విటమిన్ డీ కావాలంటే ఏ టైంలో ఎండలో నిలబడాలి, ఎంతసేపు ఉండాలి...

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఎ. నందకుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వాసుకి తరచుగా కండరాల నొప్పి, అలసటతో బాధపడేవారు. ‘‘పని ఒత్తిడి లేదా నిద్ర లేకపోవడం వల్ల కావచ్చని అనుకున్నా’’ అని ఆమె చెప్పారు.
కొన్ని నెలలపాటు ఆ నొప్పిని భరించి, ఇక తట్టుకోలేక డాక్టర్ దగ్గరకు వెళ్లారు. అప్పుడే ఆమెకు ఆశ్చర్యం కలిగించే విషయం తెలిసింది.
రక్త పరీక్షలో ఆమెకు విటమిన్ డీ చాలా తక్కువ స్థాయిలో ఉందని తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన సౌత్-ఈస్ట్ ఏషియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో 'ప్రివలెన్స్ అండ్ కోరిలేట్ ఆఫ్ విటమిన్ డీ డెఫిషియెన్సీ అమాంగ్ అడల్ట్ పాపులేషన్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఆఫ్ దిల్లీ, ఇండియా’’ అనే శీర్షికతో ఒక పరిశోధనా వ్యాసం ప్రచురితమైంది.
దీని ప్రకారం చూస్తే నగరాల్లో నివసించేవారిలో 70శాతం మందికి తీవ్రమైన విటమిన్ డీ లోపం ఉందని, గ్రామాల్లో నివసించేవారిలో దాదాపు 20శాతం మందికి ఈ సమస్య ఉందని తెలుస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
ఈ అధ్యయనంలో దిల్లీ పరిసర ప్రాంతాల (నేషనల్ క్యాపిటల్ రీజియన్ ) లోని పట్టణాలు, గ్రామాల్లో నివసించేవారు పాల్గొన్నారు.
రక్తంలో విటమిన్ డీ స్థాయి10 నానోగ్రాముల కంటే తక్కువ ఉంటే తీవ్రమైన లోపంగా పరిగణిస్తారు. గ్రామాల్లో కూడా ఈ సమస్య కనిపించింది. కానీ, తీవ్రమైన విటమిన్ డీ లోపం కాస్త తక్కువగా ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, పురుషుల కంటే మహిళలే ఎక్కువగా విటమిన్ డీ లోపంతో బాధపడే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
అధ్యయనంలో ఏం తేలింది?
చెన్నైకి చెందిన గర్భిణీ స్త్రీలపై నిర్వహించిన మరో అధ్యయనంలో 62శాతం మంది మహిళలకు విటమిన్ డీ లోపం ఉందని తేలింది.
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ‘‘ప్రివలెన్స్ ఆఫ్ విటమిన్ డీ డెఫిషియెన్సీ ఇన్ అర్బన్ సౌత్ ఇండియన్స్ విత్ డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ గ్లూకోస్ టోలరెన్స్’’ అనే పేరుతో ప్రచురించిన అధ్యయనంలో చెన్నైకి చెందిన అనేక మంది పాల్గొన్నారు.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 66శాతం మంది విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారని తేలింది.
ప్రీడయాబెటిస్ లేదా టైప్ 2 డయాబెటిస్ ఉన్నా లేకపోయినా, ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉందని తేలింది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో విటమిన్ డీ స్థాయిలు తక్కువగా ఉన్నాయని వెల్లడైంది.
పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, తిరుపతి, పుణె, అమరావతి వంటి ప్రాంతాలలో నిర్వహించిన అధ్యయనాలు కూడా గ్రామాల్లో నివసించేవారికంటే, నగరాల్లో నివసించేవారిలోనే విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉన్నట్టు తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
కారణం ఏమిటి?
విటమిన్ డీ సహజంగా సూర్యకాంతి నుంచి లభిస్తుంది. ఉత్తర భారత రాష్ట్రాలకు కొన్ని నెలలు మినహా మిగతా సమయంలో సూర్యకాంతి అందుతుంది. చెన్నై వంటి ఉష్ణమండల పట్టణ ప్రాంతాలకు ఏడాది పొడవునా సూర్యకాంతి లభిస్తుంది.
అయినప్పటికీ దక్షిణాదిలోని పట్టణ ప్రజలు విటమిన్ డీ లోపంతో ఎందుకు ఎక్కువగా బాధపడుతున్నారు?
విటమిన్ డీ మానవ శరీరానికి సూర్యకాంతి, ఆహారం ద్వారా లభిస్తుందని చెన్నైకి చెందిన చర్మవ్యాధి నిపుణులు దక్షిణామూర్తి చెప్పారు.
"శరీరానికి అవసరమైన విటమిన్ డీ లో ఎక్కువ భాగం సూర్యకాంతి నుంచి వస్తుంది. మానవ చర్మం పైపొర సహజంగా 7-డీహైడ్రోకోలెస్ట్రాల్ అనే అణువును ఉత్పత్తి చేస్తుంది. సూర్యకాంతి నుంచి వచ్చే అతినీలలోహిత కాంతి చర్మాన్ని తాకినప్పుడు, ఆ అణువు విటమిన్ డీ3గా మారుతుంది. కాలేయం, మూత్రపిండాలు దానిని విటమిన్ డీగా మార్చి శరీరానికి పంపుతాయి" అని ఆయన చెప్పారు.
"ఆధునికీకరణ, మారుతున్న పని విధానం కారణంగా, ఇళ్లలో, ఆఫీసుల్లో గడిపే సమయం పెరిగింది. బయటకు వెళ్ళేటప్పుడు కూడా, శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పే అలవాటు పెరుగుతోంది. దీంతో శరీరానికి సూర్యరశ్మి తగలడం లేదు" అని పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసిన జనరల్ ప్రాక్టీషనర్ పీటర్ చెప్పారు.
కొన్ని నిమిషాలు బయట ఉంటే చాలు తగినంత సూర్యకాంతి పడుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కాలుష్యం, దుస్తులు, గాజు కిటికీలు మీ శరీరానికి సూర్యకాంతి నుంచి తగినంత విటమిన్ డీ లభించకుండా అడ్డుకుంటాయని పీటర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎంత సూర్యరశ్మి అవసరం?
ఒక భారతీయ పురుషుడు రోజుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం ఎండలో గడపాలి. ఆ వ్యక్తి ముఖం, చేతులు, ముంజేతులకు ఎండ తగలాలి. దీని వలన రోజువారీ కావాల్సిన 30 నానోగ్రాముల విటమిన్ డీ లభిస్తుంది. కనీసం 20 నానోగ్రాముల విటమిన్ డీ పొందడానికి రోజుకు గంటపాటు ఎండలో నడవాలని మరో అధ్యయనం సూచిస్తుంది.
ఈ అధ్యయనంలో ఒక లోపం ఏమిటంటే, ఇందులో మహిళలను పరీక్షించలేదు.
అద్దాల కిటికీ పక్కన కూర్చుంటే రోజుకు సరిపడా విటమిన్ డీ శరీరానికి అందదని, ఎండలోకి రావాలని వైద్యులు అంటున్నారు.
"విటమిన్ డీ ఏర్పడటానికి సహాయపడేది సూర్యకాంతిలోని యువీబీ కిరణాలు. ఈ కిరణాలు సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బాగా అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదయం, సాయంత్రం సూర్యకాంతిలో యూవీఏ కిరణాలు ఉంటాయి. ఇది విటమిన్ డీ ఏర్పడటానికి పెద్దగా ఉపయోగపడవు. తెల్లవారుజామున సూర్యుడు ప్రకాశవంతంగా కనిపించినా, మీరు ఎండలో నిలబడితే పెద్దగా ప్రయోజనం ఉండదు" అని డాక్టర్ దక్షిణామూర్తి చెప్పారు.
దీనికి శాస్త్రీయ కారణం ఏమిటంటే, సూర్యుడు ఆకాశంలో తక్కువగా కనిపించే సమయంలో భూమి వాతావరణం యూవీబీ కిరణాలను అడ్డుకుంటుంది. అంటే ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యుడు చాలా తక్కువ కోణంలో (45 డీగ్రీల కంటే తక్కువ) ఉంటాడు. యూవీబీ కిరణాలు ఎక్కువగా భూమిని చేరలేవు.
ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సూర్యకాంతి నుంచి మంచి విటమిన్ డీ పొందవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, అధిక సూర్యరశ్మి వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయని డాక్టర్ దక్షిణామూర్తి హెచ్చరిస్తున్నారు.
"ఆ సమయంలో ఎండ ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఎక్కువసేపు ఎండలో ఉండకూడదు. తక్కువ (ఎస్పీఎఫ్ ఉన్న) సన్‌స్క్రీన్, టోపీ, కూల్ గ్లాసెస్, తేలికపాటి దుస్తులు వేసుకోవడం ముఖ్యం" అని ఆయన చెప్పారు.
అదే సమయంలో ఎండ తీవ్రతను తగ్గించడానికి మీ చేతులు, కాళ్ళు, ముఖాన్ని 5 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో ఉండేలా చూసుకుంటే సరిపోతుందని యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిఫార్సు చేసింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య (యునైటెడ్ స్టేట్స్‌లో) శరీరంలో 10శాతం భాగానికైనా ఎండ తగలాలని హార్వర్డ్ మెడికల్ స్కూల్ వెబ్‌సైట్ కథనం ఒకటి సూచించింది.
విటమిన్ డీ లోపం లక్షణాలు
అలసట, కీళ్ల నొప్పులు, కాళ్ళలో వాపు, ఎక్కువసేపు నిలబడటానికి ఇబ్బంది, కండరాల బలహీనత, నిరాశకు గురికావడం వంటివి విటమిన్ డీ లోపం లక్షణాలు.
"భారతీయులు తమ బిజీ జీవితాల కారణంగా దీనిని సీరియస్‌గా తీసుకోరు. విటమిన్ డీ లోపం వల్ల శరీరంలోని అన్ని భాగాలు క్రమంగా బలహీనపడతాయి. దీని కారణంగా వృద్ధాప్యంలో ఎముకలు, కండరాలు, కీళ్లలో ఎక్కువ నొప్పి వస్తుంది" అని డాక్టర్ పీటర్ చెప్పారు.
విటమిన్ డీ లోపం వల్ల చిన్న వయసులోనే డిమెన్షియాకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనం సూచిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారం ఏంటి?
వాసుకి వంటి చాలామంది నగరవాసులు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య కనీసం 1 గంట పాటు నడవడం అసాధ్యమైన విషయమే.
"ఆహారం ద్వారా విటమిన్ డీ లోపాన్ని అధిగమించడం కొంచెం కష్టమే. అయితే మాంసం, గుడ్లు, చేపలు, పాలు, కాలేయం వంటి విటమిన్ డీ ఉన్నఆహార పదార్థాలు కొంత మేరకు సహాయపడతాయి" అంటున్నారు డాక్టర్ పీటర్.
విటమిన్ డీ లోపాన్ని నివారించేందుకు కొన్ని సప్లిమెంట్లు కూడా ఉపయోగపడతాయని డాక్టర్ చెప్పారు.
"ఎన్నిసప్లిమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. తేలికైన, చవకైన, ఉత్తమమైన ఔషధం ఏంటంటే మీకు సమయం ఉన్నప్పుడు ఎండలో నిలబడడమే" అని వాసుకి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














