ఇంతకీ పవన్ కల్యాణ్‌ని ఎవరు టార్గెట్ చేశారు? ఆయన ఎవరిని టార్గెట్ చేశారు?

ఫొటో సోర్స్, janasenaparty/facebook
'నా తల్లి గౌరవాన్ని కాపాడలేనప్పుడు నేను చచ్చిపోవడం నయం'.. అంటూ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురువారం అర్ధరాత్రి చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
తన తల్లి పట్ల అసభ్య వ్యాఖ్యలు చేయించి దాన్ని అనుకూల మీడియాలో పదేపదే ప్రసారం చేయించి, చర్చాగోష్ఠులు నిర్వహించి అమానుషంగా వ్యవహరించారంటూ ఆయన కొందరు రాజకీయ, మీడియా వ్యక్తులపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు.
BackStab (వెన్నుపోటు) అనే హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన మరో మూడు ట్వీట్లలో నేరుగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్, ముగ్గురు మీడియా అధిపతులు, దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
'చేయూతనిచ్చిన చేయిని వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా చంపివేస్తుంటారు, మిమ్మల్ని ఎలా నమ్మాలి?' అంటూ చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించిన ఆయన ఈ రోజు ఉదయం వరకు ట్విటర్లో తన ఆవేదనను వెళ్లగక్కుతూనే వచ్చారు.

ఫొటో సోర్స్, PAWANKALYAN/TWITTER
పవన్ ఆవేదనకు కారణమేంటి?
ఇటీవల తెలుగుసినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం దుమారం రేపుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ అత్యాచారంపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌ను నటి శ్రీరెడ్డి వివాదం గురించి మీడియా ప్రశ్నించగా.. ఆమె చట్టపరంగా వెళ్లాల్సిందని ఆయన సూచించారు.
దీంతో శ్రీరెడ్డి ఆయనపై మండిపడుతూ పవన్ తల్లిని ఉద్దేశించి రాయటానికి వీల్లేని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. అనంతరం దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ వ్యవహారంలోకి వచ్చి పవన్‌ను వివాదంలోకి లాగాల్సిందిగా, అలాంటి మాట అనాల్సిందిగా కూడా తానే సూచించానని చెప్పారు.
శ్రీరెడ్డి, వర్మల తీరును తప్పు పడుతూ పవన్ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇప్పటికే మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు కూడా అనేక కుట్రలు జరిగాయని.. ఇప్పుడు పవన్ విషయంలోనూ అలాగే జరుగుతోందంటూ రాజకీయ పార్టీలు, నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
అయితే, పవన్ ఇప్పుడు తన ట్వీట్లతో నేరుగా ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
తన తల్లిని అవమానించారంటూ ఆవేదన, తనపై కక్ష గట్టారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, PAWANKALYAN/TWITTER
‘ఒక కుట్ర’.. మూడు ప్రశ్నలు
వృద్ధాప్యంలో ఉన్న తన తల్లినుద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లే, దానికి మీడియాలో ప్రచారం కల్పించినట్లే ఇతరుల విషయంలోనూ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.
''చంద్రబాబునాయుడు, లోకేశ్‌ల గురించి ఇలా మాట్లాడగలరా? ''
''విపక్ష నేతను ఎవరైనా దుర్భాషలాడితే దాన్ని ప్రసారం చేయగలరా?''
''ఇదే బాలకృష్ణ విషయంలో అయితే ఇలానే చేస్తారా?''.. అంటూ పవన్ మీడియాను నిలదీశారు.
తన తల్లిని కించపరుస్తూ, తనపై ఇలాంటి ప్రచారం చేయటానికి కారణం అంటూ ఒక దర్శకుడు, కొందరు రాజకీయ నాయకులు, మీడియా సంస్థల అధిపతులపై పవన్ ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, PAWANKALYAN/TWITTER
పవన్ పరువు తీయడానికి రూ.10 కోట్ల ఖర్చా?
పవన్ ట్వీట్లలో ప్రధానంగా ఆరుగురిపై ఆరోపణలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి తాను సహకరిస్తే ఇప్పుడు అందుకు ప్రతిఫలంగా గత ఆరునెలలుగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
వీరందరి కుటుంబాల్లోని మహిళలు సురక్షితంగా ఉన్నారని.. కానీ, వారి రాజకీయ ప్రయోజనాల కోసం, టీఆర్పీల కోసం తన 70 ఏళ్ల తల్లి మాత్రం అవమానానికి గురైందని అన్నారు.
లోకేశ్, ఆయన స్నేహితుడు.. కొన్ని మీడియా సంస్థలతో కలిసి తనపై, తన కుటుంబంపై, తన అభిమానులపై నిరవధికంగా దాడులు చేస్తున్నారన్నారు.
దీన్ని మీడియా చేస్తున్న అత్యాచారంగా ఆయన అభివర్ణించారు. ఇందుకోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు.
తర్వాత శుక్రవారం మధ్యాహ్నం కూడా పవన్ వరుసగా పలు ట్వీట్లు చేశారు.
‘‘ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు ..వారు చెప్పిందే వేదం ,వారి పాడిందే నాదం...’’ అని ట్విట్లరో పేర్కొన్నారు.
మీడియా మహిళలను గౌరవించే విషయంలో రెండు నాల్కల ధోరణిని అనుసరిస్తోందని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, janasenaparty/facebook
ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉత్కంఠ
పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్లో న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఉదయాన్నే ఆయన ఫిలిమ్ చాంబర్ దగ్గరకు చేరుకున్నారు. నాగబాబు, అల్లు అర్జున్ తో పాటు పలువురు నటులు, కొందరు నిర్మాతలు, సినీ వర్గాలకు చెందిన ఇతరులు చాంబర్లో పవన్‌ని కలుసుకున్నారు. పవన్ ఫిలిమ్ చాంబర్లో ఉన్నారని తెలుసుకున్న అభిమానులు అక్కడకు చేరుకున్నారు. పవన్ చాంబర్లో ఉన్నంత సేపూ పవన్ కి అనుకూలంగా, కొన్ని మీడియా సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొందరు పవన్‌కి అనుకూలంగా, స్థానిక చానెల్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ఫిలిమ్ చాంబర్ నుంచి వెళ్లి, ఆ మీడియా సంస్థ డిఎస్ ఎన్ జి (లైవ్) వాహనం ముందు వైపు అద్దం పగలగొట్టారు. కొందరు అభిమానులు ఫిలిమ్ చాంబర్లో ఉన్న వేదిక వైపు దూసుకు వెళ్ళారు.
పవన్ సాయంత్రం మీడియా సమావేశం నిర్వహిస్తారని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ మధ్యాహ్నం తరువాత చాంబర్ నుంచి వెళ్లిపోయారు. ఏమీ మాట్లాడకుండా కేవలం అభిమానులకు చెయ్యి ఊపి వెళ్లిపోయారు. అభిమానులు పవన్ ని చూడగానే సిఎం అంటూ నినాదాలు చేశారు.
ఫిలిమ్ చాంబర్లో పవన్ న్యాయవాదుల బృందంతో సమావేశమయ్యారు. తన తల్లిపై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానిపై రాంగోపాల్ వర్మ వివరణ, వాటిని ప్రసారం చేసిన చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే అంశంపై న్యాయవాదులతో చర్చించారని సమాచారం. చర్చలు జరిగాయి.. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరోసారి చర్చిస్తాం అని ఆ చర్చల్లో పాల్గొన్న ఒక న్యాయవాది బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, janasenaparty/facebook
రాజకీయాలూ, కులమూ, మతమూ, కాస్టింగ్ కౌచ్!
ఈ వ్యవహారంపై సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకుడు భండారు శ్రీనివాసరావు బీబీసీతో మాట్లాడుతూ, "మొత్తం వ్యవస్థలపైనే నీలి నీడలు కమ్ముకున్నాయి" అని అన్నారు.
"సమాజంలో మూడు వ్యవస్థలు కీలకంగా ఉంటాయి. ఒకటి రాజకీయాలు, రెండోది సినిమాలు, మూడోది మీడియా. ఈ మూడూ సమాజాన్ని బాగా ప్రభావితం చేసేవే" అని భండారు చెప్పారు.
మొదట శ్రీరెడ్డి లీక్స్ వ్యవహారం, ఆ తర్వాత వర్మ వ్యాఖ్యలు, ఆ తర్వాత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్స్... ఇవన్నీ చూసినపుడు ఇప్పుడు ఇదంతా దారుణంగా తయారైనట్టు అనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఓ ఇరవై రోజుల క్రితం అసలు వీటి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు దీని గురించి మాట్లాడకుండా ఉండే పరిస్థితే లేదు. అయితే ఎవరికి వారు విడివిడిగా, తమకు అనుకూలమైన పద్ధతుల్లోనే దీనిపై స్పందిస్తున్నారు. అంతే తప్ప దీనికి సానుకూల పరిష్కారం కనుగొనే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు" అని భండారు శ్రీనివాసరావు చెప్పారు.
"ఇందులో అన్ని రకాల వికృతులూ ఉన్నాయి - రాజకీయాలు, కులం, మతం, కాస్టింగ్ కౌచ్ అన్నీ ఉన్నాయి. క్విడ్ ప్రో కో పద్థతిలో ఇచ్చిపుచ్చుకుంటున్నారని కూడా అంటున్నారు" అని ఆయన తెలిపారు.
"పవన్ ట్వీట్స్‌ను గమనిస్తే మీడియా హద్దులు మీరుతున్నట్టుగా ఆయన భావిస్తున్నట్టుగా అనిపిస్తోంది, మీడియాలో వికృత ధోరణులను ఆయన వేలెత్తి చూపిస్తున్నారు" అని శ్రీనివాసరావు చెప్పారు.
"ప్రధాన రంగాలు ఇలా కుమ్ములాడుకుంటుంటే అసలు అంశాలు పక్కకు పోతున్నాయి. జనానికి ఇదంతా జుగుప్సాకరంగా తయారైంది. మీడియాలో ఒకప్పుడు సంపాదకులు మమ్మల్ని ఎక్కడికైనా పంపించి, ఏదైనా అంశాన్ని 'కవర్' చేయాలని చెప్పేవారు. ఇప్పుడు 'కవరప్' చేయాలనే చూస్తున్నారు. ఇది విషాదకరం" అని భండారు శ్రీనివాసరావు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పవన్ కల్యాణ్: 'కులాలను కలిపేస్తాం.. మతాల ఊసెత్తం!'
- బలమైన స్థానాల్లోనే పోటీ: పవన్ కల్యాణ్
- కావాలంటే నన్ను కూడా నిలదీయండి: పవన్ కల్యాణ్
- Exclusive: పవన్ కల్యాణ్ ఎప్పుడూ కాపులకు మద్దతు తెలపలేదు. కానీ..
- ఎడిటర్స్ కామెంట్: పవన్ కల్యాణ్ దక్షిణాది సెంటిమెంట్‌ను అస్ర్తంగా మార్చుకోబోతున్నారా?
- పవన్ కల్యాణ్: ‘అధికారం కొన్ని కులాల గుప్పిట్లోనే ఉండాలా? కుదరదు’
- పవన్ కల్యాణ్: 'చంద్రబాబు, మోదీలేమీ నా చుట్టాలు కాదు!'
- డ్రెస్‌కోడ్.. వారానికోసారి బట్టల్లేకుండా!
- ఎడిటర్స్ కామెంట్: ఎవరికీ మరొకరిపై విశ్వాసం లేదు, ఈ అవిశ్వాస రాజకీయాలనెలా అర్థం చేసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








