యూపీఐ నిబంధనల్లో కీలక మార్పులు, ఏమేం మారాయంటే..

ఆటో పే, యూపీఐ, చెల్లింపులు, రూల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని చాలామందికి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దైనందిన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ప్రతి చిన్న, పెద్ద రిటైల్ చెల్లింపునకు యూపీఐని ఉపయోగిస్తున్నారు.

అయితే, 2025 ఆగస్టు 1 నుంచి యూపీఐకి సంబంధించిన కొన్ని నిబంధనలు మారాయని తెలుసా?

భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ఈ మార్పులు తీసుకొచ్చింది. యూపీఐ పనితీరును మెరుగుపరిచే ఉద్దేశంతో చేస్తున్న ఈ మార్పులతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ సేవల వినియోగదారులపై ప్రభావం పడనుంది.

ఎన్‌పీసీఐ 2016లో యూపీఐ ప్రారంభించినప్పటి నుంచి దానికి ప్రజాదరణ వేగంగా పెరిగింది. ప్రభుత్వ డేటా ప్రకారం, జూన్ 2025లో దేశంలో యూపీఐ ద్వారా రూ.24.03 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. మొత్తంగా 1,839 కోట్ల లావాదేవీలు జరిగాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆటో పే, యూపీఐ, చెల్లింపులు, రూల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఇంతకీ మార్పులేంటి?

యూపీఐ పనితీరును మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

యూపీఐ యాప్ ద్వారా చేసే బ్యాలెన్స్‌ తనిఖీలో ఇక నుంచి పరిమితి విధించారు. కస్టమర్లు ఇప్పుడు యూపీఐ యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే తమ బ్యాలెన్స్‌ను చెక్ చేయగలరు. అయితే, ఒక్కో యాప్‌లో ఇలా 50 సార్లు తనిఖీ చేసుకోవచ్చు.

అంతేకాదు, యూపీఐ ట్రాన్సాక్షన్ స్టేటస్ తెలుసుకోవడానికీ కొత్త రూల్స్ తీసుకొచ్చారు.

దీని ప్రకారం, వినియోగదారులు ఒరిజినల్ ట్రాన్సాక్షన్ చేసిన 90 సెకన్ల తర్వాత మొదటి స్టేటస్ చెక్ చేసుకోవచ్చని, ఆ తర్వాత స్టేటస్ చెక్ చేయాలంటే 45 లేదా 60 సెకన్ల తర్వాత తెలుసుకోవచ్చని వార్తా సంస్థ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది.

అంతేకాదు, ఇకనుంచి ఏదైనా ట్రాన్సాక్షన్ స్టేటస్ మూడు సార్లు మాత్రమే చూడగలరు.

ఆటోపే నియమాలు

విద్యుత్ బిల్లులు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు లేదా నీటి బిల్లుల కోసం ఉపయోగించే ఆటోపే విధానంలోనూ కొన్ని మార్పులు వచ్చాయి.

వినియోగదారులు ఇకనుంచి యూపీఐ ఆటోపేను రద్దీ లేని (పీక్ అవర్స్‌ కాని) సమయాల్లో మాత్రమే వాడగలరు. సెకనుకు అత్యధిక సంఖ్యలో లావాదేవీలు జరిగే సమయాన్ని పీక్ అవర్స్‌గా నిర్వచించారు. పీక్ అవర్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు పరిగణించారు.

అంతేకాదు, ఇక నుంచి కస్టమర్లు 24 గంటల్లో తమ యూపీఐ యాప్‌లో బ్యాంక్ ఖాతాల వివరాలను 25 సార్లు మాత్రమే చూడగలరు.

బిజీగా ఉండే సమయాల్లో సిస్టమ్ లోడ్‌ను తగ్గించడానికి ఈ నియమం రూపొందించారు.

ఆటో పే, యూపీఐ, చెల్లింపులు, రూల్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్

ఆగస్ట్ 15 నుంచి ఫాస్టాగ్ కోసం వార్షిక పాస్‌లను(యాన్యువల్ పాస్) తీసుకోవచ్చు. రూ. 3,000కి ఏడాది పొడవునా చెల్లుబాటు అయ్యే పాస్‌ లభిస్తుంది.

ఈ పాస్ ఒక సంవత్సరంలోపు గరిష్టంగా 200 టోల్ లావాదేవీలకు వీలు కల్పిస్తుంది.

200 లావాదేవీలు లేదా ఒక సంవత్సరం తర్వాత, ఏది ముందుగా వస్తే దాని తర్వాత పాస్ గడువు ముగుస్తుంది.

ఇది టోల్ చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది. తరచుగా హైవేలపై ప్రయాణించే చాలామందికి ఇది వెసులుబాటు కానుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)