భూమిని సూర్యుడే కబళిస్తాడా?

ఫొటో సోర్స్, NASA/SDO/Steele Hill
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మనిషికి ఈ ప్రపంచం గురించి తెలిసినప్పటి నుంచీ ప్రపంచం అంతమవటం గురించి ఎన్నో ఊహలు చేస్తూనే ఉన్నారు. చాలా మతాల్లో ‘యుగాంతం’ హెచ్చరికలు కూడా ఉన్నాయి.
ఇక చాలామంది జోస్యులు భూగోళం భవిష్యత్తు గురించి ఎప్పటికప్పుడు ఏవో అంచనాలు చెప్తూ హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. 2012 నాటి యుగాంతం ఊహాగానాలు, భయాలు అటువంటి వాటిలో ఒకటి.
భూగోళం మనుగడ విషయంలో వాతావరణ మార్పుల ప్రభావాలు, థర్మోన్యూక్లియర్ యుద్ధాలు, ఆస్టరాయిడ్లు ఢీకొనడాలు వంటి గండాల గురించి తరచుగా మాట్లాడుకుంటూనే ఉంటాం.
నిజానికి భూగోళానికి అన్నిటికన్నా పెద్ద ముప్పు అణ్వాయుధాలు, ప్రపంచయుద్ధాల నుంచే పొంచి వుందని విశ్వసించే వారు, అందులోనూ శాస్త్రవేత్తలు చాలా మందే ఉన్నారు.
‘ద బులెటిన్ ఆఫ్ ఆటమిక్ సైన్సెస్’ సంస్థ ప్రపంచం అంతమయ్యే ప్రమాదాల తీవ్రత గురించి ముందుగా హెచ్చరించేందుకు 1947లో ‘డూమ్స్ డే క్లాక్’ను కూడా రూపొందించింది.
ఈ ‘యుగాంతం గడియారం’లో యుగాంతానికి ఇక రెండే నిమిషాలు మిగిలివున్నాయని శాస్త్రవేత్తలు సవరించారు. అంటే.. రెండు నిమిషాలని అర్థం కాదు.. కానీ చాలా దగ్గరగా ఉన్నామన్నది దాని అర్థం.
నిజానికి ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్ కూడా.. యుగాంతం గురించి లెక్కలు వేశారని యూనివర్సిటీ ఆఫ్ కింగ్స్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ స్టీఫెన్ స్నోబెలెన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి న్యూటన్ చేతిరాత ప్రతులను పరిశోధించిన ఆయన.. 2060 సంవత్సరంలో ప్రపంచం అంతమవుతుందని బైబిల్ ఆధారంగా న్యూటన్ లెక్కకట్టి చెప్పినట్లు తెలిపారు.

భూగోళం ఎన్ని ప్రమాదాలు గట్టెక్కినా ‘అంతం’ తప్పదా?
ఇక.. 2018లో ఏప్రిల్ 2 డేవిడ్ మీడ్ అనే జోస్యుడు చెప్పాడు. అతడు గతంలో 2017 సెప్టెంబర్ 23వ తేదీని డూమ్స్‌డే అని చెప్పాడు. అలా జరగలేదు. మళ్లీ ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచం అంతమవుతుందన్నాడు.
ఆ తర్వాత ఆ తేదీని అక్టోబర్‌కి మార్చాడు. నిబిరు అనే గ్రహం (ఈ ఊహాత్మక గ్రహాన్ని ‘ప్లానెట్ ఎక్స్’ అని కూడా వ్యవహరిస్తుంటారు) భూమిని ఢీకొట్టటమో.. లేదంటే భూమికి చేరువగా రావటం వల్ల భూగోళం మీద అగ్నిపర్వతాలు ఒక్కసారిగా బద్దలైపోవటమో జరిగి భూమి అంతమవుతుందని ఆయన జోస్యం చెప్పారు. కానీ, అదంతా అబద్దమని, అసలు అలాంటి గ్రహం ఏదీ లేదని శాస్త్రవేత్తలు కొట్టివేశారు.
అలాగని భూగోళానికి ముప్పేమీ లేదనలేమనీ శాస్త్రవేత్తలు చెప్తుంటారు. వాతావరణ మార్పులు, ప్రపంచ యుద్ధాలు, అణుబాంబుల పేలుళ్ల వంటివి భూగోళానికి పొంచి ఉన్న పెద్ద ప్రమాదాలని వారు ఉద్ఘాటిస్తున్నారు. ఆస్టరాయిడ్లు, గ్రహశకలాల నుంచి కూడా ఎంతో కొంత ప్రమాదం ఉందనే అంటున్నారు.
అయితే.. ఈ ప్రమాదాలన్నిటినీ ఎలాగోలా గట్టెక్కినా.. అంతిమ ప్రమాదాన్ని భూమి తప్పించుకోలేదని.. చివరికి అంతరించిపోతుందని శాస్త్రవేత్తల అంచనా. అసలు ముప్పు సూర్యుడి నుంచే వస్తుందని.. సూర్యుడే భూమిని కబళించివేస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

ఫొటో సోర్స్, Steinhöfel/Wikipedia
నక్షత్రాలకూ జనన మరణాలు తథ్యం...
నిజానికి భూమి మీద జీవానికి ప్రాణాధారం సూర్యుడే. సూర్యుడి వేడి, శక్తి లేకుంటే భూమి మీద జీవమే ఉండదు. చాలా మతాల్లో సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు. మరి అలాంటి సూర్యుడే భూమిని మింగేస్తాడంటే నమ్మటమెలా?
''నక్షత్రాలు కూడా మనుషుల వంటివే. అవి పుడతాయి. జీవిస్తాయి. చనిపోతాయి. ఒక నక్షత్రం చనిపోయేటపుడు ఒక రెడ్ జెయింట్‌గా మారుతుంది. మన సూర్యుడూ ఒక నక్షత్రమే. ఈ సూర్య నక్షత్రం మరో 500 కోట్ల సంవత్సరాల్లో రెడ్ జెయింట్‌గా మారుతుంది. భూమి కక్ష్య వరకూ అది వ్యాకోచిస్తుంది'' అని ల్యూనార్ అండ్ ప్లానెటరీ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ బ్లాక్ పేర్కొన్నారు.
మన సౌరకుటుంబానికి మూలాధారం.. కేంద్ర బిందువుగా ఉండే సూర్యుడే. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. సూర్య నక్షత్రం, భూగ్రహం ఒకేసారి దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట ఆవిర్భవించాయి.
నిజానికి సూర్యుడు ఒక అగ్నిగోళం. ఇంకా చెప్పాలంటే ఒక వాయు గోళం. అందులో 92.1 శాతం హైడ్రోజన్ ఉంటే.. 7.8 శాతం హీలియం ఉంటుంది. ఈ వాయువులు తమ స్వీయ గురుత్వాకర్షణ శక్తితో గోళాకారంలో కలిసి వుండి ఎప్పుడూ మండుతూ ఉంటాయి.

ఫొటో సోర్స్, Fsgregs/Wikipedia
సూర్యుడు చనిపోయే ముందు.. భూమినీ చంపేస్తాడు..!
మన సూర్యుడు ప్రస్తుతం నడివయసులో ఉన్నాడు. వయసు మళ్లుతోంది. నిరంతరం మండే ప్రక్రియలో హైడ్రోజన్ అయిపోతోంది. ఇది మరో 500 కోట్ల ఏళ్లలో పూర్తిగా ఖర్చవుతుంది.
ఈ హైడ్రోజన్ ఇంధనం అయిపోతున్నకొద్దీ సూర్య నక్షత్రం ఓ 'రెడ్ జెయింట్'గా వ్యాకోచించటం మొదలవుతుంది. అంటే.. సూర్యుడి పరిమాణం విపరీతంగా పెరిగిపోతుంది. భూమి కక్ష్య వరకూ సూర్యుడి పరిమాణం పెరిగిపోయే అవకాశముందని శాస్త్రవేత్తల అంచనా. ఆ క్రమంలో భూమి సూర్యుడి అగ్నికీలల్లో ఆవిరైపోతుంది.
‘‘సూర్యుడు రెడ్ జెయింట్‌గా మారినపుడు అది పొంగిపోతుంది. పస్తుత పరిమాణం కన్నా 50 రెట్ల నుంచి 100 రెట్ల వరకూ పెరిగిపోతుంది. మెర్య్కురీ, వీనస్ గ్రహాలను సూర్యుడు కబళించవచ్చు. బహుశా భూమిని కబళించే వరకూ రాకపోవచ్చు’’ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ ప్రొఫెసర్ డగ్లస్ గోగ్ పేర్కొన్నారు.
అయితే.. సూర్యుడు వ్యాకోచిస్తూ.. భూగోళానికి దగ్గరగా పెరిగే కొద్దీ.. భూమి ఆవిరవటం మొదలవుతుంది. వేడి అతి తీవ్రంగా పెరుగుతూ వస్తుంది. ఆ వేడికి భూమి ఉపరితలం మాయమవుతుంది.
‘‘ఇది మరుగుతున్న నీటిలో ఒక మంచు గడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మంచు గడ్డ బయటివైపు నుంచి కరిగిపోవటం తరహాలో.. భూమి ఉపరితలం ఆవిరైపోవచ్చు. మధ్య భాగం మిగలవచ్చు. అయితే సూర్యుడు ఎంత పెద్దగా పెరుగుతాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది’’ అని ప్రొఫెసర్ డగ్లస్ వివరించారు.

ఫొటో సోర్స్, NASA
భూమితో పాటు మానవాళీ ఆవిరైపోతుందా?
భూమిని సూర్యుడు కబళించటమంటే.. భూమితో పాటు సమస్త జీవాన్నీ.. మనుషులనూ కబళించటమే. అంటే భూమితో పాటు మానవాళి కూడా అంతమైపోతుందా?
నిజానికి సూర్యుడు పుట్టినప్పటి నుంచి ప్రతి 100 కోట్ల సంవత్సరాలకూ పది శాతం ఎక్కువ వేడిగా మారుతోంది. మరో 100 కోట్ల సంవత్సరాలకి.. సూర్యుడి తీవ్ర వేడిమి వల్ల భూమి మీద జీవం నాశనమవటం మొదలవుతుంది. చెట్లు, జంతువులు ఆ వేడిమికి తట్టుకుని మనుగడ సాగించలేవు.
‘‘ఓ 200 కోట్లు, 300 కోట్ల సంవత్సరాల్లో సముద్రాలు సైతం మరిగిపోయి ఆవిరవటం మొదలవుతుంది. భూమి వాతావరణం వీనస్ వాతావరణంలా మారిపోతుంది. ఆ తర్వాత సూర్యుడు వ్యాకోచిస్తూ వేడి పెరిగేకొద్దీ భూమి కూడా ఆవిరైపోవచ్చు’’ అని నాసా ఏమ్స్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త డాక్టర్ క్రిస్ మెక్కే వివరించారు.
‘‘సూర్యుడు రెడ్ జెయింట్‌గా మారిన తర్వాత భూమిని పూర్తిగా కబళించకపోవచ్చునేమో. కానీ రెడ్ జెయింట్ ప్రతాపంతో భూమితో పాటు మనం కూడా పూర్తిగా మాడిమసైపోవటం ఖాయం. మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఆలోగా భూమి నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సిందే’’ అని ఆరిజోనాలోని ల్యూనార్ అండ్ ప్లానెటరీ లాబొరేటరీ ప్రొఫెసర్ కారొలిన్ పోర్కో హెచ్చరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మనిషి మరో గ్రహం మీదకు వెళితేనే మనుగడ...
అలాగని.. మన సౌర కుటుంబంలోని అంగారకుడి మీదకో సూర్యుడికి దూరంగా ఉన్న మరో గ్రహం మీదకో మానవాళి వలస వెళ్లినా ప్రయోజనం ఉండదు.
ఎందుకంటే.. ‘రెడ్ జెయింట్’గా మారిన సూర్యుడు క్రమంగా చల్లబడతాడు. దానిలోని పదార్థాలన్నీ విశ్వంలో కలిసిపోతాయి. ఓ చిన్నపాటి ‘కోర్‘ (మూలకేంద్రం) మాత్రం ‘వైట్ డ్వార్ఫ్ స్టార్’లా మిగులుతుంది. చివరికి అది కూడా చీకటిలో కలిసిపోతుంది. దానితో పాటే మన సౌర వ్యవస్థ కూడా అంతరించిపోతుంది.
సూర్యుడితో పాటు వేడి, వెలుతురులూ అంతమైపోతాయి. మిగతా గ్రహాలు సైతం అంతులేని చిమ్మచీకటిలో భీకరమైన చలిలో మగ్గిపోతాయి. అంతేకాదు.. సౌర కుటుంబాన్ని కలిపి ఉంచుతున్న సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి కూడా మాయమైపోవడం వల్ల ఈ గ్రహాలు కూడా రెక్కలు తెగిన పక్షుల్లా విశ్వంలోకి దారీతెన్నూ లేకుండా జారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇదంతా జరగటానికి మరో 100 కోట్లు లేదా 500 కోట్ల సంవత్సరాలో పట్టొచ్చు కాబట్టి.. అప్పటికి ఖగోళ పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి.. ఈలోగానే మరో నక్షత్ర కుటుంబంలోకి మానవాళి వలస వెళ్లటానికి అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు ఆశాభావంతో ఉన్నారు.

ఫొటో సోర్స్, M. KORNMESSER/AFP/Getty Images
అయితే.. రాబోయే 100 ఏళ్లలో భూగోళం నుంచి మరో సౌర కుటుంబంలోని గ్రహానికి వలస వెళ్లలేకపోతే.. మానవాళి మనుగడ కష్టమని ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ గత ఏడాది హెచ్చరించిన విషయం గుర్తుండే ఉంటుంది.
అంతకుముందు.. మానవాళి గ్రహాంతర వలసకు 1,000 ఏళ్ల గడువు ఉందని అంచనా వేసిన హాకింగ్.. ఏడాదిలోనే ఆ గడువును 100 ఏళ్లకు తగ్గించారు.
వాతావరణ మార్పులు, కాలుష్యాల వల్ల మానవాళి భూగోళంపై తన వినాశనాన్ని తానే తెచ్చుకుంటుందనేది ఆయన ఆందోళన. అదే సమయంలో.. మనుషులు విశ్వాన్ని జయించి మరో గ్రహానికి వెళ్లి మనుగడ సాగించగలరన్న విశ్వాసాన్నీ ఆయన వ్యక్తం చేశారు.
అందుకోసం ’ప్రాక్సిమా బి‘ వంటి గ్రహ వ్యవస్థకు వలస వెళ్లడం మీద దృష్టి సారించాలనీ హాకింగ్ సూచించారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








