ఆంధ్రప్రదేశ్: ఆ ఒక్క రోజే రూ.100 కోట్ల మద్యం తాగేశారు- ప్రెస్ రివ్యూ

beer

ఫొటో సోర్స్, Getty Images

ఎక్సైజ్‌ శాఖ అంచనాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబరు 31న దాదాపు రూ.100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయని 'ఆంధ్రజ్యోతి' ఓ కథనంలో పేర్కొంది.

గత మూడు రోజుల్లో మద్యం వ్యాపారులు చేసుకున్న దిగుమతులే ఇందుకు నిదర్శమని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది.

రాష్ట్రంలో రోజుకు సగటున మద్యం అమ్మకాలు రూ.50 కోట్లు. కానీ కొత్త సంవత్సరం వేళ వ్యాపారులు ముందుగానే భారీగా మద్యం నిల్వలు దిగుమతి చేసుకున్నారు.

డిసెంబరు 29న రూ.103 కోట్లు, 30న రూ.67 కోట్లు, 31న రూ.118 కోట్లు.. వెరసి రూ.289 కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు ఎక్సైజ్‌ నుంచి తీసుకున్నారు.

అందులో డిసెంబరు 31 ఒక్కరోజే రూ.100 కోట్లకు పైగా విక్రయించినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లో 4,87,888 కేసుల లిక్కర్‌తోపాటు 3,62,147 కేసుల బీరును వ్యాపారులు దిగుమతి చేసుకున్నారని ఆంధ్రజ్యోతి వివరించింది.

కోదండరామ్, కోదండరాం

ఫొటో సోర్స్, Getty Images

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషణ జరగాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారని 'సాక్షి' రాసింది.

సీట్ల సర్దుబాటు, ప్రచారం ఆలస్యం కావడం, ప్రచారవ్యూహం లేకపోవడం వల్లే కూటమి ఓడిపోయిందని కోదండరాం పేర్కొన్నారు. తమ నాలుగేళ్ల శ్రమ వృథాగా పోయిం దన్నారు.

ఎన్నికల్లో ఇంటింటికీ ప్రచారం చేయలేదని, మంచి ఎజెండా ఉన్నా ప్రజలకు చెప్పుకోలేక పోయామన్నారు. తాను కేసీఆర్‌తో పదేళ్లపాటు కలసి పని చేశానని, కేసీఆర్‌ ప్రచారశైలి గురించి ఎన్నిసార్లు కూటమి పార్టీ నేతలకు హెచ్చరించినా ఉత్తమ్, ఎల్‌.రమణ వినిపించుకోలేదన్నారు.

కేసీఆర్‌ను ఎదుర్కోవాలంటే ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం ఉండాలని తాను చెప్పానని, కానీ 15 రోజుల ప్రచా రం చాలని ఉత్తమ్, మూడు వారాలు సరిపోతుందని రమణ పేర్కొన్నారని వెల్లడించారు.

కూటమిలోని కొంతమంది నేతల అతి ఆత్మవిశ్వాసం కారణంగా ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందన్నారు.

ఓటమికి ఈవీఎంల ను బూచిగా చూపడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ ఈవీఎంలపై తప్పు నెట్టడంలో అర్థం లేదన్నారు. అసలు కారణాలను సమీక్షించకుండా ఉత్తుత్తి కారణాలను విశ్లేషించడం వల్ల లాభం లేదన్నారు.

పెట్రోల్

ఫొటో సోర్స్, Getty Images

పెట్రోలు కంటే విమాన ఇంధన ధరే తక్కువ

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో, విమాన ఇంధన (ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను మంగళవారం రికార్డు స్థాయిలో 14.7 శాతం మేర తగ్గించారు. ఇందువల్ల పెట్రోలు, డీజిల్‌ కంటే ఏటీఎఫ్‌ చౌకగా మారిందంటూ 'ఈనాడు' ఓ కథనం ప్రచురించింది.

ఏటీఎఫ్‌ ధరను కిలో లీటర్‌ (వెయ్యి లీటర్లు)కు రూ.9,990 తగ్గించి రూ.58,060.97గా చేసినట్లు ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించాయి. అంటే లీటర్‌ రూ.58.07 మాత్రమే. స్కూటర్‌, బైక్‌లలో పోసుకునే పెట్రోల్‌ కంటే, బస్సులు-లారీల్లో వాడే డీజిల్‌ కంటే కూడా ఏటీఎఫ్‌ ధరే చౌకగా ఉంది.

వరుసగా రెండో నెలలోనూ ఏటీఎఫ్‌ ధరలో కోత విధించగా, ఇంత భారీగా తగ్గించడం ఇదే తొలిసారి. డిసెంబరు 1న కూడా ఏటీఎఫ్‌ కిలోలీటర్‌ ధరను రూ.8,327.83 (10.9 శాతం) తగ్గించిన సంగతి విదితమే. ఇందువల్ల ఏడాది కాలంలో కనిష్ఠస్థాయికి ఏటీఎఫ్‌ ధర చేరింది. ఇందువల్ల దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల కంటే ఏటీఎఫ్‌ ధరే తక్కువకు చేరింది.

ముంబయి వంటి ప్రాంతాల్లో రాయితీ లేకుండా లభించే కిరసనాయిలు ధర కంటే కూడా తక్కువకే ఏటీఎఫ్‌ లభించనుంది. అధిక చమురు ధరలకు తోడు, రూపాయి క్షీణతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విమానయాన సంస్థలకు భారీ ఊరట కలిగించే పరిణామమిది.

ముడిచమురు ధరలకు అనుగుణంగా, పెట్రోల్‌-డీజిల్‌ ధరలు కూడా దిగి వస్తున్నాయి. మంగళవారం లీటర్‌ పెట్రోల్‌ ధరను 19 పైసలు, డీజిల్‌ ధరను 20 పైసల మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్‌ సంస్థలు (ఓఎంసీలు) ప్రకటించాయి.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Facebook/Election Commission of India

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వివరాలను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది.

మూడు విడుతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు. మొత్తం 12,732 గ్రామాలు, 1,13,170 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

1,13,190 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశామని నాగిరెడ్డి తెలిపారు. ఒక్కో విడత ఎన్నికలను 14 రోజుల్లో పూర్తిచేస్తామని చెప్పారు.

మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. ప్రభుత్వం కొత్తగా ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటించరాదని స్పష్టం చేశారు.

ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)