మిషన్ E20: ఏమిటీ ఇథనాల్ పెట్రోల్, ఇది వాహనాల మైలేజీని తగ్గిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యాన్ని సాధించామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మిషన్ ఈ 20 అని పేరు పెట్టారు. 2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్‌ను ప్రారంభించారు.
దేశంలో విక్రయించే పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను కలిపే లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.
దీనిపై, పెట్రోల్ వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇంజిన్‌పై చెడు ప్రభావాన్ని చూపుతుందని, వాహనాలలో సమస్యలను కలిగిస్తోందని సోషల్ మీడియాలో వాదనలు వస్తున్నాయి. మైలేజ్ కూడా తగ్గుతోందని ఆరోపిస్తున్నారు.
కానీ 20 శాతం ఇథనాల్ కలిసిన పెట్రోల్ ఇంజిన్‌లను దెబ్బతీస్తుందనే వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చింది.


ఫొటో సోర్స్, Getty Images
ముందే పూర్తయిన లక్ష్యం
భారత ప్రభుత్వం 2014 నుంచి పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం ప్రారంభించింది. ఆ సమయంలో ఇథనాల్ కలిపే రేటు కేవలం 1.5 శాతం మాత్రమే.
పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని జూన్ 2022 నాటికే ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే, 2030 నాటికి 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని ఐదేళ్ల ముందుగానే సాధించినట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ20 ఇంధన పథకం కింద, ఒక లీటరు ఇంధనంలో 800 ఎంఎల్ పెట్రోల్, 200 ఎంఎల్ ఇథనాల్ కలుపుతామని కేంద్రం చెబుతోంది. దీనివల్ల దేశం ముడి చమురుపై ఆధారపడటం తగ్గుతుంది. కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి, చెరకు రైతుల ఆదాయం పెరుగుతుంది.
కానీ ఇథనాల్ మిశ్రమ ఇంధనంపై సామాన్యజనంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి
ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాహనానికి మంచిదేనా?
ఇది మైలేజీని ప్రభావితం చేస్తుందా?
ఇంతకీ, వాహనానికి ఉత్తమమైన పెట్రోల్ ఏది?
ఏమిటీ ఇథనాల్, ఈ10, ఈ20?
ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న నుంచి తయారయ్యే ఒక రకమైన ఆల్కహాల్.
దీనిని పెట్రోల్‌తో కలిపి ఇంధనంగా ఉపయోగిస్తారు.
ఈ ఇథనాల్ మిశ్రమ ఇంధనం రెండు రకాలుగా వస్తుంది: ఈ10, ఈ20.
ఈ10 అంటే 90 శాతం పెట్రోల్, 10 శాతం ఇథనాల్.
ఈ20 అంటే 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్.

ఫొటో సోర్స్, Getty Images
మైలేజీపై సందేహమెందుకు?
భారత ప్రభుత్వం 2023లో BS6-II అనే వాహన ఉద్గార ప్రమాణ వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని కింద, వాహన తయారీ కంపెనీలు ఇంజిన్లు, దాని సంబంధిత భాగాలను ఈ20 ఇంధనానికి అనుకూలంగా తయారు చేయడం తప్పనిసరి.
కానీ, గతంలో తయారైన చాలా వాహనాలు నాన్-ఇథనాల్ పెట్రోల్ లేదా E10 పెట్రోల్ కోసం మాత్రమే రూపొందాయి. దీంతో, 2023కి ముందు కారు కొనుగోలు చేసిన వారిలో మరిన్ని సందేహాలు నెలకొన్నాయి.
"పెట్రోల్ ఆధారిత ఇంజిన్ వ్యవస్థలు, దాని భాగాలు ఎక్కువ ఇథనాల్ కలిసిన ఇంధనంతో బాగా పనిచేయవు. అందువల్ల, పాత వాహనాల పెట్రోల్ ట్యాంకులు, గాస్కెట్లు, ఇంధన పైపులు వంటి భాగాలను ఇథనాల్‌తో పనిచేసే వాటికి మార్చాల్సి ఉంటుంది" అని పుదుచ్చేరి విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసిన, ద్విచక్ర వాహన నిపుణుడైన డాక్టర్ కుమరన్ తెలిపారు.
ఇథనాల్ కలిపిన ఇంధనం వల్ల వాహనాల మైలేజ్‌పై ప్రభావం ఉంటుందా?
దీనిపై ఇంధన నిపుణుడు నరేంద్ర తనేజా స్పందిస్తూ "పెట్రోల్ కంటే ఇథనాల్‌కు తక్కువ శక్తి ఉంటుంది, కాబట్టి ఈ20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల వాహనం మైలేజ్ తగ్గవచ్చు. అయితే, ఇంజిన్‌లోని కొన్ని భాగాలను మార్చడం, సరైన ట్యూనింగ్ ద్వారా మైలేజ్ మెరుగుపరచవచ్చు" అని తెలిపారు.
అయితే, ఈ20 ఇంధనం బయో ఇంధనమని, కాబట్టి ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తుందని తనేజా కూడా అభిప్రాయపడ్డారు. అందుకే చాలా దేశాలలో దీనిని ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలో ఇథనాల్‌ను పెట్రోల్‌లో మాత్రమే కలుపుతున్నారని చెప్పారు. పెద్ద SUVల వంటి చాలా వాహనాలు డీజిల్‌తో నడుస్తాయని, అలాంటివాటిని మార్చడానికి ఏమీ ఉండదు. ఇతర దేశాలలో డీజిల్‌లో కూడా ఇథనాల్ కలుపుతున్నారని తనేజా అన్నారు.
ప్రభుత్వం ఏమంటోంది?
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో దీనికి సంబంధించిన ఓ సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. ఈ20 ఇంధనం వాహనాలపై ఎటువంటి చెడు ప్రభావం చూపడం లేదని ఆ పోస్టులో కేంద్రం పేర్కొంది. అయితే సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ తక్కువ శక్తి సాంద్రత కారణంగా మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ20 కోసం రూపొందించిన నాలుగు చక్రాల వాహనాలకు ఒకటి నుంచి రెండు శాతం మైలేజ్ తగ్గుతుందని, ఇతర వాహనాలకు ఇది దాదాపు మూడు నుంచి ఆరు శాతం ఉంటుందని తెలిపింది.
అయితే, మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్, ఈ20 కంప్లైంట్ ఎలిమెంట్స్ ద్వారా ఈ స్వల్ప తగ్గుదల లేకుండా చేయవచ్చని సూచించింది.
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఏ పెట్రోల్ ఉత్తమం?
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మన వాహనాలకు ఏది ఉత్తమ పెట్రోల్?
సాధారణంగా పెట్రోల్ ఎంత స్వచ్ఛంగా ఉంటే, అది వాహనానికి అంత ఎక్కువ శక్తిని ఇస్తుందని, ఎక్కువ మైలేజీని కూడా ఇస్తుందని నరేంద్ర తనేజా అన్నారు.
సాధారణ, ప్రీమియం కేటగిరీ ఇంధనాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు .
ప్రీమియం కేటగిరీ పెట్రోల్‌లో ఎక్కువ శక్తి ఉంటుంది కానీ, ఖరీదు కూడా ఎక్కువే అని తనేజా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














