కావాలంటే నన్ను కూడా నిలదీయండి: పవన్ కల్యాణ్

విశాఖపట్నంలో ప్రసంగిస్తున్న పవన్‌కళ్యాణ్

ఫొటో సోర్స్, Janasena Party/Facebook

ఓట్లకోసం రాలేదు.. కరువును చూడ్డానికే వచ్చాను!

'జనసేన పార్టీకి ఓట్లు వేయమని అడిగేందుకు నేను రాలేదు. ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసేందుకు వచ్చానని పవన్ కల్యాణ్ అన్నట్టు 'సాక్షి' దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

‘‘అనంతపురం జిల్లా బాగా వెనుకబడింది. ఈ జిల్లాలో నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను ప్రధాని నరేంద్ర మోదీకి ఓ నివేదిక రూపంలో సమర్పిస్తాను. ప్రజలు కూడా నాయకులను నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలి. ఆఖరుకు నన్ను కూడా నిలదీయండి’’ అని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు.

అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్‌తో భేటీ అయ్యారు.

జిల్లాలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడంలో భాగంగా ఎవరితోనైనా కలుస్తానని ఇందులో భాగంగానే మంత్రిని కలిశానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా? వద్దా? అనేది ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ అన్నారు.

సూర్యుడు

ఫొటో సోర్స్, Getty Images

సూర్యుడే స్ఫూర్తి..

రాష్ట్రానికి సూర్యుడే అతి పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారంటూ 'ఈనాడు' దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

సూర్యుడే స్ఫూర్తిగా 'సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌' నినాదమిచ్చామని వెల్లడించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని.. ప్రకృతిని, సాంకేతికతను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.

కరవు అనే మాట లేకుండా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలనే ఆకాంక్షతోనే సూర్యారాధన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

ఇది ప్రాంతానికి, మతానికి, కులానికి పరిమితమైంది కాదని పేర్కొన్నారు. ప్రతి ఏటా గణతంత్ర వేడుకలా దీన్ని నిర్వహిస్తామని, ఇదో ప్రజాహిత వేడుకని వివరించారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 'సూర్యారాధన' కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆంధప్రదేశ్‌ సూర్యున్ని నమ్ముకున్న రాష్ట్రం. గతంలో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేక థర్మల్‌ విద్యుదుత్పత్తి చేపట్టడంతో వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా సౌర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని చంద్రబాబు అన్నట్టు ఈనాడు తన కథనంలో పేర్కొంది.

నిల్వ చేసిన ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

ఈ ఆహారమే ఓ అనారోగ్యం!

నిల్వచేసిన ఆహారంతో పేగు వ్యాధులు పెరుగతున్నాయంటూ.. ఐబీడీ సదస్సు ఆందోళన వ్యక్తం చేసిందని 'ఈనాడు' దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

ప్రపంచవ్యాప్తంగా పెరుగతున్న పూత, పేగు వాపు, మొదలైన సమస్యలపై ఐబీడీ (ఇన్‌ఫ్లామేటరీ బౌల్ డిసీజెస్) సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. ప్యాకెట్లలో నిల్వ చేసిన ఆహారాన్ని వినియోగించడం పెరగడం వల్లే ఈ సమస్య తీవ్రమవుతోందని పేర్కొంది.

నిర్లక్ష్యం చేస్తే ఇది పేగు కేన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు 33 దేశాల నుంచి 1,400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్లే వారిలో పేగు పూత, వాపు మొదలైన వ్యాధులు సాధారణమని వక్తలు అన్నారు. ఆహారం నిల్వ చేసేందుకు వాడే రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయన్నారు.

ఇక.. పిల్లల్లో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరానికి వైద్యుల ప్రమేయం లేకుండానే యాంటీబయోటిక్స్ వాడటం కూడా వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పిల్లల్లో పేగ సమస్యలు పెరగటానికి ఇది కూడా ఓ కారణమని వక్తలు అన్నారు.

సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహారం తీసుకోవడం, నిల్వ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం ప్రధానమని వక్తలు నొక్కి చెప్పారు.

రైలు

ఫొటో సోర్స్, Getty Images

రైళ్లలో సీసీ కెమెరాలు..

రైళ్లల్లో పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రైల్వే నిర్ణయించిందని 'సాక్షి' దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

దేశంలో మొత్తం 11 వేల రైళ్లో 12 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ఇండియన్ రైల్వే కసరత్తు చేస్తోంది. ఇందుకు బడ్జెట్‌లో 3 వేల కోట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది.

తమ పరిధిలోని అన్ని రైళ్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు నిధులు కేటాయిందాలని దక్షిణ మధ్య రైల్వే తన ప్రతిపాదనలు పంపింది.

రైళ్లలో విధులు నిర్వహించేందుకు అవసరమైన మేర సిబ్బందిని ఆయా జిల్లాల ఎస్పీలు పంపడం లేదని, ఆర్పీఎఫ్‌లోనూ.. సిబ్బంది కొరతతో రైళ్లలో బందోబస్తుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో.. రైళ్లలో జరుగుతున్న నేరాల్లో ఏ.పీ. ఆరో స్థానంలో ఉందని సాక్షి దినపత్రిక వివరించింది.

ప్రయాణికుల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా ఒక్కో కోచ్‌కు 8 కెమెరాలు ఏర్పాటుచేసే అవకాశముంది.

మహిళల కంపార్ట్‌మెంట్లలో ఎక్కే ప్రయాణికులను గుర్తించేందుకు ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

ప్రస్తుతం దేశంలో 395 ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 50 స్టేషన్లలో మాత్రమే సీసీటీవీ కెమెరాల మానిటరింగ్ ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)