ప్రెస్ రివ్యూ: పవన్, కమల్, ఉపేంద్రలకు ఓటేయొద్దన్న ప్రకాశ్‌రాజ్

ఫొటో సోర్స్, Getty Images
సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే దేశం నాశనం: ప్రకాశ్‌రాజ్
సాక్షి: సినీ నటులు రాజకీయాల్లోకి వస్తే దేశానికి పెనుముప్పేనని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీనటులు కమలహాసన్, రజనీకాంత్, ఉపేంద్ర, పవన్ కల్యాణ్‌తో పాటు ఏ భాషకు చెందిన నటుడైనా పార్టీ స్థాపిస్తే వారికి ఓటు వేయరాదని, వ్యక్తిగత అభిమానం వేరు, ఓటు వేయడం వేరని స్పష్టం చేశారు. ఇటీవల పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య ఉదంతంపై స్పందించిన ప్రకాశ్‌రాజ్.. ప్రధాని నరేంద్ర మోదీ తన కంటే గొప్ప నటుడంటూ విమర్శలు చేశారు.
ఆదివారం బెంగళూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశం నాశనమవుతుందన్నారు. ప్రజలు కూడా అభిమానంతో కాకుండా బాధ్యతగల పౌరులుగా సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వచ్చే వారికే ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. జీఎస్టీ, గౌరీలంకేశ్ హత్య తదితర అంశాల గురించి తాను మాట్లాడితే హత్య చేస్తామని బెదిరింపులకు దిగారని, అలాంటివాటికి భయపడేది లేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టంచేశారు. తాను ఏ పార్టీకి, వర్గానికి చెందినవాడిని కాదన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కాగితాల్లోనే దళితుల అభివృద్ధి: మురిగిపోతున్న ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు
నవతెలంగాణ: దళిత వర్గాల అభివృద్ధి కోసం పోరాడి సాధించిన సబ్‌ప్లాన్ చట్టం పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతున్నది. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినా వాటిని ఖర్చు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నది. టీఆర్ఎస్ సర్కారు అధికారం చేపట్టాక ఈ మూడేండ్లలో ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ. 41,526 కోట్లు కేటాయించింది. కేటాయించిన మొత్తంలో ఈ ఏడాది ఖర్చు చేసిన నిధులను కలుపుకుని కేవలం రూ.17, 322 కోట్లు ఖర్చు చేశారు.
కొన్ని శాఖలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, కేసీఆర్ కిట్‌ల పంపిణీ లాంటి పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ వాటిని కూడా దళితాభివృద్ధికే ఖర్చు చేస్తున్నట్టు చూపుతున్నాయి. ఆయుష్, ఇంజనీర్ ఇన్ చీఫ్ బిల్డింగ్, హెల్త్ మెడికల్ అండ్ ఎఫ్‌డబ్ల్యూ(ఎయిడ్స్) లేబర్ హెచ్‌ఓడీ రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్టు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, యూత్ అడ్వాన్స్‌మెంట్ సర్వీసెస్ శాఖలు మాత్రం ఎస్సీ ఉప ప్రణాళికకు రూపాయి కూడా విడుదల చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెటర్లకు కొత్త ఫిట్‌నెస్ మంత్ర: డీఎన్‌ఏ పరీక్ష
నమస్తే తెలంగాణ: భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు బీసీసీఐ కొత్త తరహా పరీక్షను అందుబాటులోకి తెచ్చింది. ఆటగాళ్లందరికీ వ్యక్తిగతంగా డీఎన్‌ఏ జెనెటిక్ ఫిట్‌నెస్ టెస్టును నిర్వహించేందుకు సిద్ధమవుతున్నది. క్రికెటర్లలో వేగం పెంచుకోవడానికి, శరీరంలో కొవ్వును కరిగించుకోవడానికి, ఓర్పు, సహనాన్ని పరీక్షించుకోవడానికి, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి, గాయాల నుంచి తొందరగా కోలుకోవడానికి, కండరాలను మరింత పటిష్ఠం చేసుకోవడానికి ఈ పరీక్ష బాగా ఉపయోగపడుతుంది. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతి క్రికెటర్‌కు వ్యక్తిగతంగా సమగ్రవంతమైన ఫిట్‌నెస్ ప్రణాళికలను రూపొందించనున్నారు.
యూఎస్‌లో తొలిసారి ఎన్‌బీఏ (బాస్కెట్‌బాల్), ఎన్‌ఎఫ్‌ఎల్‌లో ఈ పరీక్షను అమలు చేశారు. టీమ్ ఇండియా ట్రెయినర్ శంకర్ బసు సూచనల మేరకు బోర్డు ఈ పరీక్షను అమల్లోకి తెచ్చింది. ‘ప్రతి క్రికెటర్‌కు ఈ పరీక్షను నిర్వహించేందుకు రూ. 25 నుంచి 30 వేల వరకు ఖర్చు చేస్తున్నాం’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం యోయో టెస్టు ద్వారా భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహిస్తున్నారు. స్టార్ ప్లేయర్లు కూడా ఈ పరీక్షను అధిగమించలేకపోతున్న సమయంలో జెనెటిక్ ఫిటెనెస్ పరీక్షను పాస్ కావడమంటే క్రికెటర్లకు కత్తిమీద సామే.

ఫొటో సోర్స్, facebook
రాజకీయ పార్టీ పెడతా: స్టీరింగ్ కమిటీ సమావేశంలో కోదండరాం
ఆంధ్రజ్యోతి: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల ఘట్‌కేసర్‌లో జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. 'నిర్మాణం లేకుండా ఏదీ సాధ్యం కాదు. ముందు కమిటీలు పూర్తి చేయండి. తర్వాత నేను పార్టీ పెడతా. సంవత్సరం అయింది. ఇప్పటికి 4 కమిటీలే పూర్తయ్యాయి' అని ఆ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో 'ఆంధ్రజ్యోతి'కి లభించింది. పార్టీ ఏర్పాటుకు సన్నాహంగా 'పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ'ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
పార్టీ కార్యవర్గం, అజెండా సంబంధిత విషయాలపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. పార్టీ ఏర్పాటు చేసినా ఎన్నికల్లో పోటీకి కోదండరాం ససేమిరా అంటున్నట్టు తెలిసింది. పార్టీ ప్రారంభించాక కాంగ్రెస్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేయనున్నట్లు, సీపీఐ, సీపీఐ (ఎంఎల్-న్యూ డెమొక్రసీ)లను కూడా కలుపుకొనిపోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా ఏర్పాటు చేయబోతున్న పార్టీకి ప్రజా తెలంగాణ పార్టీ, ప్రజాస్వామిక తెలంగాణ పార్టీ, తెలంగాణ సకల జనుల పార్టీ, జన తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఫొటో సోర్స్, CRDA Plan
నందనవనంగా అమరావతి: రూ. 1484 కోట్లతో ప్రాజెక్టు
ఈనాడు: ఏపీ రాజధాని నగరం అమరావతిని నందనవనంగా మార్చేందుకు రూ. 1,484 కోట్ల వ్యయంతో హరిత అభివృద్ధి ప్రాజెక్టును ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు సీఆర్‌డీఏ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 70 శాతం మొత్తాన్ని రుణసాయం రూపొంలో పొందేందుకు ప్రపంచ బ్యాంకును సంప్రదించాలని భావిస్తున్నట్లు వివరించింది. మూడేళ్ల వ్యవధిలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డు, సెంట్రల్ పార్కు చుట్టుపక్కల ఏడు ప్రముఖ రహదారుల్లో ఇరువైపులా 36 వేల మొక్కలను ప్రణాళిక రూపొందించారు. వీటిలో 24 వేలు భారీ వృక్షాలుగా ఎదిగేవి కాగా, మిగతావి పూలమొక్కలు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








