ప్రపంచ ఆర్థిక వేదిక: దావోస్ సమావేశాలకు హాజరు కావాలంటే ఏం చేయాలి? అసలక్కడ ఏం జరుగుతుంది?

ఫొటో సోర్స్, facebook/KTR
- రచయిత, ఎమిలీ యంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎనమిక్ ఫోరం సదస్సుకు శుక్రవారం నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు.
'ఇట్స్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ అమెరికా'.. ఇదే దావోస్‌లో తాను ఇవ్వబోయే ప్రసంగంలో ప్రధాన అంశంగా ఉంటుందనీ, అమెరికా పెట్టుబడులకు స్వర్గధామమని తెలియజేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
అటు విమర్శకులతో పాటు ఇటు మద్దతుదారులకూ ట్రంప్ దావోస్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
భారత్ నుంచి ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఈ భూగోళంపై ఉన్న అత్యంత సంపన్న, శక్తివంతమైన దేశాలకు చెందిన నేతలంతా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులపై చర్చించడానికి స్విట్జర్లాండ్‌లోని పర్వతాలలో ఉన్న దావోస్ గ్రామానికి చేరుకోవడం ప్రారంభమైంది.
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్యూఈఎఫ్) 1970లలో ఒక చిన్న బృందంగా ప్రారంభమైంది. ప్రముఖ విద్యావేత్త క్లాజ్ స్వ్కాబ్ దీనిని ప్రారంభించినపుడు సుమారు 3 వేల మంది పాల్గొన్నారు. వారిలో 1,200 మంది వివిధ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రతినిధులు కాగా మరో 50 మంది ప్రపంచ నేతలు.
గతేడాది మాట్ డేమన్, విల్.ఐ.యామ్., షకీరాలాంటి వాళ్లు బిల్ గేట్స్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, థెరెసా మేలాంటి వారితో కలిసి ఈ సమావేశాలలో పాల్గొన్నారు.
ఈ ఏడాది భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీనే.
చివరిసారిగా, 1997లో అప్పటి ప్రధానమంత్రి ఎచ్‌డీ దేవెగౌడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దావోస్ సమావేశాలు ఎలా ఉండబోతున్నాయి?
ఎప్పటిలాగే ఈసారి కూడా అనేక సమావేశాలు, కొన్ని రహస్యంగా కూడా, జరగబోతున్నాయి. అయితే బహిరంగ సమావేశాలలో మాత్రం అందరూ పాల్గొనవచ్చు.
రహస్యంగా జరిగే సమావేశాల్లో కేవలం తెల్లని బ్యాడ్జ్ ధరించిన వాళ్లు మాత్రమే పాల్గొంటారు. (వాళ్లు ఆ సమావేశాల్లో పాల్గొనేందుకు నిర్ణీత రుసుమైనా చెల్లించి ఉండాలి లేదా ప్రత్యేక ఆహ్వానితులైనా అయి ఉండాలి)
కొన్ని ప్రైవేట్ సమావేశాలు కూడా జరుగుతాయి. వాటిలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. మూసి ఉన్న తలుపుల వెనుక అతి ముఖ్యమైన అంశాలపై చర్చలు జరుగుతాయి.
ఇంతకూ అక్కడ ఏం జరుగుతుంది ?
చర్చలతో పాటు అక్కడ పార్టీలు కూడా జరుగుతాయి. అలాంటి పార్టీలలో చాలా వాటికి మీరేమీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.
ఆ సమావేశాలకు హాజరైన వారి డిన్నర్‌లు, డ్రింక్‌ల ఖర్చులు కంపెనీలే చెల్లిస్తాయి. ఈ సమావేశాలను అవి తమ క్లయింట్ల నెట్ వర్కింగ్ కోసం ఉపయోగించుకుంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇది కేవలం ఆటపాటలకేనా?
కావచ్చు. కాకపోవచ్చు. ఇక్కడ సమస్యలకు వెంటనే పరిష్కారాలు లభించవు. ఈ సమావేశాలను కేవలం కొన్ని ఆలోచనలకు, సంభాషణలకు వేదికగా ఉపయోగించుకుంటారు. కొన్ని సార్లు కొన్ని ఫలితాలు కూడా రావచ్చు.
దీనికి ఒక ఉదాహరణ - 1980లలో టర్కీ- గ్రీస్‌ల మధ్య యుద్ధమేఘాలు అలముకున్నపుడు నాటి టర్కీ ప్రధాని టుర్గుట్ ఓజల్, గ్రీక్ ప్రధాని ఆండ్రియాస్ పపాండ్రోవ్‌తో దావోస్‌లోనే చర్చించారు. దీంతో ఆ యుద్ధమేఘాలు తేలిపోయాయి.
ఇటీవల ప్రపంచ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్న బ్రిక్స్ బ్యాంక్ కూడా 2011లో దావోస్‌లో ఆర్థికవేత్తలు లార్డ్ స్టెర్న్, జోసెఫ్ స్టిగ్ లిట్జ్‌ల మధ్య జరిగిన సంభాషణ లోంచి పుట్టిందే.
దావోస్‌కు దారేది?
ఇందుకోసం మీకు ఆహ్వానం అంది ఉండాలి. ఇందుకోసం మీరు ప్రపంచ నేతనో, చీఫ్ ఎగ్జిక్యూటివో.. కాకపోతే కనీసం ఏదో కంపెనీ ప్రతినిధి లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ లేదా ఎన్జీవో ప్రతినిధి అయి ఉండాలి.
లేదా ప్రపంచ ఆర్థిక వేదికలో సభ్యత్వం కలిగి ఉండడంతో పాటు సుమారు రూ.17 లక్షలు రుసుం చెల్లించాలి.
ఒక ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ తన ఇన్వెస్టర్ల కోసం ఈ ఈవెంట్‌పై సుమారు రూ.4.4 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మీ దగ్గర అంత సొమ్ము లేకుంటే, అక్కడికి వెళ్లి, చిన్నా చితకా ఈవెంట్స్‌లో పాల్గొనొచ్చు.
దీని కోసం ఔత్సాహికులు కొన్ని నెలల ముందు నుంచే ప్లానింగ్ చేసుకుంటారు.
అక్కడ మీకు లభించే 'హోటల్ బ్యాడ్జ్'తో మీరు సమావేశాలలో పాల్గొనలేకపోయినా, కనీసం అక్కడ ప్రముఖులు పాల్గొనే పార్టీల దగ్గర వరకు వెళ్లొచ్చు.

ఫొటో సోర్స్, AFP
దీని కోసం ఇంత సొమ్ము చెల్లించొచ్చా?
ప్రపంచమంతా తిరిగి తమ క్లయింట్లను కలిసే బదులు, దావోస్‌లోనే అందరినీ కలిసే అవకాశం లభిస్తుంది.
ఇక్కడ సాధారణంగా ఉదయం 7 గంటల అల్పాహారంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. కొన్ని కార్యక్రమాలు మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కొనసాగుతాయి.
అయితే డబ్యూఈఎఫ్‌కు వచ్చే వారిలో చాలా కొద్ది మంది మాత్రమే దావోస్‌లో జరిగే విలాస కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఈ సమావేశాల ఫలితం ఏంటి?
ఎలాంటి ఫలితాన్ని ఆశించొద్దు. ఎందుకంటే దీని నిర్వాహకులు కూడా ఏమీ ఆశించరు. ఈ సదస్సు ఉద్దేశ్యం ఫలితాలను ఆశించటం కాదని వారంటారు.
అయితే, ఇందులో పాల్గొన్నవాళ్లు.. సమావేశాలు ముగిసిన తర్వాత ఏమైనా కొత్త ఆలోచనలతో, కొత్త సంబంధాలతో, తమ చుట్టూ ఉండే ప్రపంచం గురించి మరింత మెరుగైన అవగాహనతో, సమస్యలను ఎదుర్కొనే తాజా వ్యూహాలతో బయటకు వస్తే దావోస్ సమావేశాల ప్రయోజనం మరొకసారి నెరవేరినట్లే.
ఇవి కూడా చదవండి:
- హైపర్‌లూప్: భవిష్యత్తా? భ్రమా?
- అపర కుబేరుల పన్ను స్వర్గం రహస్యాలు బట్టబయలు
- ప్యారడైజ్ పేపర్స్‌లో వైఎస్ జగన్ పేరు!
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- కూల్‌డ్రింక్స్ తాగితే కొవ్వు పెరుగుతుందా?
- ‘ఏడాదిన్నరలో అమెరికా వీడి వెళ్లండి’
- అమెరికా స్తంభించటానికి ట్రంప్ ఎంత వరకు కారణం?
- ‘నన్ను ప్రేమించినందుకు నా భర్తను హత్య చేశారు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








