ఈ ‘పాత’ ప్రపంచం ఎంత పెద్దదో తెలుసా

ఫొటో సోర్స్, Mansi Thapliyal
చిరిగిపోయిన గోనెసంచుల్లోంచి పాత పేపర్లు బయటకు చూస్తున్నాయి. అందులో ఒక పేపర్‌పై ప్రధాని మోదీ మొఖం చిద్విలాసంగా కనిపిస్తోంది.
ఇంకోవైపు ''ప్రిన్సిపల్స్ ఆఫ్ కార్పొరేట్ ఫైనాన్స్'' పుస్తకం ఒకటి నేలపై అనాథలా పడి ఉంది.
ఖరీదైన గ్లాసీ స్మార్ట్ వాటర్ ఖాళీ సీసాలు.. వాడి పడేసిన లాకోస్ట్ డియోడరెంట్.. సింగపూర్ వాల్ క్లాక్.. దుమ్ముపట్టేసిన సైకిళ్లు... ఒకటేమిటి! ప్రపంచమంతా అక్కడే కనిపిస్తోంది. అయితే, అదంతా పాత ప్రపంచం. ఎందుకూ పనికిరాదనుకునే స్క్రాప్ ప్రపంచం.
దిల్లీ శివారుల్లో గుర్‌గావ్‌లోని ఒక స్క్రాప్ దుకాణంలోని దృశ్యమిది. గోవింద్, జోగీందర్ అనే అన్నదమ్ములు దీన్ని నడుపుతున్నారు.
గత పదేళ్లుగా వీళ్లు ఇదే వ్యాపారంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
''వ్యర్థాల్లో ఎక్కువగా ప్లాస్టిక్ ఉంటోంది. ఒకప్పుడు ఇంత ఉండేది కాదు. వైర్లలో ఒకప్పుడు రాగి ఉండేది.. ఇప్పుడు ఏ వైర్ చూసినా అల్యూమినియమే'' అని జోగీందర్ చెప్పారు. జోగీందర్, గోవింద్‌లు నెలకు రూ.30 వేల వరకు ఈ వ్యాపారంలో సంపాదిస్తున్నట్లు చెప్పారు.
ఇద్దరు అన్నదమ్ములూ ఈ స్క్రాప్ యార్డులోనే ఎక్కువ సమయం గడుపుతారు. అందుకే.. టీ తయారు చేసుకోవడానికి ఒక స్టవ్, అక్కడే పడుకోవడానికి ఒక బెడ్ కూడా ఉన్నాయి. స్క్రాప్ యార్డుకు కాపలాగా వారే ఉంటారు.
ప్రజలు వదిలేసిన ఇలాంటి పాత వస్తువులతో దేశంలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటారు వారు.
భారతదేశంలో రీసైక్లింగ్ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వ్యర్థాలను రీసైకిల్ చేసి కొత్త వస్తువులు తయారుచేసి విక్రయిస్తారు. వాటన్నిటికీ ముడి సరకు ఇలాంటి స్క్రాప్ వ్యాపారుల నుంచే అందుతుంది.
దేశంలోని చాలా నగరాల్లో ఇంటింటికీ వెళ్లి వ్యర్థాలను సేకరించే వ్యవస్థలు సక్రమంగా లేవని 'వేస్ట్ వెంచర్స్' అనే చెత్త సేకరణ కంపెనీ వ్యవస్థాపకులు రోషన్ మిరాండా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
భారత్‌లో 6.2 కోట్ల టన్నుల వ్యర్థాలు ఉత్పత్తవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కానీ, ఈ సేకరణ పనిలో ఎంతమంది ఉన్నారు.. దీన్ని వేరు చేసేవారు, విక్రయించేవారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు మాత్రం లేవు.
భుజానకు గోనెసంచి తగిలించుకుని చెత్తకుప్పల్లో పాత వస్తువులు ఏరుకునేవారి నుంచి భుజానికి బ్యాక్‌ప్యాక్ వేసుకుని తెల్లటి వ్యాన్‌ను డ్రైవ్ చేసుకుంటూ వ్యర్థాలు సేకరించే గోవింద్ వరకు రకరకాల వ్యక్తులు ఈ వ్యాపారంలో ఉన్నారు.
రిజిష్టర్డ్ సంస్థను ఏర్పాటుచేసుకుని, పన్నులు చెల్లిస్తూ ఈ వ్యాపారం చేస్తున్నారు గోవింద్.
''విదేశాల్లో వ్యర్థాలు తీసుకెళ్లేవారికి డబ్బులిస్తారు.. భారత్‌లో మాత్రం మేమే డబ్బులిచ్చి చెత్త కొంటాం'' అంటారు గోవింద్.
తాను చెత్త సేకరించే ప్రాంతాల్లో నివసించే కొందరు విదేశీయులు తనకు ఈ విషయం చెప్పారని.. వారు తనతో బేరమాడరని, ఎంతిస్తే అంత తీసుకుంటారని చెప్పారాయన.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
భారత్‌లో 90 శాతం ప్లాస్టిక్ వేస్ట్‌ను రీసైకిల్ చేసి సీసాలు, పాత్రలు, చవకరకం ప్లాస్టిక్ వస్తువుల తయారుచేస్తారు. జపాన్, యూరప్ కంటే భారత్‌లోనే ఈ రీసైక్లింగ్ ఎక్కువగా ఉంది.
గోవింద్ సేకరించే పాత సామగ్రిలో 80 శాతం పేపర్లే ఉంటాయి. ప్రతివారం ఆయన సుమారు 2 వేల కేజీల పాత పేపర్లు, పుస్తకాలు కొంటారు.
గోవింద్ ఒక స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా కూడా పనిచేస్తారు. అందుకే తాను వ్యర్థాల వ్యాపారంలో ఉన్నట్లు బయటకు తెలియడానికి ఇష్టపడనని చెబుతారాయన. తాను చేసే పనికి తానేమీ సిగ్గుపడనని, కానీ.. స్కూలు పిల్లల తల్లిదండ్రులకు ఈ విషయం తెలిస్తే వారు ఇష్టపడకపోవచ్చని అంటారు.
గోవింద్ స్క్రాప్ యార్డ్ నిత్యం కిటకిటలాడుతుంటుంది. వ్యర్థాలను సేకరించి తెచ్చి అక్కడ విక్రయించేవారితో పాటు ఒక్కోసారి వీరివద్ద పాత సైకిళ్లు, ఫర్నీచర్, వంటపాత్రలు వంటివి కొనేందుకు చాలామంది వస్తుంటారు.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
ఇలా షాప్ దగ్గరే కొంత సరకు అమ్ముడుపోగా మిగిలింది గోదాములకు పంపిస్తామని గోవింద్, జోగీందర్‌లు చెప్పారు. పేపర్లన్నీ పాలెం సమీపంలోని ఒక గోడోన్‌కు తాము పంపిస్తామని.. అక్కడి నుంచి అది ఉత్తర్ ప్రదేశ్‌లోని రీసైక్లింగ్ ఫ్యాక్టరీలకు వెళ్తుందని చెప్పారు.
లోహ వ్యర్థాలన్నీ భారతదేశంలోని అతిపెద్దదైన వెస్ట్ దిల్లీలోని మాయాపురి స్క్రాప్ మార్కెట్‌కు తరలిస్తారు.
ప్లాస్టిక్ వేస్ట్ గుర్గావ్‌లోని గోదాములకే వెళ్తుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా ఈశాన్య దిల్లీలోని సీలంపూర్‌కి చేరుతుందని వారు చెప్పారు.
తాము చేసే పనిలో ప్రమాదాలూ ఉంటాయని చెబుతారీ అన్నదమ్ములు. గట్టి ప్లాస్టిక్‌తో తయారయ్యే ఎలక్ర్ట్రానిక్, ఎలక్ట్రిక్ వస్తువులు, గృహోపకరాలను అందులోని విడిభాగాల కోసం వేరుచేసేటప్పుడు గాయాలపాలవుతామని.. గాజు వస్తువులతోనూ గాయపడతామని చెబుతారు.
ఒక్కోసారి అవేమిటో తెలియని సీసాలను నలిపేటప్పుడు, తెరిచేటప్పుడు అందులోని కెమికల్స్, వాయువల కారణంగానూ ప్రమాదాలు జరుగుతాయని.. ఇలా తమకు తెలిసినివారికి జరిగిందని చెప్పారు.

ఫొటో సోర్స్, Mansi Thapliyal
అంతేకాదు... తమకు ప్రజల జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ పనివల్ల తెలుస్తుంటాయని.. ఎవరింట్లో ఎప్పుడు కొత్త టీవీ కొన్నారు... ఎవరింట్లో ఎప్పుడు పార్టీ చేసుకున్నారు వంటివన్నీ వారు తమకు విక్రయించే పాత సామగ్రి, వాడిపడేసిన సామగ్రి వల్ల తెలుస్తుందని అంటారు ఈ అన్నదమ్ములు.
ఒక్కోసారి కొందరు పాత ఆల్బమ్‌లు వంటివి అమ్మేస్తారు. అందులో పెళ్లి ఫొటోలు వంటివీ ఉంటుంటాయి. కానీ, మేం ఏం చేయగలం? వాటినీ పాత పేపర్లతో పాటే అమ్మేస్తామన్నారు గోవింద్.
ఒక్కోసారి ఇలాంటి వ్యర్థాల నుంచే పనికొచ్చే వస్తువులను ఇంటికి తీసుకెళ్తామని చెప్పారు జోగిందర్. తమ ఇంట్లో ఉన్న రెండు ఏసీలు కూడా ఇలా స్క్రాప్‌లో వచ్చినవేనన్నారాయన.
అలాగే... ఒక్కోసారి రీసైకిల్ చేయదగ్గ వ్యర్థాలతో పాటే డయాపర్లు, శానిటరీ నాప్‌కిన్లూ వస్తుంటాయని.. అయినా, తమకు కోపం రాదని.. ఈ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి ఇలాంటివి తప్పవని, తమకు అక్కర్లేనివి పడేస్తామని అంటారు వీరిద్దరూ.
ఇవి కూడా చదవండి:
- అప్పట్లో ఫుట్‌బాల్ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటే ఫుట్‌బాల్
- సోషల్ మీడియా: కావాలనే యూజర్లను వ్యసనపరుల్ని చేస్తున్న కంపెనీలు
- టికెట్ కలెక్టర్ నుంచి ట్రోఫీ కలెక్టర్ వరకూ ఎంఎస్ ధోనీ జర్నీ
- YouTube Stars: అమ్మాయిల కోసం, అమ్మాయిల చేత, అమ్మాయిలతో.. ‘గాళ్ ఫార్ములా’
- కొత్తగా పుట్టిన గ్రహం.. ఫొటోకి చిక్కింది
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- ఉత్తరాదిలో రెండు లక్షల మంది తెలుగు వారు ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








