అత్యాచారాల గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం చెబుతారు? ఎలా చెబుతారు?

ఫొటో సోర్స్, Getty Images
బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కొందరు తమ పిల్లలను సైతం ఈ ర్యాలీలకు తీసుకొస్తున్నారు.
కశ్మీర్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఘటనల తర్వాత అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల లోపున్న చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొచ్చింది.
ఇంతకూ చిన్నారులపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు, హత్యలు వంటి విషయాలను తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలా వివరిస్తారు? చిన్నారులకు అర్థం అయ్యేందుకు వారు ఏం చేస్తారు? ఈ విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ పలు రాష్ట్రాలకు చెందిన తల్లిదండ్రులతో మాట్లాడింది.
ఏదైనా ఒక అంశంపై పిల్లలకు అవగాహన కల్పించాలనుకుంటే ఆ విషయం గురించి ఒక్కసారి చెప్తే సరిపోదు అంటారు దిల్లీకి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ సమీర్ పారిఖ్.
పిల్లల వయసు, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని బట్టి మన చుట్టూ జరిగే ఘటనలను, వార్తలను వారికి వివరించేందుకు ప్రయత్నించాలని చెప్పారు.
'గతంలో పోల్చుకుంటే తల్లిదండ్రులు వారి పిల్లలతో ఇప్పుడు కాస్త ఓపెన్‌గానే ఈ విషయాలపై మాట్లాడుతున్నారు. కానీ అది ఆశించినంత స్థాయిలో లేదు' అని సమీర్ పారిఖ్ అన్నారు.
బీబీసీ ప్రతినిధి నిఖిత మంథాని పలు రాష్ట్రాలకు చెందిన తల్లిదండ్రులతో మాట్లాడారు. అత్యాచారం, లైంగిక వేధింపుల విషయంలో పిల్లలకు వారు ఎలా, ఎంతవరకు వివరిస్తారన్న అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
"ప్రపంచం మొత్తం ఇలాగే ఉంటుందా?"
నా 11 ఏళ్ల కూతురు మంచి చదువరి. రాజకీయాలు, వర్తమాన అంశాలంటే తనకిష్టం. అత్యాచారాలు, లైంగిక వేధింపులు, వాటి చుట్టూ ఉండే వార్తల గురించి తనకి పెద్దగా తెలియాల్సిన అవసరం లేదని మొదట్లో అనుకునే దాన్ని. కానీ ప్రస్తుతం అది అనివార్యమైంది.
చుట్టూ ఏం జరుగుతుందో గమనిస్తూ, అప్రమత్తంగా ఉండాలని తనకి ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు చెప్పా.
తర్వాత రెండేళ్లకు ఒక పుస్తకంలో అత్యాచారం గురించి చదివి, దానికి అర్థం ఏమిటని నన్ను అడిగింది.
నేను వివరంగా చెప్పలేదు కానీ, దానికి అర్థం ఏంటో చెప్పా. 'ఎవరో ఒకరు మరొకర్ని వేధించడం లేదా ఒకరికి ఇష్టం లేకుండా వారి శరీరాన్ని తాకరానిచోట తాకడం' అని వివరించా.
ఎనిమిదేళ్ల కశ్మీర్ అమ్మాయి విషయంలో జరిగిన ఘోరం తెలుసుకుని, నా కూతురు, ఆమె స్నేహితులు చాలా బాధపడ్డారు. తర్వాత భయపడ్డారు.
బయటి ప్రపంచం మొత్తం ఇలాగే ఉంటుందా? లేదా ఒక్క సందర్భంలోనే ఈ ఘటన జరిగిందా అని కొన్నిసార్లు తను నన్ను ప్రశ్నించింది.
తను చాలా భయపడుతుంది. కానీ తన ప్రపంచంలో తాను స్వతంత్రంగా ఉండాలనుకుంటుంది. తను బయటికి వెళ్లినప్పుడు నేను ఎవరో ఒకరిని తోడు పంపిస్తూ ఉంటాను. అది తనకు నచ్చదు.
మరొకర్ని నాకు తోకలా ఎందుకు పంపిస్తున్నావని తను నన్ను అడిగితే వివరించి చెప్పడం చాలా కష్టం.
ఉత్తర భారతదేశంలో మరింత సంప్రదాయంగా దుస్తులు ధరించాలని నేను చెప్పినపుడు, ఎందుకని ఆమె అడిగితే సమాధానం చెప్పడం ఎంత కష్టమో!
- మోనా దేశాయ్, 11 ఏళ్ల అమ్మాయి తల్లి, ముంబయి

ఫొటో సోర్స్, Getty Images
"మార్పు తీసుకురావడంలో తన పాత్ర కూడా ఉందని అతను తెలుసుకోవాలి"
అత్యాచారం, లైంగిక వేధింపుల గురించి నా పెద్ద కొడుకుతో నేను కొన్నిసార్లు మాట్లాడాను. అతను వార్తా పత్రికలు చదువుతాడు. మీడియాలో వచ్చే ఇలాంటి ఘటనలపై అతని అభిప్రాయమేంటో తెలుసుకుంటా.
అమ్మాయిలకు సంబంధించిన సమస్యలపైనా నేను అతనితో చర్చిస్తాను. ఒక హిందూ పురుషుడిగా అతనికి ఈ విషయాలన్నీ తెలిసి ఉండాలి. సమాజంలో మార్పు తీసుకురావడంతో తన పాత్ర గురించి తెలియాలి.
అత్యాచారాల గురించి మా అబ్బాయికి తెలిసి ఉండటం ముఖ్యమని భావిస్తాను. ప్రపంచంలో మహిళలకు ఉండే అతిపెద్ద భయం లైంగిక వేధింపులే. అది అంతిమంగా ప్రతి ఒక్కరి జీవితంపై, వ్యవహార శైలిపై ప్రభావం చూపుతుంది.
మా అబ్బాయిని వార్తలకు దూరంగా ఉంచను. కానీ వార్తలను వార్తలుగా చూడటం కంటే, ఆ అంశాలపై చర్చించాలని, కారణాలు అన్వేషించాలని చెబుతాను.
నేను ఏం చర్చిస్తున్నానో అన్నిసార్లు నా పిల్లలకు పూర్తిగా అర్థమవుతుందని నేనైతే అనుకోను. కానీ అలాంటి ప్రవర్తన నాకు నచ్చదన్న విషయం మాత్రం వారికి అర్థం అవుతుంది. నాకది చాలు.
- సునయనా రాయ్, ఇద్దరు కొడుకులున్న తల్లి బెంగళూరు.

ఫొటో సోర్స్, Getty Images
"మగాళ్లంతా ఇంతేనా అమ్మా?"
అత్యాచారం, లైంగిక వేధింపుల గురించి నా కూతురితో చర్చించడం పెద్ద సంఘర్షణతో కూడుకున్న పని.
నా కూతురు కూడా మనుషుల్ని నమ్మాలని కోరుకుంటాను. ఆమె కూడా పురుషులతో స్నేహం చేయాలనీ, వారితో ప్రేమలో పడాలని భావిస్తాను.
కానీ, అదే సమయంలో ఆమె భద్రత గురించి నేను ఆందోళన పడుతుంటాను. తను ఇంటికి ఆలస్యంగా వచ్చినా నేనేమీ అనుకోను. తనకు నచ్చిన బట్టలు వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు.
కానీ, బయటికి వెళ్లిన ప్రతీసారి ఫలానా టైమ్‌లోగా ఇంటికి రావాలని ఇప్పటికీ చెబుతుంటాను. సరైన డ్రెస్‌లు వేసుకోవాలని సూచిస్తుంటాను.
నా మదిలో నిత్యం చెలరేగే గందరగోళం ఇది. వాస్తవ పరిస్థితులను నా కూతురు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటా.
అత్యాచారాలు, హింసా ఘటనలు ఆమెను తీవ్రంగా బాధిస్తాయి.
అలాంటి సందర్భాల్లో 'మగాళ్లంతా ఇంతేనా అమ్మా' అని నన్ను అడుగుతుంది. సమాజంలో కొందరు అలా ఉంటారని నేను చెప్తుంటాను.
ప్రపంచం అంతా రంగులమయంగా, ఆనందంగా ఉంటుందని ఆమె నమ్మాలని నేను కోరుకుంటాను. అలాంటి సమయంలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంత కష్టమో.
- పెరుల్, 14 ఏళ్ల బాలిక తల్లి, పంజాబ్.

ఫొటో సోర్స్, Getty Images
"వద్దని చెప్పే ధైర్యాన్ని నూరిపోస్తున్నాం"
మా పిల్లలు నాలుగైదేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే వారికి 'గుడ్ టచ్', 'బ్యాడ్ టచ్' గురించి నేర్పించడం మొదలుపెట్టాం. అలాగే, సొంత శరీరాన్ని, ఎదుటివారి బాడీని ఎలా గౌరవించాలో కూడా నేర్పించాం.
ఇతరులు తాకరాని కొన్ని భాగాలు శరీరంలో ఉంటాయని, వాటిని ఎవరూ ముట్టుకోకూడదని నేర్పించాం. స్నానం చేయించేటప్పుడు తల్లిదండ్రులు, అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్, అది కూడా తల్లిదండ్రుల సమక్షంలోనే తాకాలని మా పిల్లలకు నేర్పించాం.
ఎవరైనా మీరు ఇబ్బంది పడే పని చేస్తుంటే, ఆ పని చేయవద్దని ధైర్యంగా చెప్పాలని కూడా వారికి మేం వివరించాం. నేరుగా మాదగ్గరి కొచ్చి చెప్పినా.. లేదంటే వారికి నమ్మకమున్న వారికైనా చెప్పాలని, అందుకు సిగ్గుపడాల్సిన పని లేదని మా పిల్లలకు విడమరిచి చెప్పాం.
ఆడ-మగ పిల్లలు ఆడుకోవడం సాధారణం. అయితే, మేం ఒక నిబంధన పెట్టుకున్నాం. ఆడ-మగలో ఎవరికి నచ్చకపోయినా ఆట అక్కడితో ఆపేయాలి. నిజానికి ప్రత ఒక్కరికీ అలా ఆపమని చెప్పే అధికారం ఉంది.
వార్తాపత్రికలు చదవడం పైన కూడా మా పిల్లలకు పరిమితులు విధించాం. వాళ్లు ఏ వయసులో ఏం చదవాలి, ఏ మీడియా చూడాలి అన్న విషయంలో నాకు, నా భర్తకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి.
- అఖిలా ప్రభాకర్, 10, 8ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారుల తల్లి, ముంబై.

ఫొటో సోర్స్, Getty Images
"ఎవరో తనను తాకరానిచోట తాకారని కథలు చెప్పేది!"
అత్యాచారాల గురించి నేను ఇప్పటి వరకు నా ఏడేళ్ల కూతురితో ఏనాడూ మాట్లాడలేదు. కానీ రెండేళ్ల క్రితం నుంచే 'గుడ్ టచ్', 'బ్యాడ్ టచ్' గురించి చెప్పడం మొదలుపెట్టా.
అప్పటి నుంచి ఈ టాపిక్‌పై మాట్లాడుకున్న ప్రతీసారీ తనొక కొత్త కథ చెప్పేది. ఎవరు తనను అసందర్భంగా తాకారో వివరించేది.
అప్పుడు నాకు చాలా భయం వేసేది. కానీ ఆ తర్వాత తెలిసింది.. తను చెప్పినవన్నీ ఉత్తుత్తి కథలే అని. చిన్న పిల్లలు కథలు నిజంగా చాలా బాగా చెబుతారు.!
మేం మాట్లాడుకున్న సన్నివేశాలను నా కూతురు తనకు ఆపాదించుకుంటుంది. ఆ స్థానంలో తనను ఊహించుకుని, దాన్ని తన జీవితానికి అన్వయించుకుంటుంది.
అయితే, ఈ విషయాలను తను సరైన దిశగానే అర్థం చేసుకుని, అన్వయించుకుంటోందా లేదా అన్నది ఒక తల్లిగా నన్ను కలవరపెట్టే విషయం.
నా కూతురు వయసు ఉన్న పిల్లలపై జరుగుతున్న దారుణాలు చూస్తే నాకు చాలా భయం వేస్తుంది.
కానీ అత్యాచారాల గురించి నా కూతురితో ఎలా చెప్పాలో తెలియదు. నేను అత్యాచారం గురించి చెబితే, తను దానికి కనెక్ట్ అయిపోతుందేమో అన్న భయం నాది.
- సునందా పరాషర్, 7, 2 ఏళ్ల కుమార్తెలున్న తల్లి, దిల్లీ.

ఫొటో సోర్స్, Getty Images
"అత్యాచార వ్యతిరేక ప్రదర్శనలకు నా కొడుకుని తీసుకెళ్లా"
పరస్పర అంగీకారం, సరైన ప్రవర్తన, హింస, ఆడ-మగ వంటి అంశాలపై నా కుమారుడితో కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నా.
ప్రతి ఒక్కరికీ వేర్వేరు మార్గాల ద్వారా సమాచారం వస్తూ ఉంటుంది. కానీ పిల్లల నమ్మకం, విశ్వాసం ధృడంగా ఉండటం చాలా ముఖ్యం.
ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు, పరిణతి చెందని వారికి పరస్పర సమ్మతి గురించి అర్థం కాదు. హార్మోన్లు వారిని కంగారు పెట్టేస్తాయి.
అందుకే ఇలాంటి చర్చలు చాలా కీలకంగా మారుతున్నాయి. ఇది చేయొద్దు.. అది చేయాలి లాంటి విషయాలు పిల్లలకు చెబితే సరిపోదు. వారి ప్రపంచంలో అలాంటి సంఘటనలు వారికి ఎదురుకాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
గత ఆదివారం మా అబ్బాయిని అత్యాచార వ్యతిరేక ప్రదర్శనలకి తీసుకెళ్లా. ఇది అతనికి చాలా ముఖ్యమని మేం భావించాం. తానొక్కడే కాదు.. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారన్న ధైర్యం కలిగించేందుకు మేమీ పనిచేశాం. తన నమ్మిన విలువలకు కట్టుబడి ఉండేలా ఇది అతన్ని ప్రోత్సహిస్తుందని మా నమ్మకం.
- అరుణాభ్ సిన్హా, 15 ఏళ్ల కుమారుడి తండ్రి, దిల్లీ.
(బీబీసీ పంజాబీ ప్రతినిధి దల్జిత్ అమీ అందించిన అదనపు సమాచారంతో)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








