సిమ్ స్వాపింగ్: మీ సిమ్ కార్డ్ మిమ్మల్నిరాత్రికి రాత్రే బికారిగా మార్చొచ్చు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓంకార్ కరంబేల్కర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల ముంబైలో ఒక వ్యాపారి ఒకే రోజు 1.86 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.
ఇదంతా సిమ్ స్వాపింగ్ అంటే సిమ్ మార్చేయడం వల్ల జరిగింది. వ్యాపారి ఖాతా నుంచి ఆ డబ్బు 28 వేరు వేరు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఈ ఫ్రాడ్ ఒకే ఒక్క రాత్రిలో జరిగిపోయింది.
ఇలాంటి కేసుల్లో ఎవరో ఒకరిని టార్గెట్ చేసే మోసగాళ్లు అతడి సిమ్ కార్డ్ బ్లాక్ చేయడానికి రిక్వెస్ట్ పెడతారు. సిమ్ బ్లాక్ కాగానే, అదే నంబరుతో తీసుకున్న కొత్త సిమ్ నుంచి లావాదేవీల కోసం వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) రిక్వెస్ట్ పెడతారు.
తర్వాత ఓటీపీ రాగానే, దాని సాయంతో ఒక ఖాతా నుంచి ఇతర ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడం మొదలుపెడతారు.
ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలన్నీ ఆన్‌లైన్ లేదా డిజిటల్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది వివరాలు ఆన్‌లైన్లో లభిస్తున్నాయి.
అలాంటప్పుడు ఫ్రాడ్ చేసే వారు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సిమ్ స్వాపింగ్ ద్వారా వారిని నిలువునా ముంచేస్తారు.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
సిమ్ స్వాప్ ఎలా జరుగుతుంది?
సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అడ్వకేట్ ప్రశాంత్ మాలీ దీని గురించి బీబీసీకి వివరంగా చెప్పారు. సిమ్ స్వాపింగ్ ఎలా చేస్తారో, దాని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవచ్చో, జాగ్రత్తలు చెప్పారు.
"2011 తర్వాత ఇలాంటి నేరాలు పెరిగాయి. సిమ్ స్వాపింగ్ ఒక వ్యక్తి మాత్రమే చేయడు. అందులో చాలా మంది ప్రమేయం ఉంటుంది. వ్యవస్థీకృత ముఠాలు ఇలాంటి వాటిని చేస్తుంటాయి. ఇలాంటి నేరాల ద్వారా 2018లో భారతదేశంలో 200 కోట్లు కొట్టేశారని సైబర్ అండ్ లా ఫౌండేషన్ అంతర్గత పరిశోధనలో తేలింది.
- ఇలాంటి నేరాల్లో బాధితులు చాలావరకూ బాగా చదువుకున్న వారే అయ్యుంటారు. కానీ భద్రత గురించి అంత అప్రమత్తంగా లేకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకుంటారు. మోసగాళ్లు రకరకాల మీడియా-సోషల్ మీడియా ద్వారా మొదట మీపై కన్నేసి ఉంచుతారు. మీ వివరాలన్నీ సేకరిస్తారు. చాలాసార్లు మీకు అపరిచిత నంబరు నుంచి కాల్స్ కూడా వస్తాయి. వారు మీ వివరాలు కూడా సేకరిస్తారు.
- కొన్నిసార్లు మీకు ఫిషింగ్ లింక్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ నింపమని అడుగుతారు. కొన్నిసార్లు మోసగాళ్లు బ్యాంకుల డేటాబేస్ కూడా కొంటారు. వాళ్ల దగ్గరకు మన వివరాలు చేరగానే, మన పేరుతో నకిలీ ఐడీ కార్డు తయారు చేస్తారు. దాని సాయంతో మన సిమ్ బ్లాక్ చేయాలని టెలిఫోన్ కంపెనీలకు రిక్వెస్ట్ పెడతారు. కొన్నిసార్లు వైరస్ లేదా మాల్‌వేర్ సాయంతో కూడా వారు మీ వివరాలు సేకరిస్తారు.
- టెలికాం కంపెనీ కొత్త సిమ్ కార్డు ఇవ్వగానే, మోసగాళ్లు కొత్త సిమ్‌తో సులభంగా ఓటీపీ పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలుగుతారు. ఎందుకంటే ఆ మోసగాళ్ల దగ్గర కొత్త సిమ్ ఉంటుంది. దాంతో ఓటీపీ వారి దగ్గరికే వస్తుంటుంది. అందుకే మోసగాళ్లు మీ ఖాతాలో ఉన్న డబ్బును చాలా సులభంగా వేరే వారి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతారు.

ఎవరైనా మీ ఖాతాలో డబ్బు వేస్తామని చెబుతుంటే...
ఎవరైనా ఒక వ్యక్తి మీ ఖాతాలో కొంత డబ్బు జమ చేయాలని అనుకున్నట్టు మీకు చెబితే, వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రశాంత్ మాలీ చెప్పారు.
"వాళ్లు తాము వేసే మొత్తంలో 10 శాతం, లేదా 10 వేల రూపాయలు మీకిస్తాం అంటారు. కొన్ని నిమిషాల్లోనే మీ ఖాతాలోకి డబ్బు పంపిస్తాం అంటారు. కానీ, ఈ మొత్తం సిమ్ స్వాపింగ్ ద్వారా కొట్టేసిన డబ్బు అయ్యుండవచ్చు".
అలాంటప్పుడు మీకు తెలీకుండానే మీరు నేరస్థుడు కావచ్చు. ఎందుకంటే మీ ఖాతా కూడా వారి నేరంలో భాగం అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఏ కారణం లేకుండానే మీ ఖాతాలో డబ్బు జమ చేయాలని అనుకుంటే, మీరు అతడి వలలో పడకుండా ఉండాలి.

ఫొటో సోర్స్, Getty Images
కీలకమైన పత్రాలు ఎవరికీ ఇవ్వద్దు
మనం సాధారణంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ సమయంలో చేసే కొన్ని పొరపాట్ల గురించి మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ ఎస్పీ బాల్‌సింగ్ రాజ్‌పుత్ బీబీసీకి చెప్పారు.
"క్రెడిట్ కార్డ్, ఆధార్ కార్డ్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండాలి. మీరు ఆన్‌లైన్ లావాదేవీలు చేస్తుంటే వాటిని సెక్యూర్డ్ వెబ్‌సైట్ నుంచే చేస్తున్నామా, లేదా అనేది చూసుకోవాలి. మీ ఓటీపీ లేదా కార్డ్ సీవీవీ ఎవరికీ ఇవ్వకండి".
"మీరు మీ ముఖ్యమైన కాగితాలను ఎవరికీ ఇవ్వకుండా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఇవ్వాల్సివస్తే, ఆ ఫొటోకాపీలను ఏ పనికోసం ఇస్తున్నారో వాటిపై కచ్చితంగా రాయాలి. ఆ కాపీలను ఆ పనికోసమే ఉపయోగించాలి. అలా చేయడం వల్ల ఆ కాగితాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయి. మీరు ఎవరికైనా లేదా ఏ సంస్థకైనా మీ ఫొటోకాపీలు ఇస్తుంటే అది అవసరమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించండి" అని బాల్‌సింగ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సెలవుల్లో సిమ్ స్వాపింగ్
"ప్రతి బ్యాంకు ఖాతాకు ఈ-మెయిల్ అలర్ట్ సదుపాయం ఉండాలి. మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా బ్లాక్ అయితే, కనీసం ఈ-మెయిల్ ద్వారా అయినా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరుగుతున్న విషయం తెలుస్తుంది. అలా మీరు వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇచ్చి నష్టం జరగకుండా ఆపవచ్చు" అని ప్రశాంత్ మాలీ సలహా ఇచ్చారు.
"ముఖ్యంగా సిమ్ స్వాపింగ్ ఎక్కువగా శుక్రవారం, లేదా శనివారం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు సెలవుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే సెలవుల వల్ల బాధితులు బ్యాంకులు లేదా టెలికాం కంపెనీలను సంప్రదించడం కష్టం అవుతుంది. అందుకే సెలవుల్లో మీ సిమ్ కార్డ్ హఠాత్తుగా బ్లాక్ అయితే, అప్రమత్తం కావాలి. మీ బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలి" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- స్మార్ట్ ఫోన్ వాడే పిల్లల తెలివితేటలు పెరుగుతాయా? తగ్గుతాయా?
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు?
- మోదీపై రాహుల్ వేస్తున్న నిందలు సరే... నిజాలెక్కడ
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి పురస్కారం ఎందుకు రాలేదు?
- భారత్‌లో పెరుగుతున్న పోర్న్ వీక్షణ
- గూగుల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్: భావి నగరాలకు నమూనా అవుతుందా?
- చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








