని చెప్పొచ్చు. యుద్ధాల్లో వేసిన ఈ బాంబులను ఆ తరువాత కాలంలో ఆ ప్రాంతాల్లో తిరుగాడే పిల్లలు బాంబులని తెలుసుకోలేక ఆట వస్తువులుగా భావించి బలైపోయిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు.
క్లస్టర్ బాంబులు వేసేటప్పుడు చనిపోయిన పౌరుల్లో 33 శాతం బాలలే. ఇక ఎప్పుడో వేసిన క్లస్టర్ బాంబుల వల్ల తరువాత కాలాల్లో చనిపోయినవారిలోనూ 62 శాతం మంది చిన్నారులే.
2017లో ఇలాంటి క్లస్టర్ బాంబుల అవశేషాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 289 మంది ప్రాణాలు కోల్పోయారని 'కొయిలేషన్ అగెనెస్ట్ క్లస్టర్ బాంబ్స్' నివేదిక వెల్లడించింది.. ఇందులో అత్యధికంగా సిరియాలో 187, యెమెన్‌లో 54 మంది మృత్యువాతపడ్డారు. వీటితో తాజా దాడులతో పాటు ఎప్పుడో జారవిడిచిన బాంబు వల్లా మరణాలు నమోదయ్యాయి.
2016లో మొత్తం 971 మంది ఇలా ప్రాణాలు కోల్పోగా అందులో ఒక్క సిరియాలోనే 857 మంది చనిపోయారు.
కంబోడియా, ఇరాక్; లావోస్, లెబనాన్, సెర్బియా, సిరియా, వియత్నాం వంటి ఇతర దేశాల్లోనూ క్లస్టర్ బాంబులు ఎందరివో ప్రాణాలు తీశాయి.

ఫొటో సోర్స్, legacies of war
అత్యధికంగా బాంబులు పడిన దేశం
వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా లావోస్‌లో 27 కోట్ల బాంబులను జారవిడిచిందని చెబుతారు. అందుకే... అక్కడి జనాభాతో పోల్చినప్పుడు ఇది ఎన్నో రెట్లు ఎక్కువ.
1960లో అమెరికా లావోస్‌లో ఇలాంటి బాంబుల దాడి ప్రారంభించగా ఇప్పటి వరకు లావోస్‌లోనే అత్యధికంగా 7,697 మంది వీటి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత సిరియాలో 3,081... ఇరాక్‌లో 3,039 మంది మరణించారు.
ప్రపంచవ్యాప్తంగా 33కి పైగా దేశాల్లో 56 వేల మరణాలు వీటి వల్లే సంభవించినట్లు నివేదిక వెల్లడిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
ఇప్పటికీ 26 దేశాల్లో ముప్పు
ప్రస్తుతం యుద్ధాలు జరుగుతున్నవి, గతంలో యుద్ధాలు జరిగినవి మొత్తం 26 దేశాల్లో పేలని బాంబులు లెక్కలేనన్ని ఉన్నాయి.
క్లస్టర్ బాంబుల వినియోగానికి వ్యతిరేకంగా ఐరాస చేసిన సూచనపై 120 దేశాలు సంతకాలు చేశాయి. భారత్, పాక్, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా వంటి దేశాలు సంతకాలు చేయలేదు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








