అమెరికాలో గవర్నమెంటు ఆఫీసులకు తాళం.. ఇళ్లకే పరిమితమైన ప్రభుత్వోద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా తాత్కాలిక బడ్జెట్‌కు సెనేట్ ఆమోదం తెలపకపోవడంతో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. సోమవారం చాలావరకు కేంద్ర కార్యాలయాలు తెరుచుకోలేదు.
వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు విధులకు హాజరు కాలేకపోయారు.
సమస్య పరిష్కారం కాకపోవడంతో ఉద్యోగులకు జీతాలు ఆగిపోయాయి.
ప్రతిష్టంభన తొలగించేందుకు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైన సెనేట్ కూడా ఎలాంటి ఏకాభిప్రాయం సాధించలేదు.
వలస కార్మికుల విధానంపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరలేదు.
అత్యవసర శాఖలు మాత్రం ఎప్పటిలాగే పనిచేస్తున్నాయి.
కానీ 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ' వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలపై ప్రభావం కనిపిస్తోంది.
'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'ని ఆదివారం మూసేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు కేటాయించి, దీన్ని నడిపిస్తామని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ చెప్పారు.

ఫొటో సోర్స్, LOIC VENANCE/AFP/Getty Images
ప్రభుత్వ పాలన ఎందుకు స్తంభించింది?
అమెరికా తాత్కాలిక బడ్జెట్ గడువులోగా సెనేట్ ఆమోదం పొందలేదు.
ఫిబ్రవరి 16 వరకు నిధులు ఖర్చు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది.
వలస విధానంపై తమ అభ్యంతరాలకు సమాధానం చెప్పే వరకు ఈ బిల్లుకు మద్దతు తెలిపేది లేదని డెమోక్రాట్లు స్పష్టం చేశారు.
ప్రభుత్వ కార్యకలాపాలు, సేవలు స్తంభించిపోవడానికి డెమోక్రాట్లే కారణమని రిపబ్లికన్లు విమర్శించారు.
దానికి రిపబ్లికన్లే కారణమని డెమోక్రాట్లు ప్రతి విమర్శలు చేశారు.
ఈ వివాదంపై ఏకాభిప్రాయ సాధన కోసం సెనేట్ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది.
కానీ చట్ట సభ్యుల మధ్య ఎలాంటి అంగీకారం కుదరలేదు.
దీంతో వరుసగా మూడోరోజు ఫెడరల్ కార్యాలయాలు మూతబడే ఉన్నాయి.

ఫొటో సోర్స్, EPA
పంతం వీడని రెండు వర్గాలు
సెనేట్ నిబంధనల ప్రకారం 100 మంది సభ్యులు ఉన్న సభలో ఒక బిల్లు ఆమోదం పొందాలంటే 60మంది సభ్యుల ఓట్లు అవసరం.
రిపబ్లికన్లకు 51మంది సెనేటర్లు ఉన్నారు. బిల్లు పాసవ్వాలంటే మరో 10మంది మద్దతు అవసరం.
బడ్జెట్ బిల్లును అడ్డుపెట్టుకుని వలస విధానంపై ట్రంప్‌తో చర్చలు జరపాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు.
అయితే, ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించినందున ఇప్పుడు ఎలాంటి ఒప్పందం చేసుకోవడం వీలుకాదని రిపబ్లికన్లు చెబుతున్నారు.
సరిహద్దు భద్రత, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం, ఆర్మీకి నిధులు పెంపుతో పాటు వలస విధానంలో సంస్కరణలు తీసుకురావాలని రిపబ్లికన్లు గట్టిగా కోరుకుంటున్నారు.
ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు 'న్యూక్లియర్ ఆప్షన్' ఒక్కటే మార్గమని శనివారం ట్రంప్ ట్వీట్ చేశారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించడం అంటే?
ఫెడరల్ కార్యాలయాలు తెరుచుకోవు. ఉద్యోగులు ఇంటికే పరిమితం అవుతారు. వారికి జీతాలు ఇవ్వరు.
హౌజింగ్, పర్యావరణం, విద్యా, వాణిజ్యం విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోయారు.
ట్రెజరీ, హెల్త్, రక్షణ, రవాణా విభాగాలకు చెందిన సగం మంది ఉద్యోగులు కూడా పని చేయలేదు.
వీసా, పాస్‌పోర్టు పనులకు కూడా ఆటంకం కలిగింది.
అయితే, అత్యవసర సర్వీసులు మాత్రం కొనసాగుతున్నాయి.
అయితే, 2013 నాటి ప్రజల ఆగ్రహం నేపథ్యంలో జాతీయ పార్కులను తెరిచే ఉంచాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరువర్గాలు ఒక అంగీకారానికి ఎందుకు రాలేకపోతున్నాయి?
అమెరికన్ కాంగ్రెస్, వైట్‌హౌజ్‌లో ఒకే పార్టీ పెత్తనం ఉన్నా ప్రభుత్వ కార్యక్రమాలు స్తంభించడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి.
తాత్కాలిక బడ్జెట్ బిల్లుపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కీలకమైన అభిప్రాయ బేధాలు ఉన్నాయి.
పిన్న వయసులో వచ్చి అమెరికాలో స్థిరపడిన సుమారు 7లక్షల మంది వలస కార్మికులను వెనక్కి పంపించకుండా వారికి రక్షణ కల్పించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు.
అయితే, రిపబ్లికన్లు మాత్రం దీనిపై వెనక్కి తగ్గడం లేదు. ప్రతిష్టంభన వీడే వరకు వలస విధానంపై చర్చల ప్రసక్తే లేదని అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








