లోక్‌సభ స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం

ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం బుధవారం మూజువాణి ఓటుతో వీగిపోయింది. అయితే ఈ సందర్భంగా జరిగిన చర్చ తీవ్ర గందరగోళానికి దారితీసింది.
అమిత్ షా ప్రసంగిస్తున్న సమయంలో సభలో గందరగోళం చెలరేగింది. ఆ తర్వాత ప్రిసైడింగ్ చైర్మన్ జగదాంబికా పాల్ ప్రతిపక్ష ఎంపీలను ఓటింగ్ కోసం వారి స్థానాలకు తిరిగి వెళ్లాలని కోరారు.
ప్రతిపక్షాల నిరసనల మధ్యే మూజువాణి ఓటింగ్ నిర్వహించడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. తర్వాత సభను వాయిదా వేశారు.
స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం ద్వారా ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య పునాదిని ప్రశ్నిస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. మరోపక్క తనను 'సభలో మాట్లాడటానికి అనుమతించలేదని' లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
118 మంది ప్రతిపక్ష ఎంపీల మద్దతుతో లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఆయన కార్యాలయం నిష్పాక్షికతను కొనసాగించడంలో విఫలమైందని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు.
మంగళవారం ప్రత్యేక సభాపతి, బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ ఈ తీర్మానంపై చర్చకు అనుమతించి, 10 గంటల సమయం కేటాయించారు.


ఫొటో సోర్స్, ANI
అమిత్ షా ఏం అన్నారు?
స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం సాధారణ విషయం కాదని హోం మంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు.
"స్పీకర్ ఓం బిర్లాకు నైతికత నేర్పించకూడదు. కాంగ్రెస్ హయాంలో స్పీకరుపై అవిశ్వాసం పెడితే, స్పీకరు సభలోనే కూర్చునేవారు, కానీ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తెచ్చినప్పటి నుంచి ఆయన సభకు రాలేదు" అన్నారు అమిత్ షా .
"దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత, లోక్‌సభ స్పీకర్‌పై మరోసారి అవిశ్వాస తీర్మానం వచ్చింది. ఒక విధంగా, ఇది పార్లమెంటరీ రాజకీయాలకు, సభకు విచారకరమైన ఘటన" అన్నారు .

ఫొటో సోర్స్, ANI
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, స్పీకర్ పాత్ర గురించి చాలాసార్లు చర్చలు జరిగాయన్నారు. తన గురించి చెడుగా ప్రస్తావించారని చెప్పారు.
"ఈ సభ దేశప్రజల అభిప్రాయాలకు వేదిక. ఇది ఏ ఒక్క పార్టీకి చెందినది కాదు, ఇది మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది . కానీ మనం మాట్లాడటానికి లేవగానే, మాట్లాడనివ్వరు’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు.
"క్రితంసారి నేను మాట్లాడినప్పుడు, ప్రధాని చేసుకున్న ఒప్పందాలపై ఓ ప్రాథమిక ప్రశ్న లేవనెత్తాను. చాలా సార్లు నన్ను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. లోక్‌సభ చరిత్రలో మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడకుండా చేశారు" అని రాహుల్ అన్నారు.
రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అమిత్ షా సభలో స్పందించారు.
"18వ లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి 157 గంటల 55 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కింది. మీ పార్టీ తరపున ఎవరు మాట్లాడాలో నిర్ణయించుకోవడం మీ ఇష్టం. కానీ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విదేశాలలో ఉంటారు. తర్వాత ఫిర్యాదు చేస్తారు. మీరు ఎందుకు మాట్లాడలేదని నేను ప్రతిపక్ష నాయకుడిని అడగాలనుకుంటున్నాను. ఏ స్పీకర్ మిమ్మల్ని ఆపారు? లోక్‌సభను అప్రతిష్ఠ చేయడానికి ఈ తప్పుడు ప్రచారం జరుగుతోంది" అన్నారు.

ఫొటో సోర్స్, ANI
పార్లమెంటు గౌరవం కాపాడటానికే
స్పీకర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోలేదని, పార్లమెంటు గౌరవాన్ని కాపాడటానికే ఈ తీర్మానం తీసుకొచ్చామని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, స్పీకర్ ఓం బిర్లాను సమర్థిస్తూ, రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నేతలను విమర్శించారు.
ప్రియాంక గాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా ఉండి ఉంటే, పనితీరు బహుశా మెరుగ్గా ఉండేదని బీజేపీ నాయకుడు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో అన్నారు.
ప్రియాంక గాంధీ మాట్లాడుతూ , "ఈ దేశంలో 12 ఏళ్లలో వారి ముందు తలవంచని ఏకైక వ్యక్తి ఉన్నారు. ఆయనే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన ఈ సభలో నిలబడి సంకోచం లేకుండా నిజం మాట్లాడతారు, వారు సత్యాన్ని జీర్ణించుకోలేరు" అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














