పవన్ కల్యాణ్: ఏపీలో గొడవలు పెట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి

పవన్

ఫొటో సోర్స్, JanasenaParty

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు.

ఈ నెల 27 నుంచి ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి తన సంపూర్ణ రాజకీయ పర్యటన ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పవన్ పలు అంశాలపై మాట్లాడారు.

ప్రభుత్వాలతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని, గొడవలతో సమస్యలు పరిష్కారంకావని పవన్ చెప్పారు.

పవన్

ఫొటో సోర్స్, JanasenaParty

తాను రాజకీయాల్లోకి రావడానికి చిరంజీవికి ఏలాంటి సంబంధంలేదని, పార్టీ ఏర్పాటు తన నిర్ణయమేనని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌ను కలవడం, తెలంగాణలో పోటీపై విలేకరలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. ''సీఎం కేసీఆర్ కష్టపడి పనిచేస్తున్నారు. ఆయనను కలవడంలో తప్పేం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తానని ముందు నుంచే చెబుతున్నా. నా పర్యటన పూర్తి చేసి వచ్చిన తర్వాత కార్యకర్తలతో సమావేశమై పార్టీకి ఎక్కడ బలం ఉంది? ఎక్కడ నుంచి పోటీ చేయొచ్చు? అనేది నిర్ణయిస్తాం'' అని పేర్కొన్నారు.

తెలంగాణ అంటే తనకు అమితమైన ఇష్టమని, ఇక్కడ మేధావులు రాజకీయాల్లోకి రాకుండా దూరంగా ఉన్నారని అన్నారు.

అయితే, తమకు బలం ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని జనసేన అధినేత వ్యాఖ్యానించడం వివిధ పార్టీలలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

పవన్ వ్యాఖ్యలపై వివిధ పార్టీలు నుంచి భిన్నస్పందనలు వినిపించాయి.

పవన్

ఫొటో సోర్స్, JanasenaParty

అధికార పార్టీలకు ప్లాన్ బీ గా పనిచేస్తున్నారు: కాంగ్రెస్

పవన్ కల్యాణ్ అధికార పార్టీలకు ప్లాన్ బీగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. జనసేన పార్టీ ప్రారంభించినప్పుడు కేసీఆర్ తాట తీస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు అదే కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని అనడం విడ్డూరం అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండేందుకే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు.

తెలంగాణలోని నిరుద్యోగం, ఇక్కడి సమస్యలపై ఓ రాజకీయపార్టీగా స్పందించకుండా ప్రభుత్వాన్ని అభినందించడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ఎంపీ కవిత సినిమాల విడుదలను అడ్డుకుంటున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని గతంలో ఆరోపించిన పవన్ ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.

కాంగ్రెస్‌కు బలమైన స్థానాల్లో పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ఎత్తుగడే పవన్ వ్యాఖ్యల్లో కనిపిస్తుందని అన్నారు.

పవన్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ వివేక్ స్పందించారు. 'తెలంగాణలో ఎవరు బలంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు, ఆయన బలం తెలంగాణలో ఏ స్థాయిలో ఉందో చెప్పాల్సిన అవసరమే లేదు' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.