టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో హనుమాన్ ఆలయంలోకి వెళ్లడంపై విమర్శలేంటి? గౌతమ్ గంభీర్ ఏమని సమాధానం చెప్పారు

ఫొటో సోర్స్, ani
టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లడాన్ని మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ విమర్శించారు. ఆయన చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది.
గెలిచిన జట్టులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు ఉన్నారని కానీ ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లారని, దీనికి భారత జట్టు సిగ్గుపడాలని ఆయన అన్నారు. కీర్తి ఆజాద్ 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు.
టీ 20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమైన ఇషాన్ కిషన్‌తో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు, రాజకీయ నాయకులు కీర్తి ఆజాద్ ప్రకటనపై స్పందించారు.
ఆదివారం(మార్చి 8) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్ కప్ గెలుచుకుంది.
టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, ఐసీసీ చైర్మన్ జై షా అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. దీనిపై కీర్తి ఆజాద్ స్పందించారు.


ఫొటో సోర్స్, ani
‘సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’
కీర్తి ఆజాద్ ప్రకటనపై భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
" దీని గురించి నేనేం చెప్పాలి? ఇది సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం లేని ప్రశ్న. ఇది మొత్తం దేశానికి ఒక గొప్ప క్షణం. ఇది మొత్తం దేశానికి చాలా గొప్ప విషయం. ప్రపంచ కప్ విజేతగా సంబరాలు జరుపుకోవడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. కొన్ని సమస్యలను లేవనెత్తడంలో అర్థం లేదు. ఎందుకంటే ఈ విషయాలు వారి (ఆటగాళ్ల) విజయాన్ని తక్కువ చేస్తాయి. మీరు ఆ 15 మంది ఆటగాళ్ల విజయాన్ని, ప్రయత్నాలను తక్కువ అంచనా వేయాలనుకుంటే రేపు ఎవరో, ఏదో ప్రకటన చేస్తారు. మనం తీవ్రంగా పరిగణిస్తే ఆటగాళ్లకు మంచి జరగదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ తర్వాత ఆటగాళ్లపై ఉన్న ఒత్తిడిని, ఆ తర్వాత వారు చాంపియన్లుగా మారిన తీరును గమనించాలి. ఇలాంటి ప్రకటనలు వారి విజయాన్ని తక్కువ చేస్తాయి'' అని ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించారు.
"దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుంటారో, వారు ఎంత ఒత్తిడికి లోనయ్యారో ఊహించుకోండి. ఇప్పుడు మీరు అలాంటి ప్రకటన చేస్తే మీ సొంత ఆటగాళ్లను, సొంత జట్టును నిరాశపరుస్తున్నారు. అలా చేయకూడదు" అని గౌతమ్ గంభీర్ అన్నారు.

ఫొటో సోర్స్, Punit PARANJPE / AFP via Getty Images
కీర్తి ఆజాద్ విమర్శలపై ఇషాన్ కిషన్ ఏమన్నాడు?
"టీం ఇండియాకు సిగ్గుచేటు. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో మేం ప్రపంచ కప్ గెలిచాం. మా జట్టులో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఉన్నారు. మేం ట్రోఫీని మా మా మాతృభూమి భారతదేశానికి తీసుకొచ్చాం. భారత క్రికెట్ ట్రోఫీని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు?" అని కీర్తి ఆజాద్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
"మసీదుకు, చర్చికి, గురుద్వారాకు ఎందుకు తీసుకెళ్లలేదు? భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది సూర్యకుమార్ యాదవ్ లేదా జై షా కుటుంబం కాదు. ట్రోఫీని సిరాజ్ ఎప్పుడూ మసీదులో ప్రదర్శించలేదు. సంజూ దానిని చర్చికెప్పుడూ తీసుకెళ్లలేదు. ఈ ట్రోఫీ ప్రతి మతానికి చెందుతుంది. 140 కోట్ల భారతీయులకు చెందుతుంది. ఇది ఏ ఒక్క మతం విజయానికి సంబంధించిన వేడుక కాదు" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
పట్నా చేరుకున్న ఇషాన్ కిషన్ ఎయిర్‌పోర్టులో కీర్తి ఆజాద్ వ్యాఖ్యలపై విలేకరులు అడిగినప్పుడు.. "మనం ఇంత గొప్ప ప్రపంచ కప్ గెలిచాం. మీరు మంచి ప్రశ్నలు అడగాలి. కీర్తి ఆజాద్ ఏం అన్నారు? దీనికి నేను ఏమి చెప్పాలి? కొన్ని మంచి ప్రశ్నలు అడగండి" అని స్పందించాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఇది మంచి సంప్రదాయం కాదు’
కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్ ఈ వ్యవహారంపై మాట్లాడుతూ.. "కీర్తి ఆజాద్ చెప్పింది పూర్తిగా నిజమే. ఆయన చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ట్రోఫీతో గుడికి, మసీదుకు లేదా మరే ఇతర ప్రదేశానికి వెళ్లడం మన సంప్రదాయం కాదు. ఇది తప్పుడు సంప్రదాయానికి ప్రారంభం" అన్నారు.
"ఇది మా విశ్వాసం, భక్తికి సంబంధించినది. దీన్ని అర్థం చేసుకోని వారు ప్రశ్నలు లేవనెత్తుతారు" అని అహ్మదాబాద్‌లోని హనుమాన్ ఆలయానికి చెందిన మహంత్ ఈశ్వర్ దాస్ మహారాజ్ అన్నారు.
"ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. కానీ భారత్ సనాతనవాదులతో అనుబంధం కలిగిఉన్నదేశం. భారత్ గుర్తింపు క్రైస్తవులు, ముస్లింలతో గుర్తింపుపొందలేదు" అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
"దీనిని మతంతో ముడిపెట్టడం సరికాదు. భారత జట్టుకు ట్రోఫీని ఎక్కడికైనా తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంది. వారు కీర్తి ఆజాద్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. కీర్తి ఆజాద్ ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం ద్వారా ప్రజలను విభజించడానికి ప్రయత్నించకూడదు" అని శివసేన నాయకుడు కృష్ణ హెగ్డే అన్నారు.
భారత కెప్టెన్, కోచ్ ఆలయాన్ని సందర్శించడంపై అలాంటి ప్రశ్నలు లేవనెత్తకూడదని, అది వారి నమ్మకమని భారత మాజీ స్పిన్ బౌలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ అన్నారు.
"వారి మాటలను వినకండి. క్రీడలు, రాజకీయాలను వేరుగా చూడాలి. మీకు ఏ విశ్వాసం ఉంటే అది చేయండి. గుడికి వెళ్ళండి. గురుద్వారాకు వెళ్ళండి. లేదా ఎక్కడికైనా వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్లడం అనేది మీ కోరిక. వ్యక్తిగత ఇష్టం" హర్భజన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కీర్తి ఆజాద్ ఎవరు?
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో వివరాల ప్రకారం కీర్తి ఆజాద్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, ఆఫ్-బ్రేక్ బౌలర్. కీర్తి ఆజాద్ భారత్ తరఫున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 135 పరుగులు చేశారు.
ఆజాద్ 1981లో వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేశారు.
డిసెంబరు 6, 1980న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా తరపున తన తొలి మ్యాచ్ ఆడారు.
భారత్ తరఫున 25 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించి 269 పరుగులు చేశారు. వన్డేల్లో కీర్తి ఆజాద్ అత్యధిక స్కోర్ 39.
కీర్తి ఆజాద్ అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా విజయం సాధించలేదు. కానీ 1980ల నుంచి 1990ల మధ్యకాలం వరకు దిల్లీ క్రికెట్‌కు మూలస్తంభంగా నిలిచారు.
ఆయన నాయకత్వంలోనే దిల్లీ జట్టు 16 సంవత్సరాల విరామం తర్వాత 1991-92లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది.
దిల్లీ రంజీ ఛాంపియన్‌గా నిలిచిన ఐదు సందర్భాలలోనూ ఆడిన ఏకైక ఆటగాడు కూడా కీర్తిఆజాద్.
కీర్తి ఆజాద్ 2002, 2006 మధ్య నార్తర్న్ జోన్ నుంచి జాతీయ సెలెక్టర్‌గానూ పనిచేశారు.
ఎంఎస్ ధోని, పార్థివ్ పటేల్, ఎల్ బాలాజీ, ఆకాశ్ చోప్రా, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ వంటి క్రికెటర్లు అరంగేట్రం చేసిన సమయం అది.
కీర్తి ఆజాద్ గతంలో ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ టోర్నమెంట్ మ్యాచ్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహిస్తుందని ఆయన ఆరోపించారు. ఐపీఎల్ చుట్టూ వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో బీసీసీఐతో తనకున్న అనుబంధంపై తాను కోపంగా, సిగ్గుగా ఉన్నానని కూడా ఆయన అన్నారు.
క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కీర్తి ఆజాద్ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
రాజకీయనాయకుడిగా...
కీర్తి ఆజాద్ తొలుత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నప్పటికీ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు.
బీజేపీలో చేరి 1993లో దిల్లీలోని గోల్ మార్కెట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
అనంతరం 1999, 2009, 2014 ఎన్నికలలో బిహార్‌లోని దర్భాంగ నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
2015లో బీజేపీ నుంచి సస్పెండై కాంగ్రెస్‌లో చేరిన ఆయన 2019 ఎన్నికలలో దర్భాంగలో ఓటమి పాలయ్యారు.
కీర్తి ఆజాద్ 2021లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2024 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











