ఇరాన్ యుద్ధం మీ వంటింటి వరకు వచ్చేసిందా? వంట గ్యాస్ సమస్యేంటి?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తోంది.
నాలుగేళ్ల తర్వాత ముడి చమురు ధర తొలిసారి వంద డాలర్లు దాటింది.
ప్రపంచంలో 20శాతం ముడి చమురు హార్ముజ్ జలసంధి ద్వారా వెళుతుంది. ఈ మార్గంపై ఇరాన్ ఆంక్షలు విధించింది.
ఖతార్‌లో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్‌జీ) ఉత్పత్తి ఆగిపోయింది.
దీని ప్రభావం భారత్‌పైనా, ప్రపంచ దేశాలపైన ఏ స్థాయిలో ఉంది?


ఫొటో సోర్స్, Reuters
హార్ముజ్ జలసంధి ఎందుకు ముఖ్యమైనది?
ఇరాన్ సమీపంలో ఉన్న ఈ జలమార్గం ద్వారా నిరుడు రోజూ సగటున
2 కోట్ల బ్యారళ్లకు పైగా ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఇంధన రవాణా జరిగింది.
ఇరాన్ మాత్రమే కాదు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ కూడా తమ ముడి చమురులో ఎక్కువ భాగాన్ని హార్ముజ్ జలసంధి మీదుగానే రవాణా చేస్తాయి.
ఈ సరఫరాలో ఎక్కువ భాగం ఆసియా దేశాలకు వస్తుంది.
హార్ముజ్ జలసంధి మీదుగా రవాణా అవుతున్న 84 శాతం ముడి చమురు, 83శాతం ఎల్ఎన్‌జీ ఆసియ మార్కెట్లకు సరఫరా అవుతున్నట్లు అమెరికన్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ 2014లో విడుదల చేసిన డేటా చెబుతోంది.
ఈ చమురు, సహజవాయువులో ఎక్కువ భాగం చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాకు వస్తోంది.
ద్రవరూపంలో ఉన్న లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ను తిరిగి వాయు రూపంలోకి మార్చి సీఎన్‌జీ ఉత్పత్తి చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖతార్ ఎల్ఎన్‌జీ ఉత్పత్తి ఎందుకు నిలిపివేసింది?
ఖతార్‌లోని రాస్ లఫాన్ ప్రాంతంలో ఉన్న ఖతార్ ఎనర్జీ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ మీద ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయని ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
ఈ దాడిలో ప్రాణ నష్టమేమీ లేకున్నా ముందు జాగ్రత్త చర్యగా ఈ కంపెనీ ఎల్ఎన్‌జీతో పాటు ఇతర ఇంధన వనరుల ఉత్పత్తిని నిలిపివేసింది
ప్రపంచంలోని అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఉత్పత్తిదారుల్లో ఖతార్ ఎనర్జీ ఒకటి.
2022 వరకు రష్యా అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఎగుమతిదారుగా ఉండేది. అయితే యుక్రెయిన్ యుద్ధం తర్వాత ఆంక్షల కారణంగా రష్యా ఉత్పత్తి తగ్గింది.
ప్రస్తుతం అమెరికా అతి పెద్ద ఎల్ఎన్‌జీ ఉత్పత్తిదారు. ఆస్ట్రేలియా, ఖతార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
చైనా సహజవాయువును అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది.
ప్రపంచంలో చైనా సహజవాయువును అత్యధికంగా దిగుమతి చేసుకుంటోంది. అది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటోందని అమెరికన్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ డేటా చెబుతోంది.
ప్రపంచ ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో ఖతార్ వాటా శాతం. ఇందులో ఎక్కువ భాగం భారత్ , బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కు ఎగుమతి అవుతుంది.
ఖతార్ ఎనర్జీ కంపెనీ మొత్తం అమ్మకాలలో 82 శాతం ఆసియా దేశాలకు వెళుతున్నాయని అల్ జజీరా వార్తా సంస్థ చెబుతోంది.
ఎల్ఎన్‌జీ దిగుమతుల్లో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. భారత్ ఎల్ఎన్‌జీ దిగుమతుల్లో మూడింట రెండొంతులు ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ నుంచి వస్తున్నట్లు కెప్లర్ డేటా వెల్లడించింది.
2024లో భారత్ ఎల్‌ఎన్‌జీ దిగుమతులు అత్యధికంగా ఖతార్ నుంచి జరిగాయి. అమెరికా, యూఏఈ, అంగోలా, ఒమన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ ప్రభావం భారత్‌పై ఎలా ఉంది?
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే, భారత్‌పై ప్రభావం పడుతుంది.
రూపాయి విలువ క్షీణిస్తోంది. దీంతో భారత్ దిగుమతులకు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. చమురు సరఫరా తగ్గితే రిటైల్ మార్కెట్లలో కొరత ఏర్పడవచ్చు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే నిత్యవసరాల ధరల పెరుగుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరిగి మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది.
భారత్‌లో 74 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి 2025 ఫిబ్రవరిలో పార్లమెంట్‌లో చెప్పారు.
మధ్యప్రాచ్యానికి సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తున్నామని ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ, ఇతర పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతను పరిశీలిస్తున్నట్లు భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ మార్చి 2న తెలిపింది.
"భారతదేశంలో అత్యవసర పరిస్థితుల కోసం పెట్రోలియం నిల్వలు ఉన్నాయి. రిఫైనరీలు, చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద కూడా అదనపు నిల్వలు ఉన్నాయి" అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ముడి చమురు విషయంలో ఆప్షన్లు ఉన్నాయా?
భారత్ తన ముడి చమురు దిగుమతుల విషయంలో కొన్నేళ్లుగా వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. రష్యా- యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసింది.
అయితే ఇటీవల రష్యా నుంచి దిగుమతుల్ని తగ్గించి, మిడిల్ ఈస్ట్ నుంచి కొనుగోళ్లను పెంచింది.
2026 జనవరిలో భారత్ ముడి చమురు దిగుమతుల్లో 55శాతం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చాయి.
అమెరికా, కెనడా, పశ్చిమ ఆఫ్రికా నుంచి కూడా భారత్ కొనుగోళ్లను పెంచింది.
రష్యా నుంచి దిగుమతులను మళ్ళీ పెంచడం ఒక ఆప్షన్. మిడిల్ ఈస్ట్ నుంచి సరఫరాకు అంతరాయం ఏర్పడితే, రష్యా తన ముడి చమురును భారత్‌కు మళ్లించేందుకు సిద్ధంగా ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులెందుకు?
యుద్ధం కారణంగా సోమవారం ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు23 డాలర్లు పెరిగి 103 డాలర్లకు చేరుకున్నాయి.
చమురు ధరల పెరుగుదలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ "చమురు ధరలలో స్వల్పకాలిక పెరుగుదల ప్రపంచ శాంతి కోసం చెల్లించాల్సిన చిన్న ధర" అని అన్నారు.
అయితే చముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లు దాటవచ్చని ట్రేడింగ్ డాట్ కామ్ సీఈవో పీటర్ మెక్‌గైర్ హెచ్చరించారు.
ముడి చమురు ధరలు 30 శాతం, బ్రెంట్ క్రూడ్ 26 శాతం, హీటింగ్ ఆయిల్ 22 శాతం, పెట్రోల్ 14 శాతం పెరిగాయని చమురు ధరలను ట్రాక్ చేసే స్పెక్టేటర్ ఇండెక్స్ విడుదల చేసిన డేటా చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ చమురు నిల్వలు ఎంత?
భారతదేశ చమురు నిల్వలపై ఇంధన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"హార్ముజ్ జలసంధి మీదుగా గతంలో రోజుకు 137 నౌకలు ప్రయాణించేవి. కొన్ని రోజులుగా కేవలం 2 ఆయిల్ ట్యాంకర్లు మాత్రమే ప్రయాణిస్తున్నాయి" అని ఇంధన రంగ నిపుణుడు నరేంద్ర తనేజా బీబీసీతో చెప్పారు.
భారత్, చైనా, జపాన్, దక్షిణాసియా దేశాలు ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురుపై ఆధారపడటం వల్ల సమస్య తీవ్రత పెరిగిందని ఆయన అన్నారు. ఏడాది కాలంగా చైనా రోజూ ఇరాన్ నుంచి సుమారు 10 లక్షల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేసి నిల్వ చేస్తోందని ఆయన వివరించారు.
"గత 365 రోజుల్లో చైనా ఆదా చేసిన ముడి చమురు వారికి రాబోయే 5నెలల వరకు సరిపోతుంది" అని తనేజా చెప్పారు.
‘భారత్ 41 దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం భారత్ వద్ద భూగర్భంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలు 25 రోజులకు సరిపోతాయి’ అని నరేంద్ర తనేజా చెప్పారు.
"నిల్వ ట్యాంకులు, శుద్ధి కర్మాగారాలు, వాణిజ్య నిల్వలు కలిపితే, భారత్‌లో దాదాపు 50 రోజులకు సరిపడా చమురు ఉంది. అయితే అన్ని ట్యాంకులను పూర్తిగా ఖాళీ చేయడం సాధ్యం కాదు. అందుకే మనం దీన్ని 40 రోజులుగా లెక్కించాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గ్యాస్ మాటేమిటి?
భారత్‌లో ఇళ్లలో వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల ధరను గత రూ.60 పెంచింది ప్రభుత్వం. వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్లపై రూ.155 పెరిగింది.
ప్రస్తుత వాతావరణంలో చమురు ధరల పెరుగుదల అనివార్యమని విదేశాంగ విధాన నిపుణుడు హర్ష్ వి. పంత్ బీబీసీతో చెప్పారు.
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు కూడా ఇబ్బందులు తప్పవని, బలహీన ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.
"భారత్ కొంత కాలంగా రష్యా నుంచి ఎక్కువ చమురు కొనుగోలు చేసింది. ప్రపంచ చమురు మార్కెట్‌కు మిడిల్ ఈస్ట్ కేంద్రంగా ఉంది. అందుకే అక్కడ ఏం జరిగినా ప్రపంచం మీద ప్రభావం పడుతుంది" అని పంత్ చెప్పారు.
వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ సిలిండర్ల సరఫరాను నియంత్రించడాన్ని వ్యతిరేకిస్తూ బెంగళూరులోని రెస్టారెంట్లు ఒక రోజు బంద్ పాటించాయి. తమిళనాడులో వంట గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగితే, రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ళు మూసివేస్తామని తమిళనాడు హోటల్ యజమానుల సంఘం తెలిపింది.
ప్రభుత్వం ఏం చేస్తోంది?
వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ కొరత వల్ల దేశంలోని వివిధ నగరాల్లో కొన్ని హోటళ్లు మూసివేయడంతో సిలిండర్ల సరఫరాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టాన్ని అమలులోకి తెచ్చింది.
బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం, అమ్మకాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంది.
ఇళ్లకు వంట గ్యాస్ సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని, వంట గ్యాస్ సిలిండర్లను బుక్ చేసేందుకు గడువు 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు పెట్రోలియం శాఖ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












