Fact Check: బ్రిటన్ రాణి కంటే సోనియా సంపన్నురాలా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ సోమవారం టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక పాత ఆర్టికల్ లింక్ షేర్ చేశారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వేగంగా షేర్ అవుతోంది.
2013లో ప్రచురితమైన ఈ ఆర్టికల్ ప్రకారం కాంగ్రెస్ నేత సోనియా గాంధీ బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కంటే సంపన్నురాలు.
ఈ ఆర్టికల్‌ను ట్వీట్ చేసిన అశ్విని ఉపాధ్యాయ్ "కాంగ్రెస్ ఎలిజబెత్, బ్రిటన్ మహారాణి కంటే, కాంగ్రెస్ సుల్తాన్ ఒమన్ సుల్తాన్ కంటే ఎక్కువ సంపన్నులు. వారి బినామీ ఆస్తులను వంద శాతం జప్తు చేయడానికి భారత ప్రభుత్వం త్వరగా చట్టం తీసుకురావాలి, జీవితఖైదు విధించాలి" అన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/@ASHWINIBJP
అశ్విని ఉపాధ్యాయ్ తన ట్వీట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారిక హ్యాండిల్ కూడా ట్యాగ్ చేశారు. మూడు వేల మందికి పైగా ఈ ట్వీట్‌ను లైక్, రీ ట్వీట్ చేశారు.
మితవాద పోకడలు ఉన్న ఫేస్‌బుక్ గ్రూప్స్ పేజీల్లో కూడా ఇప్పుడు ఈ ఆర్టికల్‌ను షేర్ చేస్తున్నారు. అక్కడ కూడా అత్యంత సంపన్నురాలుగా చెబుతున్న సోనియా గాంధీపై విచారణకు ఆదేశించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
దిల్లీ బీజేపీ సోషల్ మీడియా, ఐటీ హెడ్ పునీత్ అగ్రవాల్ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్‌ను షేర్ చేశారు. దీనిని ఒక ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం చేశారు.

ఫొటో సోర్స్, TWITTER/@PUNITSPEAKS
పునీత్ అగ్రవాల్ తన ట్విటర్‌లో "ఇప్పుడు ఈ అంశంపై ఎన్ని న్యూస్ చానళ్లు చర్చలు పెడతాయి. అవినీతి చేయకుండా కాంగ్రెస్ ఇంత సంపాదించింది అంటే కారణం ఏదయ్యుంటుంది? అని పోస్ట్ చేశారు.
కానీ ఈ వాదనలు తప్పని బీబీసీ గుర్తించింది. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఏ రిపోర్ట్ ఆధారంగా ఈ ఆర్టికల్ రాసిందో, ఆ రిపోర్టులో తర్వాత వాస్తవిక మార్పులు చేశారు. సోనియా గాంధీ పేరును ఆ లిస్టు నుంచి తొలగించారు.

ఫొటో సోర్స్, TOI NEWS GRAB
ఆర్టికల్‌లో ఏం చెప్పారు?
2013 డిసెంబర్ 2న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఆ ఆర్టికల్‌లో:
- హఫింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత సంపన్న నేతల్లో సోనియా గాంధీ 12వ స్థానంలో ఉన్నారు.
- సోనియా గాంధీ దగ్గర సుమారు 2 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన సంపద ఉంది.
- సోనియా గాంధీ దగ్గర ఉన్న సంపదను బట్టి ఆమె బ్రిటన్ మహారాణి, ఒమన్ సుల్తాన్, సిరియా అధ్యక్షుడి కంటే ఎక్కువ సంపన్నురాలని చెబుతున్నారు.
- 20 మంది నేతల పేర్లున్న ఈ జాబితాలో ప్రపంచంలోని మిగతా సంపన్న నేతలు మధ్యప్రాచ్యం నుంచి ఉన్నారు.
- దీనిని ఏ ప్రాతిపదికన రూపొందించారో హఫింగ్టన్ పోస్ట్ తన రిపోర్టులో స్పష్టమైన సమాచారం ఏదీ ఇవ్వలేదు.
బీజేపీ ప్రతినిధి అశ్విని ఉపాధ్యాయ్ ఇంతకు ముందు 2015లో కూడా ఇదే ఆర్టికల్‌ను షేర్ చేశారు.

ఫొటో సోర్స్, TWITTER/@ASHWINIBJP
స్థానిక పత్రికలూ రాశాయి
హఫింగ్టన్ పోస్ట్ ప్రచురించిన ఈ రిపోర్ట్ ఆధారంగా ఈ వార్తను రాసింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక్కటే కాదు.
2013లో ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎన్నో స్థానిక మీడియాసంస్థలుఈ వార్తనుప్రచురించాయి. ప్రపంచంలోని అత్యంత సంపన్న నేతల్లో సోనియా గాంధీ పేరు కూడా ఉందని చెప్పాయి.
సోషల్ మీడియా సెర్చ్ వల్ల 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఆర్టికల్‌ను చాలాసార్లు షేర్ చేశారని, దాని ఆధారంగా జనం సోనియా గాంధీపై అవినీతి ఆరోపణలు చేశారని తెలిసింది.

ఫొటో సోర్స్, VIRAL IMAGES
హఫింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో మార్పులు
బీబీసీ పరిశోధనలో 2013 నవంబర్ 29న హఫింగ్టన్ పోస్ట్ అత్యంత సంపన్న నేతల లిస్టు ప్రచురించిందని తేలింది. దానితోపాటు అది నేతల ఫొటోలు కూడా వేసింది.
అప్పట్లో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ పేరు ఈ జాబితాలో 12వ స్థానంలో ఉంది. కానీ తర్వాత ఆ లిస్ట్ నుంచి ఆమె పేరును తొలగించారు.
అలా ఎందుకు చేశారు. దీనికి సమాధానంగా హఫింగ్టన్ పోస్ట్ సైట్‌లో ఉన్న ఆ రిపోర్ట్ కింద ఎడిటర్ ఒక నోట్ రాశారు.

ఫొటో సోర్స్, HUFFPOST.COM
ఆ నోట్‌లో "సోనియా గాంధీ, కతార్ షేఖ్ హామిద్ బిన్ ఖలీఫా అల్-థానీ పేర్లను జాబితా నుంచి తొలగించాం. ఒక థర్డ్ పార్టీ సైట్ ఆధారంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ పేరును ఈ లిస్టులో పెట్టాం. దానిపై తర్వాత ప్రశ్నలు తలెత్తాయి. సోనియా గాంధీ సంపదను మా ఎడిటర్ ధ్రువీకరించలేకపోయారు. అందుకే లింక్ తొలగించాల్సి వచ్చింది. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం" అని పెట్టారు.
2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేసినప్పుడు, సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె తన దగ్గర మొత్తం పది కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు ప్రకటించారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా సహా భారత న్యూస్ సైట్స్ కొన్ని హఫింగ్టన్ పోస్ట్ రిపోర్టులో తర్వాత జరిగిన ఆ మార్పుల గురించి కూడా ప్రచురించాయి. దాని గురించి ప్రజలకు చెప్పాయి. కానీ పాత వార్తను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో చాలా ఫేస్‌బుక్ పేజీల నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియా తమ పాత వార్తలను అప్‌డేట్ చేయాలనే సలహాలు కూడా వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- రియాలిటీ చెక్: నికితా వీరయ్య నిర్మలా సీతారామన్ కూతురేనా...
- మరణ శిక్ష 170 దేశాల్లో లేదా? ఐరాస మాటలో నిజమెంత?
- సన్న జీవుల శ్రద్ధాంజలి
- సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ తొలగింపు: ప్రధాని అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం
- హరీశ్‌రావు: దేశంలో అత్యధిక మెజారిటీ ఈయనదేనా?: బీబీసీ రియాల్టీచెక్
- బీబీసీ రియాలిటీ చెక్: అది భార్యాబిడ్డల అమ్మకం కాదు.. ‘ కులాచారం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








