నలుగురు తెలుగువాళ్లు సహా 16 మంది ఇరాన్‌లో నిర్బంధం, అసలేం జరిగింది?

ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

    • రచయిత, మొహమ్మద్ సర్తాజ్ ఆలమ్
    • హోదా, బీబీసీ కోసం

ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇరాన్‌పై చర్య తీసుకుంటామని అమెరికా సంకేతాలిస్తోంది.

ఈ సమయంలో భారత్‌కు చెందిన 16 మందిని ఇరాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిలో 10 మందిని జైలులో పెట్టారు.

దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

నిబంధనలకు విరుద్ధంగా డీజిల్‌తో వెళుతున్నారనే ఆరోపణలపై దిబ్బా ఓడరేవు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ అధికారులు 'ఎమ్ టీ వాలియంట్ రోర్' అనే నౌకను 18 మంది సిబ్బందితో పాటు డిసెంబరు 8న స్వాధీనం చేసుకున్నారు.

జనవరి 6న ఇరాన్ అధికారులు ఈ ఓడలోని భారతీయ సిబ్బందిలో పదిమందిని జైలులో పెట్టారు. ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి యాజమాన్యంలోని ఈ నౌకలో 16 మంది భారతీయులు, ఒక బంగ్లాదేశీ, ఒక శ్రీలంక‌న్ ఉన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, కెప్టెన్ విజయ్ కుమార్

‘ఓడలో అక్రమ డీజిల్ ఉందనే ఆరోపణలు’

ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్ విభాగంలో పనిచేస్తున్న భారత ఫారిన్ సర్వీసు అధికారి ఎం. ఆనంద్ ప్రకాశ్ బీబీసీకి ధ్రువీకరించారు.

"ఈ కేసు అక్కడి కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాబట్టి ఇరాన్ కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అయితే తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సిబ్బంది కాన్సులర్ యాక్సెస్ పొందడానికి ప్రయత్నిస్తున్నారు" అని ఎం.ఆనంద్ ప్రకాశ్ అన్నారు.

"జనవరి 10న కాన్సులర్ యాక్సెస్ లభిస్తుందని మేమనుకున్నాం. కానీ ఇరాన్‌లో గందరగోళం కారణంగా అది జరగలేదు. కానీ మేము ప్రయత్నిస్తున్నాం" అని ఆయన అన్నారు.

తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా ఒక ప్రెస్‌నోట్‌లో ఈ పరిణామాలను ధ్రువీకరించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌తోనూ, నౌక యాజమాన్య కంపెనీ ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్ఎల్‌సీ తో తెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది.

మరోవైపు ఇరాన్ ప్రభుత్వ ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తోంది.

ఓడలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్ అనధికారికమైందనే ఆరోపణ నిరాధారమని 'ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి' కంపెనీ యజమాని జోగిందర్ బరాడ్ అన్నారు.

"ఈ నౌక డీజిల్‌ను తీసుకెళ్లదు. ‘వెరీ లో సల్ఫర్ ఫ్యూయల్ ఆయిల్’ ను తీసుకువెళ్తుంది. ఇది అంతర్జాతీయ జలాల్లో మన ఇతర నౌకలకు ఇంధనం నింపడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధారణ ప్రక్రియలో భాగం" అని ఆయన బీబీసీతో చెప్పారు.

"ఓడలోని ఇంధనాన్ని డీజిల్‌ అనుకుని ఇరాన్ మా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించింది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా మొదటి ప్రాధాన్యత మా సిబ్బంది అందరినీ సురక్షితంగా భారత్‌కు తిరిగి తీసుకురావడం" అని జోగిందర్ బరాడ్ చెప్పారు.

ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ గుప్తా, దివాకర్, విశాల్ కుమార్ (ఎడమ నుంచి కుడికి)

అన్నంలో ఉప్పు కలుపుకుని...

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓడ కెప్టెన్ విజయ్ కుమార్, ఆయిలర్ ఆకాశ్ గుప్తా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెకండ్ ఆఫీసర్ డుంగా రాజశేఖర్, డెక్ ఫిట్టర్ నందకీ వెంకటేశ్, కుక్ దివాకర్ పుత్తి పంజాబ్‌కు చెందిన సీమాన్-1 విశాల్ కుమార్‌లను గత 45 రోజులుగా ఇరాన్ భద్రతా దళాలు ఓడలో కఠినమైన నిఘాలో ఉంచాయి.

ఈ ఆరుగురు భారతీయులతో పాటు బంగ్లాదేశ్ చీఫ్ ఇంజనీర్ మొహమ్మద్ లుక్మాన్, శ్రీలంక ఎలక్ట్రికల్-టెక్నికల్ ఆఫీసర్ ప్రియా మనాథూంగాలను కూడా ఓడలో అదుపులోకి తీసుకున్నారు.

విమానంలోని సిబ్బంది నుంచి బీబీసీకి అందిన సమాచారం ప్రకారం ఎనిమిది మంది సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. వారిని 14 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు ఉన్న మెస్‌లో ఉంచారు. రాత్రిపూట వారు అక్కడే నిద్రపోతున్నారు.

తమ విడుదల గురించి భారత రాయబార కార్యాలయం, కంపెనీ తెలియజేస్తాయనే ఆశతో వారు ప్రతి రోజూ ఎదురు చూస్తున్నారు. నెలన్నర రోజులుగా ఇదే పరిస్థితి .

డిసెంబరు మూడో వారంలో ఓడలోని సరుకులన్నీ అయిపోవడంతో డిసెంబరు 25న సరుకులు పంపించారు ఓడ యజమాని జోగిందర్ బరాడ్. ఒక వారం గడిచేసరికి బియ్యం మాత్రమే ఉన్నాయి.

ఓడలోని కంపెనీ కుక్ దివాకర్ రోజుకు రెండుసార్లు అన్నం వండుతున్నారు. ఎనిమిది మంది ఆ అన్నాన్ని ఉప్పుతో కలిపి తింటున్నారు. అదే వారి రోజువారీ ఆహారం.

దాదాపు పదిరోజులనుంచి తమకు మంచినీళ్లు అందడం లేదని ఓడలో బందీలుగా ఉన్న సిబ్బంది చెబుతున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించడానికి ఓడలో ఉంచిన నీళ్లను మరిగించుకుని సిబ్బంది తాగుతున్నారు. ఆ నీళ్లపై ''తాగడానికి కాదు'' అని రాసి ఉంటుంది. కానీ సిబ్బంది ఆ నీళ్లనే తాగాల్సివస్తోంది.

ఓడలోని డీజిల్ అయిపోవడంతో రాత్రిపూట మాత్రమే వాళ్లు జనరేటర్‌ ఉపయోగిస్తున్నారు. అది ఎంతకాలం పనిచేస్తుందో తెలియదు.

ఓడలోని ఇంధనం కూడా అయిపోయే దశలో ఉందని కెప్టెన్ విజయ్ సోదరుడు వినోద్ పన్వర్ చెప్పారు.

ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, కేతన్ మెహతా తండ్రి

ఫోన్‌లో మాట్లాడే అవకాశం

నౌకా సిబ్బంది మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులున్న బ్యాగులను డిసెంబరు 8న, ఇరాన్ భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

చాలాకాలం ప్రాధేయపడిన తర్వాత ఇరాన్ భద్రతా దళాలు వారికి ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాయి. ఈ ఆరుగురు భారతీయులు రోజూ లేదా రెండురోజులకోసారి ఈ ఫోన్ ద్వారానే వారి కుటుంబాలతో వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.

జనవరి 31 వరకు 5 జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉందని, వాట్సాప్ కాల్స్ మాట్లాడడం కూడా ఎక్కువ కాలం ఉండబోదని ఓడ కెప్టెన్ విజయ్ కుమార్ సోదరుడు వినోద్ పన్వర్ చెప్పారు.

ఓడలో రేషన్, నీళ్లు సహా ఇతర సౌకర్యాల కొరతపై యజమాని జోగిందర్ బరాడ్ స్పందించారు. "వీలైనంత త్వరగా వారికి సౌకర్యాలు అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం" అని చెప్పారు.

అయితే కంపెనీ తీరుపై సిబ్బంది కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

"డిసెంబరు 8న ఈ సంఘటన జరిగినప్పుడు కంపెనీ సీరియస్‌గా తీసుకుని ఉంటే, నా కొడుకుతో సహా పదిమంది ఇప్పుడు జైలులో ఉండేవారు కాదు" అని ఓడ మూడో ఇంజనీర్ కేతన్ మెహతా తండ్రి ముకేశ్ మెహతా అన్నారు.

ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, ఇరాన్‌కు జైలుకు తరలించిన వారిలో ఈ ముగ్గురు ఉన్నారు.

మరికొన్నిరోజుల్లో పెళ్లి..ఇంతలోనే

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన థర్డ్ ఆఫీసర్ వెంకట్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చీఫ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింగ్, సీమాన్ ఆకాష్ కుమార్ సింగ్, గోపాల్ చౌహాన్ షోయబ్ అక్తర్, హరియాణాకు చెందిన సెకండ్ ఇంజనీర్ సతీశ్ కుమార్, దిల్లీకి చెందిన థర్డ్ ఇంజనీర్ కేతన్ మెహతా, తమిళనాడుకు చెందిన డెక్ క్యాడెట్ ఏరో దరీష్, బిహార్‌కు చెందిన ఆయిలర్ మసూద్ ఆలమ్, ముంబైకి చెందిన ఆయిలర్ అన్సారీ మంజూర్ అహ్మద్‌లను జనవరి 6న ఇరాన్ భద్రతా దళాలు జైలుకు పంపాయి.

ఈ 16 మందిలో చాలామంది జనవరిలో తమ విధులను ముగించుకోవాల్సి ఉంది.

విశాల్ కుమార్, నందకీ వెంకటేశ్, మసూద్ ఆలమ్‌ల తొమ్మిది నెలల ప్రయాణం ఈ జనవరిలో ముగియబోతోంది.

"మా అబ్బాయి చివరిసారిగా జనవరి 5న ఫోన్ చేశాడు. కానీ చాలా తక్కువగా మాట్లాడాడు. అప్పటి నుంచి నేను వాడితో మాట్లాడలేకపోయాను" అని బిహార్‌కు చెందిన మసూద్ ఆలమ్ తండ్రి ఇబ్రార్ అన్సారీ చెప్పారు.

తన కొడుకు ఆరోగ్యం గురించి అన్సారీ ఆందోళన చెందుతున్నారు.

"డిసెంబరు 8న అందరినీ అదుపులోకి తీసుకున్నప్పుడు, మసూద్ ఆలమ్ జ్వరంతో ఉన్నాడు. ఇప్పుడు వాడి ఆరోగ్యం ఎలా ఉందో సమాచారం లేదు" అని ఇబ్రార్ అన్సారీ అన్నారు.

ఈద్ తర్వాత మసూద్ వివాహం చేసుకోవాల్సి ఉంది. కానీ ఈలోగానే ఆ కుటుంబపు ఆనందం ఆవిరైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుంగా రాజశేఖర్ సోదరి వివాహం మార్చిలో ఉంది.

''మా అబ్బాయి కేతన్ జైలుకు వెళ్లాడనే వార్త విన్న తర్వాత, నా భార్య ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది" అని ముకేశ్ మెహతా చెప్పారు.

"ఇది నా ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్యే కాదు. మొత్తం 16 కుటుంబాలది. మేము దాదాపు అన్ని విభాగాలకు మెయిళ్లు పంపించాం. కానీ ఎలాంటి స్పందన రాలేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, మసూద్ ఆలమ్ తండ్రి

కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

అనిల్ సింగ్ భార్య గాయత్రి సింగ్ కూడా ఇరాన్‌లో తన భర్తతో సహా ఓడ సిబ్బంది అందరినీ మానవ కవచాలుగా ఉపయోగిస్తోందని భావిస్తున్నారు.

"ఇరాన్‌కు ఓడ కంపెనీతో లేదా దానిలో తీసుకువెళుతున్న సరుకుతో ఏదైనా సమస్య ఉంటే అది నేరుగా కంపెనీతో మాట్లాడాలిగానీ ఉద్యోగులను వేధించకూడదు" అని గాయత్రిసింగ్ అన్నారు.

"ఓడను ఆపరేట్ చేసేది కంపెనీ. ఓడలో ఏం జరుగుతుందో కంపెనీ నిర్ణయిస్తుంది.. సిబ్బంది కాదు. సిబ్బందిని జైలుకు పంపాలనే ఇరాన్ నిర్ణయం పూర్తిగా అమానవీయం" అని భారత నావికుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ అన్నారు.

సిబ్బందిని రక్షించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని, కానీ ఇరాన్ మాట్లాడటానికి ఇష్టపడటం లేదని ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సి యజమాని జోగిందర్ బరాడ్ అన్నారు.

"మా ఓడను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి" అని జోగిందర్ బరాడ్ చెప్పారు.

ప్రైమ్ ట్యాంకర్స్ ఎల్‌ఎల్‌సికి సంబంధించి అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ కూడా అంగీకరించారు. వీటిని ఇప్పటికే షిప్పింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌కు నివేదించామని తెలిపారు.

"ఈ 42 రోజుల్లో మేము చాలా నిరాశకు గురయ్యాం. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి మా కుటుంబసభ్యులందరం కలిసి హైకోర్టును ఆశ్రయించాం" అని కెప్టెన్ విజయ్ కుమార్ భార్య సోనియా తెలిపారు.

ఇరాన్, ఓడ, దుబాయ్, సిబ్బంది, డీజిల్, నౌకాసిబ్బంది

ఫొటో సోర్స్, Mohd Sartaj Alam/BBC

ఫొటో క్యాప్షన్, అనిల్ సింగ్ భార్య గాయత్రి సింగ్

'చర్యలు తీసుకుంటున్నాం'

కేంద్ర ప్రభుత్వం మీద విజయ్ సింగ్, ఆయన కుటుంబ సభ్యులు దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత జనవరి 15న విచారణ జరిగింది.

కోర్టులో ప్రతివాదుల తరపున హాజరైన సీజీఎస్‌సీ నిధి రామన్ "ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో కూడా పిటిషనర్ల ఫిర్యాదు పరిష్కారానికి సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తుంది" అని చెప్పారు.

తదుపరి విచారణ జనవరి 21న జరగాల్సి ఉంది.

"ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం ఒక లాయర్‌ను ఏర్పాటుచేసుకున్నాం. కానీ ఇరాన్‌ అంతర్గత పరిస్థితుల కారణంగా సిబ్బందిని లాయర్ కలవలేకపోతున్నారు" అని కంపెనీ యజమాని చెప్పారు.

కంపెనీ దీనికి బాధ్యత తీసుకోవాలని యూనియన్ జనరల్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)