‘అధికారం కొన్ని కులాల గుప్పిట్లోనే ఉండాలా? కుదరదు’

ఫొటో సోర్స్, JanasenaParty
- రచయిత, హృదయ విహారి బండి
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుంటూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది. ఈ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్ పార్టీకి కూడా చురకలంటించారు. 2019లో జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని వస్తోన్న ఊహాగానాలకు స్వస్తి పలకడానికే ఈ సభను నిర్వహించినట్లుగా పవన్ ప్రసంగం సాగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేక హోదా సాధన, టీడీపీపై విమర్శలే ప్రధానాస్త్రంగా పవన్ ప్రసంగం సాగింది. హోదా అంశంలో బీజేపీనీ పవన్ తప్పుపట్టారు.
పవన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు..
అందులో కొన్ని..
1. రాష్ట్రవిభజన సమయంలో.. ఆంధ్రప్రదేశ్‌కు 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కానీ మాట తప్పారు. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. చట్టాలు మాకే కానీ.. మీకు వర్తించవా?
2. సెంటిమెంటుతో ప్రత్యేక హోదా రాదన్నారు. మరి తెలంగాణ రాష్ట్రం ఎలా ఇచ్చారు?
3. మీరు సీబీఐ కేసులు, ఇతరత్రా కేసులు పెడతారని అవినీతిపరులు భయపడచ్చు. కానీ నాలాంటివాడు, మా ప్రజలు భయపడరు.
4. హోదా అన్నది డబ్బులకు, ప్యాకేజీలకు సంబంధించినది కాదు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవం సమస్య. మా హక్కుల కోసం పోరాడేందుకు వీధుల్లోకి వస్తాం. రహదారులను దిగ్బంధిస్తాం. దిల్లీలో కాదు.. అవరావతిలోనే మా పోరాటం.
5. అవసరమైతే హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తా. బలిదానాలు అవసరమైతే మొదట పవన్ కల్యాణ్ బలిదానం చేస్తాడు. విద్యార్థులను నేను ప్రేరేపించను. మీరు చదువుకోండి. మీ తరఫున నేను పోరాడతాను.

ఫొటో సోర్స్, janasenaparty/facebook
6. 2014లో టీడీపీ, బీజేపీలకు ఎందుకు మద్దతు ఇచ్చాం? మీ చేత, మీ పిల్లల చేత తొక్కించుకోవడానికా? 2014లో చంద్రబాబుకు మద్దతిచ్చింది ఏపీ పునర్నిర్మాణానికే కానీ, టీడీపీ పునర్నిర్మాణానికి కాదు.
7. 2019లో టీడీపీకి ఎందుకు మద్దతివ్వాలి? చంద్రబాబుకు 2014 ఎన్నికలున్నంత సుఖంగా 2019 ఎన్నికలు ఉండవు.
8. లోకేష్ అవినీతి మీ దృష్టికి వచ్చిందా చంద్రబాబు గారూ..! మీ అబ్బాయికి శేఖర్ రెడ్డితో సంబంధాలున్నాయని అంటున్నారు. అందుకు సంబంధించిన ఫైలు కూడా ప్రధాని వద్ద ఉందని చెబుతున్నారు.
9. ఇసుక అక్రమ రవాణాలో జరిగిన అవినీతి ప్రజలకు తెలుసు. భూమాతను అక్రమంగా తోడేసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని అవినీతి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.
10. హోదా కోసం పోరాడుతారనుకుంటే.. వైఎస్సార్ పార్టీ వాళ్లు అసెంబ్లీకే రారు. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తారా?
11. ప్రతి 30 ఏళ్లకు ఒకసారి రాజకీయ మార్పులు జరుగుతాయి. 1980లో ప్రారంభమైన ఆ శకం ముగిసింది. ఇప్పుడు సరికొత్త రాజకీయ శకం ప్రారంభమైంది.
12. అధికారం కొన్ని కులాల గుప్పిట్లోనే ఉండాలా? కుదరదు. అన్ని కులాల భాగస్వామ్యం ఉండాలి. రానున్న రాజకీయ ప్రయాణం అలాగే ఉండబోతోంది.
13. ఆగస్టు 14న జనసేన మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నాం.
14. కాపు రిజర్వేషన్లు సాధ్యమా అని ఆలోచించకుండా ఆ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. దీంతో కాపులకు, బీసీలకు మధ్య చిచ్చు పెట్టారు. అంబేద్కర్ చెప్పినట్టుగా కులనిర్మూలన సాధ్యమో కాదో తెలీదు కానీ జనసేన పార్టీ.. కులాల మధ్య ఐక్యతను సాధిస్తుంది.
15. రాయలసీమ, ఉత్తరాంధ్రలో చాలా వనరులున్నాయి. కానీ ప్రజలు వలసపోతున్నారు. ఆ ప్రాంతాల్లో నాయకులెందుకు వలసపోవడం లేదు? సీమ వెనకబాటుతనానికి అక్కడి రాజకీయ నాయకులే కారణం.

ఫొటో సోర్స్, Janasenaparty
‘జనసేన స్వతంత్ర రాజకీయ పార్టీ’
పవన్ కల్యాణ్ ప్రసంగంపై తెలకపల్లి రవి బీబీసీతో మాట్లాడుతూ..
‘‘పవర్ స్టార్.. ఒక పవర్ ఫుల్ స్పీచ్ చేశారు. ఇక టీడీపీతో సంబంధాలు తెంచుకున్నట్టే.. అదే సమయంలో కేంద్రానికి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. లోకేష్ గురించి తీవ్ర స్థాయిలో విమర్శించడం, ఆంధ్రప్రదేశ్ అవినీతిలో ప్రథమస్థానంలో ఉందనడం టీడీపీకి శరాఘాతాలే..’’ అని ఆయన అన్నారు.
టీడీపీ పునర్నిర్మాణానికి మద్దతు తెలపడంలేదనడం బలమైన పొలిటికల్ కామెంట్. ఇప్పుడు వైకాపా.. జనసేనను టీడీపీతో కలిపి మాట్లాడటానికి అవకాశం లేదని తెలకపల్లి రవి అన్నారు. ‘‘మాలాంటివారు ఆయన్ను కార్యాచరణ గురించి అడుగుతుంటాం. హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించి, సూచనప్రాయంగా తన కార్యాచరణను ప్రకటించారు’’
ఈరోజుతో జనసేన అనేది పూర్తిగా రాజకీయ స్వరూపం తీసుకున్నట్టు భావించాలని రవి అభిప్రాయపడ్డారు. ‘‘అధికారం కొన్ని కులాల గుప్పెట్లోనే ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించడం ద్వారా.. సామాజిక న్యాయం తమ పార్టీలో ఉంటుందని సూచనప్రాయంగా చెప్పారు. జనసేన ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా చిత్రించేందుకు ప్రయత్నించారు’’ అని తెలకపల్లి రవి చెప్పారు.
‘..అలా చెప్పుకోవటానికి ఇదొక ప్రయత్నం’
మరోవైపు పవన్ ప్రసంగంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారడానికి ఇంకా సమయం పడుతుందని న్యాయవాది రాంకుమార్ బీబీసీతో అన్నారు.
‘‘సభలో దాదాపు నల్ల వెంట్రుకలున్న పిల్లలే కన్పిస్తున్నారు. తెల్ల వెంట్రుకల అనుభవజ్ఞులు తక్కువగా కన్పించారు. పవన్ కల్యాణ్‌కు ఇంకా స్పష్టమైన దృక్పథం ఉన్నట్టు నాకు అనిపించలేదు. కులాల మధ్య ఐక్యత సాధిస్తానని పవన్ చెబుతున్నారు. కానీ కుల నిర్మూలన జరగకుండా సమానత్వం సాధించలేం. కులం అన్నది సమానత్వంలేని సమాజానికి ప్రతిరూపం. తాను టీడీపీతోకానీ బీజేపీతోకానీ లేను అని చెప్పుకోవడానికి ఇది ఒక ప్రయత్నం మాత్రమే’’ అని రాంకుమార్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
- ఎడిటర్స్ కామెంట్: పవన్ కల్యాణ్ దక్షిణాది సెంటిమెంట్‌ను అస్ర్తంగా మార్చుకోబోతున్నారా? జనసేన భవిష్యత్తు ఏంటి?
- ఎడిటర్స్ కామెంట్: ప్రత్యేక హోదా.. మళ్లీ అదే డ్రామానా? మార్పేమైనా ఉంటుందా?
- అభిప్రాయం: హోదా దారెటు? టీడీపీ పయనమెటు?
- కావాలంటే నన్ను కూడా నిలదీయండి: పవన్ కల్యాణ్
- పవన్ కల్యాణ్: 'కులాలను కలిపేస్తాం.. మతాల ఊసెత్తం!'
- Exclusive: పవన్ కల్యాణ్ ఎప్పుడూ కాపులకు మద్దతు తెలపలేదు. కానీ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








