అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం
అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు జీవిత ఖైదు విధించింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.
గత ఏడాది ఆయనపై నాలుగు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగింటిలో మొదటి కేసులో కోర్టు శుక్రవారం(ఆగస్టు 1) ఆయన్ను దోషిగా నిర్ధరించింది.
తన ఫాంహౌస్‌లో పనిచేసిన 48 ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారన్న కేసులో ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా తేల్చింది.
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు అధ్యక్షత వహించిన అదనపు సిటీ సివిల్, సెషన్స్ జడ్జి సంతోష్ గజానన్ భట్ ఈ తీర్పును వెలువరించారు.
ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష విధించే ముందు, న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అని అడిగారు. దీనికి ప్రతిస్పందనగా, ప్రజ్వల్ రేవణ్ణ తనకు కనీస శిక్షను విధించాలని అభ్యర్థించారు.


ఫొటో సోర్స్, X/Prajwal Revanna
ఈ కేసులో, ఆగస్టు 2న ప్రజ్వల్ రేవణ్ణకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది.
ఐపీసీ సెక్షన్లు 376(2)(కె) (తన ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి అత్యాచారం), 376(2) (ఎన్) (పదే పదే అత్యాచారం), 354(ఎ) (శారీరక బల ప్రయోగం), 354(సి)(ఇతరుల వ్యక్తిగత చర్యలను చూడడం), 506 (సాక్షులను బెదిరించడం )వంటి సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(ఇ) కింద రేవణ్ణను దోషిగా నిర్ధరించారు.
ప్రాసిక్యూషన్ 1,632 పేజీల చార్జిషీట్.. 183 పత్రాలను, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానికేతర ఆధారాలను సమర్పించింది. కేసు దాఖలు చేసిన బాధితురాలి కుటుంబం సహా 26 మంది సాక్షులను కోర్టు విచారించింది.
ఈ ఏడాది మే 2న కోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. ప్రతిరోజూ కేసు విచారణ జరిపింది.
ఆగస్టు 1న, న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే ఏడవడం ప్రారంభించారని అక్కడున్న లాయర్లు చెప్పారు.

ఫొటో సోర్స్, ani
పెన్ డ్రైవ్‌తో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల కేసు
హసన్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ ముగిసిన వెంటనే గత ఏడాది ఏప్రిల్ 26న ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారిపోయారు.
ప్రజ్వల్ రేవణ్ణ వచ్చి, చట్టపరంగా ఎదుర్కోవాలని ఆయన తాత హెచ్‌డీ దేవెగౌడ బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఆయన తిరిగి వచ్చారు. జర్మనీ నుంచి తిరిగి వస్తున్న రేవణ్ణను 2024 మే 31న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు.
లైంగిక వేధింపుల వీడియో వైరల్ అయిన వెంటనే దేశం విడిచి వెళ్లడానికి ప్రజ్వల్ రేవణ్ణ తన దౌత్య పాస్‌పోర్ట్ (ఎంపీలకు ఇచ్చేది) ఉపయోగించారు.
లైంగిక వేధింపులకు సంబంధించిన పెన్ డ్రైవ్‌లలోని వీడియోలు హసన్‌లో వైరల్ అయ్యాయి. ఈ పెన్‌డ్రైవ్‌లలో 2,960 క్లిప్‌లు ఉన్నాయి. చాలా క్లిప్‌లలో బాధితులు కనిపిస్తున్నారు.
ఎన్నికల్లో హసన్ నియోజకవర్గం నుంచి ప్రజ్వల్ రేవణ్ణ 40 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కేసు నమోదు చేసిన వ్యక్తిని కేఆర్ నగర్‌లోని ఒక ఫాంహౌస్ నుంచి రక్షించడంలో మహిళా పోలీసు అధికారుల బృందం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది.
బాధితురాలిని సిట్ ముందు హాజరు కానివ్వకుండా ఉండడానికి ప్రజ్వల్ తండ్రి, కర్ణాటక మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ, ఆయన భార్య భవానీ రేవణ్ణ ఆమెను కిడ్నాప్ చేశారని ఆరోపణలొచ్చాయి.
ఈ కిడ్నాప్ కేసు విచారణ కొనసాగుతోంది. తనపై వచ్చిన ఆరోపణలను రాజకీయ కుట్రగా హెచ్‌డీ రేవణ్ణ అభివర్ణించారు. హెచ్‌డీ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు, కానీ ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించింది.

ఫొటో సోర్స్, FB/Prajwal Revanna
చార్జిషీట్‌లో ఏముంది?
నిందితుడు 2021లో బాధితురాలిపై రెండుసార్లు అత్యాచారం చేశారని ప్రజ్వల్ రేవణ్ణపై కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
ఒకసారి హసన్ జిల్లాలోని హోలెనరసిపూర్‌లోని ఫాంహౌస్‌లో, మరోసారి బెంగళూరులోని హెచ్‌డీ రేవణ్ణ నివాసంలో అత్యాచారం జరిపారని చార్జిషీట్‌లో ఉంది.
రెండుసార్లూ నిందితుడు దాన్ని వీడియోలో రికార్డ్ చేశారని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
లైంగిక దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ బాధితురాలు ఏడుస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని చార్జిషీట్ పేర్కొంది. ఏప్రిల్ 28, 2024న బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదులోనూ ఇదే విషయం ఉంది.
వీడియోలో ఉన్నది ప్రజ్వల్ రేవణ్ణ అని ఫోరెన్సిక్ నివేదికలు నిర్ధరించాయి. బాధితురాలు ఆ సమయంలో ధరించిన చీరను తాను పనిచేసే చోట ఉన్న అల్మారాలో భద్రంగా దాచి ఉంచారు. ఆ చీరపై ప్రజ్వల్ రేవణ్ణ వేలిముద్రలు ఉన్నట్టు డీఎన్ఏ విశ్లేషణలో తేలింది.
ప్రజ్వల్ రేవణ్ణపై మొదట 2022 జూన్‌లో ఆరోపణలొచ్చాయి. అయితే, గ్యాగ్ ఆర్డర్ కారణంగా మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేయలేకపోయింది.
ఆయన ఇంట్లో పనిచేసిన బాధితురాలు ఏప్రిల్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత మరో ముగ్గురు కూడా ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














