పని మనుషులపై అఘాయిత్యాలు: వీటిని నిరోధించే చట్టాలు భారత్‌లో ఎందుకు లేవు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్మిత (పేరు మార్చాం) ఒక డొమెస్టిక్ హెల్పర్. 28 ఏళ్లుగా ఆమె దిల్లీలో ఇదే పని చేస్తున్నారు. తను పని చేసే ఇంటి యజమాని ఒకరు పబ్లిక్‌లో తనను కొట్టిన రోజును ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె అన్నారు.
తన కూతురి చెవిపోగులు దొంగిలించిందని ఆరోపించిన సదరు మహిళా యజమాని, స్మితకు జీతం ఇవ్వడానికి కూడా నిరాకరించారు. స్మిత ఒక దళిత మహిళ.
''చాలా బతిమాలిన తర్వాత, పబ్లిక్‌లో ఆమెను నిలదీశాను. అప్పుడు ఆమె నన్ను తిట్టడమే కాకుండా కొట్టారు. కొట్టొద్దంటూ నేను ఆమె చేతులు పట్టుకున్నాను. సెక్యూరిటీ గార్డులు వచ్చి నన్ను ఆ హౌసింగ్ సొసైటీ నుంచి లాక్కెళ్లి, గేట్లకు తాళాలు వేశారు'' అని స్మిత వివరించారు.

తర్వాత, స్మిత తరఫున మరో కుటుంబం జోక్యం చేసుకోవడంతో చివరకు ఆమెకు రావాల్సిన నెలజీతం అందింది. ఇంట్లో ఊడ్చటం, తడిగుడ్డతో తుడవటం, గిన్నెలు కడగడం వంటి పనులకు నెల జీతంగా వెయ్యి రూపాయలు ఆమె అందుకున్నారు. కానీ, ఆమెను ఇకపై ఆ హౌజింగ్ సొసైటీలోకి రాకుండా నిషేధించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఎలాంటి లాభం ఉండదనే ఉద్దేశంతో ఆమె వెళ్లలేదు.
భారత్‌లో పనిచేసే చోట లైంగిక వేధింపులు, అవమానాలు, తిట్లు ఎదుర్కొన్నట్లు పేర్కొన్న వేల మంది డొమెస్టిక్ వర్కర్లలో స్మిత కూడా ఒకరు. ఇలాంటి వేధింపులకు గురైనవారిలో ఎక్కువమంది మహిళలే. ఈ మహిళల్లో చాలామంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వచ్చినవారు, వాడుకలో తక్కువ కులాలుగా పేరున్న వాటికి చెందినవారు.
డొమెస్టిక్ హెల్పర్లు దోపిడీకి గురవుతున్నారంటూ గత నెలలో సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వేధింపుల నుంచి వారిని రక్షించడానికి ఒక చట్టాన్ని రూపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఫొటో సోర్స్, Getty Images
డొమెస్టిక్ వర్కర్ల కోసం ఇలా ఒక చట్టపరమైన చర్య తీసుకోవడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. వివిధ రకాల గ్రూపులు, కేంద్ర మంత్రులు ఏళ్ల పాటు వాదనలు వినిపించినప్పటికీ, ఇలాంటి ఒక చట్టం కోసం ముందడుగు పడలేదు.
డొమెస్టిక్ వర్కర్లను రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో, వారు పనిచేసే ప్రాంతంలో పరిస్థితులను మెరుగుపరచాలనే లక్ష్యంతో 2008, 2016లలో వేర్వేరు బిల్లులను ప్రతిపాదించారు. వాటిని ఇప్పటికి కూడా ఆమోదించలేదు. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాల పరిధిలోకి డొమెస్టిక్ వర్కర్లను కూడా తీసుకురావాలనే లక్ష్యంతో 2019లో తయారు చేసిన ఒక జాతీయ విధానం ఇప్పటికీ అమల్లోకి రాలేదు.
సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్స్ అసోసియేషన్ (సేవా)కు చెందిన సోనియా జార్జ్, ఈ ముసాయిదా విధానాన్ని రూపొందించిన టాస్క్‌ఫోర్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు డొమెస్టిక్ వర్కర్ల కోసం రూపొందించిన అత్యంత సమగ్ర విధానాల్లో ఇదొకటని, కానీ, దీన్ని అమలు చేయడంలో వరుసగా ప్రభుత్వాలు విఫలమవుతూ వస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు.
ఫలితంగా, భారత్‌లో విస్తృతంగా ఉన్న డొమెస్టిక్ హెల్పర్లు, తమకు జీతం, సెలవులు, సరైన గౌరవం వంటి ప్రాథమిక అవసరాల కోసం యజమానులపైనే ఆధారపడాల్సి వస్తోంది.
భారత్‌లోని సుమారు 47.5 లక్షలమంది డొమెస్టిక్ వర్కర్లలో 30 లక్షల మంది మహిళలేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కానీ, వీరి అసలు సంఖ్య 2 కోట్ల నుంచి 8 కోట్ల మధ్య ఉంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది.
ప్రైవేట్ ఇళ్లను ఒక పనిచేసే ప్రదేశంగా లేదా ఒక సంస్థగా పరిగణించరు. ఫలితంగా డొమెస్టిక్ వర్క్ అనేది కనీస వేతనాలు, మెరుగైన పరిస్థితుల్లో పని చేసే హక్కు, సోషల్ సెక్యూరిటీ పథకాలకు అనుమతులు వంటి సామాజిక రక్షణలకు అవతల ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్, బిహార్, కర్ణాటక, కేరళ, మేఘాలయ, రాజస్థాన్, తమిళనాడు వంటి కనీసం 14 రాష్ట్రాలు, డొమెస్టిక్ వర్కర్లకు కనీస వేతనాలను తప్పనిసరి చేశాయి. లైంగిక హింస వ్యతిరేక చట్టం, బాల కార్మిక చట్టం వంటి కొన్ని కేంద్ర చట్టాల పరిధిలోకి డొమెస్టిక్ వర్కర్లను కూడా తీసుకొచ్చాయి.
కానీ, ఈ చట్టాల ద్వారా లబ్ధి పొందవచ్చనే అవగాహన డొమెస్టిక్ వర్కర్లలో చాలా తక్కువగా ఉందని సోనియా జార్జ్ అన్నారు. ఈ వృత్తి స్వభావం వల్ల కూడా సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు.
డొమెస్టిక్ వర్కర్లంతా చెల్లాచెదురుగా ఉన్నారు. మామూలుగా డొమెస్టిక్ వర్కర్లు, యజమానులతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోరు. కాబట్టి వారిని రిజిస్టర్ చేసే లేదా గుర్తించే యంత్రాంగం ఏదీ లేదు.
''డొమెస్టిక్ వర్కర్లను రిజిస్టర్ చేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వృత్తిని క్రమబద్ధీకరించడంలో పెద్ద ముందడుగు వారి 'అదృశ్యత'ను నివారించడం'' అని సోనియా అభిప్రాయపడ్డారు.
ఇది యజమానులకు కూడా వర్తిస్తుంది. ''యజమానులు కూడా ఈ వ్యవస్థలో పూర్తిగా కనిపించరు. ఫలితంగా జవాబుదారీతనం, బాధ్యతలను నుంచి తప్పించుకుంటారు'' అని ఆమె అన్నారు.
కుల వ్యవస్థ కూడా మరిన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. కొన్ని కులాలకు చెందిన వర్కర్లు ఒక ఇంట్లో మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ఒప్పుకోవచ్చు. అయితే, కాస్త భిన్నమైన కులాలకు చెందినవారు ఈ పని చేసేందుకు నిరాకరించవచ్చు.
మొత్తంగా, డొమెస్టిక్ వర్క్ అనే భావనను పూర్తిగా పునర్ నిర్వచించాలని జార్జ్ అన్నారు.
''ఇంటి పనిని నైపుణ్యం లేని(అన్ స్కిల్డ్) పనిగా పరిగణిస్తారు. కానీ, వాస్తవంలో అలా ఉండదు. నైపుణ్యాలు లేకుండా మీరు అనారోగ్యంతో ఉన్నవ్యక్తిని చూసుకోలేరు, వంట చేయలేరు.'' అని ఆమె వివరించారు.
డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించిన సొంత చట్టాలను, విధానాలను ఆమోదించడం, అమలు చేయడంలో విఫలం కావడమే కాకుండా, ఐఎల్‌ఓ కన్వెన్షన్ 189ను భారత్ ఇంకా ఆమోదించలేదు. ఇతర ఉద్యోగుల తరహాలోనే డొమెస్టిక్ వర్కర్లకు కూడా సమాన హక్కులు, రక్షణలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందిన ఒక విశిష్టమై అంతర్జాతీయ ఒప్పందం ఇది. 2011లో ఈ ఒప్పందానికి అనుకూలంగా భారత్ ఓటు వేసినప్పటికీ, ఇప్పటికీ అందులోని అన్ని నిబంధనలను పాటించలేదు.
ఐఎల్‌ఓ ఒప్పందానికి అనుగుణంగా ఉండాల్సిన నైతిక బాధ్యత భారత్‌కు ఉందని సోనియా అభిప్రాయపడ్డారు. ఒక చట్టం ఉండటం వల్ల, ప్రైవేట్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను క్రమబద్ధీకరించడంలో, పని నిమిత్తం విదేశాలకు వెళ్లే డొమెస్టిక్ వర్కర్లు దోపిడీకి గురి కాకుండా నిరోధించడంలో సహాయపడుతుందని ఆమె అన్నారు.
డొమెస్టిక్ వర్కర్లను దోపిడీ చేస్తున్నారన్న కేసులో గత సంవత్సరం ఒక స్విస్ కోర్టు సంపన్న కుటుంబం హిందుజా ఫ్యామిలీని దోషులుగా తేల్చడం సంచలనం సృష్టించింది.
భారత్ నుంచి తీసుకొచ్చిన పనివాళ్లకు సరైన జీతం ఇవ్వకుండా సుదీర్ఘ గంటల పాటు బలవంతంగా తమ భవనంలో పనిచేయించారంటూ హిందూజా కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. స్విస్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేస్తామని వారి కుటుంబం తరపు లాయర్లు చెప్పారు.
''ఆఖరికి, ఇలాంటి ఒక బిల్లుపై సంతకం పెట్టే అధికారం ఉన్నవారు కూడా డొమెస్టిక్ వర్కర్ల నుంచి ప్రయోజనం పొందుతున్నవారే. వారికి యజమానులుగా ఉన్నవారే. కాబట్టి, వ్యవస్థలో ఒక నిజమైన మార్పు రావాలంటే, ముందుగా మన మనస్తత్వాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది'' అని జార్జ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














