బారెన్ ఐలాండ్: భారత్‌లో యాక్టివ్ అగ్నిపర్వతం ఇదే. ఎక్కడుందో తెలుసా?

ఫొటో సోర్స్, EPA
ఇండోనేసియాలో తాజాగా సంభవించిన భారీ సునామీకి అనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం పేలడమే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆ రోజు ఉపగ్రహం తీసిన ఛాయా చిత్రాలను పరిశీలించినా అదే అర్థమవుతోంది.
నిజానికి ఈ సునామీకి కారణమైన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం చాలా చిన్నది. దీనిని పిల్ల క్రకటోవా అంటారు. దీని 'తల్లి' పేరు క్రకటోవా.
1883లో అది విస్ఫోటనం చెందింది. అప్పుడు సంభవించిన సునామీ వల్ల దాదాపు 36,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విస్ఫోటనం తర్వాత ఆ అగ్నిపర్వతం సముద్రంలో దాదాపు కనుమరుగైపోయింది.
అనంతరం 1927లో ఈ పిల్ల క్రకటోవా (అనక్ క్రకటోవా) ఉద్భవించింది. అప్పటి నుంచీ 90 ఏళ్లుగా క్రియాశీలంగా ఉంటూ ఈనెల 22న సాయంత్రం పేలింది.

ఫొటో సోర్స్, andamans.gov.in
బారెన్ అగ్నిపర్వతం
అలాంటి క్రియాశీల(యాక్టివ్) అగ్నిపర్వతం భారత కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని బారెన్ ఐలాండ్‌లోనూ ఒకటుంది. భారత్‌లో ఉన్న ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఇదే.
దాదాపు 177 ఏళ్లపాటు నిద్రాణ స్థితిలో ఉన్న ఈ అగ్నిపర్వతం 1991లో విస్ఫోటనం చెందింది. 1994, 1995ల్లోనూ నిప్పులు కక్కింది. ఆ తర్వాత అప్పుడప్పుడూ కొద్దిపాటి పేలుళ్లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
2017 జనవరిలోనూ దాని నుంచి పొగలు, లావా వెలువడుతున్నట్లు గుర్తించామని గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) శాస్తవ్రేత్తలు తెలిపారు.

ఫొటో సోర్స్, andamans.gov.in
పగటిపూట ఈ అగ్నిపర్వతం నుంచి బూడిద వెలువడుతున్నట్లు మాత్రమే కనిపించిందని, సూర్యుడు అస్తమించిన తర్వాత ఎర్రని నిప్పులాంటి లావా ఉబికివచ్చి దిగువకు ప్రవహిస్తున్నట్లు గుర్తించామని అప్పట్లో శాస్త్రవేత్తలు వివరించారు.
అప్పుడప్పుడూ 5 నుంచి 10 నిమిషాల పాటు లావా వెలువడుతోందని గుర్తించారు.
దాదాపు 3 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉన్న బారెన్ ఐలాండ్‌లో సముద్ర తీరం నుంచి అర కిలోమీటర్ దూరంలో భారీ అగ్నిపర్వత ముఖద్వారం ఉంది.

ఫొటో సోర్స్, andamans.gov.in
అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ నుంచి ఈశాన్యం వైపున 139 కిలోమీటర్ల దూరంలో బారెన్ ఐలాండ్ ఉంది. పోర్ట్ బ్లెయిర్ నుంచి అద్దె పడవల్లో ఇక్కడికి వెళ్లొచ్చు. అలా వెళ్లాలంటే.. తప్పనిసరిగా అటవీ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే, విదేశీ యాత్రికులు బోటులోంచి మాత్రమే చూడాల్సి ఉంటుంది. తీరంలో బోటు దిగి వీళ్లేందుకు అనుమతి లేదని అండమాన్ నికోబార్ పర్యాటక శాఖ చెబుతోంది.

ఫొటో సోర్స్, andamans.gov.in
అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల సునామీ వస్తుందా?
అగ్నిపర్వతాల పేలుడు వల్ల సునామీ సంభవిస్తుందా? అంటే, అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా ఇండోనేసియాలో విధ్వంసం సృష్టించిన సునామీకి అనక్ క్రకటోవా అనే అగ్నిపర్వతం పేలుడే ప్రధాన కారణమని చెబుతున్నారు.
దాదాపు వందేళ్ల క్రితం వెలుగులోకి వచ్చిన అనక్ క్రకటోవా అగ్నిపర్వతం గురించి స్థానికులందరికీ తెలుసు. కానీ, దాని వల్ల సునామీ వస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు.
సముద్ర గర్భంలోని భూమి పొరల్లో చోటుచేసుకునే అలజడి వల్ల వచ్చే సునామీని ముందస్తుగా గుర్తించే సాంకేతిక వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అగ్నిపర్వతం పేలుడు వల్ల సునామీ వచ్చే అవకాశం ఉందని బహుశా అధికారులు ముందస్తుగా ఊహించి ఉండరు.

ఫొటో సోర్స్, Getty Images
శనివారం సాయంత్రం ఉపగ్రహం పంపిన చిత్రాలను పరిశీలిస్తే అగ్నిపర్వతం పేలుడు సంభవించగానే దాదాపు 64 హెక్టార్ల పర్వత ప్రాంతం ఒక్కసారిగా కూలిపోయింది.
రాళ్లతో కూడిన అంత భారీ పెళ్లలు ఒక్కసారిగా సముద్రంలో పడిపోవడంతో భారీ అలలు ఏర్పడ్డాయి. ఆ అలలు చుట్టూ దూసుకెళ్లాయి.
ఇవి కూడా చదవండి:
- భూప్రళయం: డైనోసార్లు అంతమైన ప్రాంతం ఇదే
- తెలంగాణ: బొంగులో కల్లు.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- పామాయిల్: మీ వంటనూనె, సౌందర్య సాధనాలు అడవి జంతువుల్ని ఎలా చంపేస్తున్నాయంటే..
- ‘క్రైస్తవ మత ప్రచారకుడిని చంపిన అండమాన్ ఆదిమజాతి ప్రజలు’
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- సూర్యుడు సరిగ్గా మీ ఎదురుగా ఉదయించడం ఎప్పుడైనా చూశారా?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
- బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
- ఫ్రెంచ్ సావిత్రి దేవికి జర్మన్ హిట్లర్‌కు ఏమిటి సంబంధం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








