ఏది అసలైన బంగారం? ఏది నకిలీ

Gold

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏదైనా వస్తువునో.. మనిషినో.. చాలా బాగున్నావని చెప్పడానికి 'బంగారం'లా ఉందనో, ఉన్నావనో పోల్చుతుంటాం కదా!

మరి, ఆ బంగారంలో నాణ్యత, స్వచ్ఛత (ప్యూరిటీ) ఎంత ఉందో తెలుసుకోవడమెలా? దాన్ని ఎలా పరీక్షిస్తారు?

సాధారణంగా బంగారంలో ఎంత ప్యూరిటీ ఉందో దుకాణాల్లోని 'ప్యూరిటీ మెషీన్‌'లో పెట్టి డిజిటల్ పద్ధతిలో నిమిషాల్లో చూస్తుంటారు.

అదే ప్యూరిటీని ల్యాబ్‌లో కొలవాలంటే ఓ నాలుగు గంటల సమయం పడుతుంది.

అయితే, ఖర్చు చాలా తక్కువ, అంతేకాదు స్వచ్ఛతను పక్కాగా తెలుసుకోవచ్చని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు చెబుతున్నారు .

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
 బంగారం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

హాల్ మార్కింగ్ ఉంటే ప్యూర్‌గా ఉన్నట్లేనా?

బంగారం కొనే ముందు ఏమేం సరిచూసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం.

సాధారణంగా మార్కెట్‌లో 22 క్యారెట్ గోల్డ్‌తో చేసిన ఆభరణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అలాంటి ఆభరణాలు అమ్మాలంటే బీఐఎస్ నిబంధనల ప్రకారం వాటికి హాల్ మార్కింగ్ తప్పనిసరి.

హాల్ మార్కింగ్‌లో బీఐఎస్ లోగో, 22కే916 (ఆభ‌ర‌ణం క్యారెటేజ్‌), హెచ్‌యూఐడీ (హాల్‌ మార్కింగ్ యూనిక్ ఐడెంటిఫికేష‌న్ నంబ‌ర్‌).. ఈ మూడూ ఖచ్చితంగా ప్ర‌తి ఆభ‌ర‌ణంపై రాసి ఉండాలి.

బీఐఎస్ నిబంధనల ప్రకారం బంగారానికి హాల్ మార్కింగ్ తప్పనిసరి.

ఫొటో సోర్స్, BIS

ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకుండా ఆభరణాన్ని అమ్మినా నేరమే అని బీఐఎస్ హైదరాబాద్ డైరెక్టర్ పీవీ శ్రీకాంత్ బీబీసీకి చెప్పారు.

''బీఐఎస్ చ‌ట్టం 2016 ప్ర‌కారం.. హాల్ మార్కింగ్ లేకుండా ఆభరణాలు అమ్మడం లేదా కొనడం నేరం. రెండేళ్లు లేదా ఐదేళ్ల జైలు శిక్ష లేదా రూ.2 ల‌క్ష‌లు, అంత‌కుమించి జ‌రిమానా.. కొన్నిసార్లు జైలుశిక్ష, జరిమానా రెండూ విధించే అవకాశం ఉంది'' అని ఆయన చెప్పారు.

ఆభరణంపై ఉండే హెచ్‌యూఐడీ నంబరును బీఐఎస్ కేర్ యాప్‌లో నమోదు చేసి, అది నిజమైందో.. కాదో తనిఖీ చేసుకునే అవకాశం బీఐఎస్ కల్పిస్తోంది.

బంగారం

ఫొటో సోర్స్, Getty Images

ఈ క్యారెట్స్ లెక్కలేంటి?

ప్యూరిటీ ఆధారంగా బంగారంలో రకాలుంటాయి. 24 క్యారెట్స్, 23, 22, 20, 18, 14 క్యారెట్స్‌గా దీన్ని విభజించారు. ఇందులో 22, 18, 14 క్యారెట్స్ బంగారాన్ని ఆభరణాల తయారీలో వాడుతుంటారు.

''995 ప్యూర్ గోల్డ్‌తో ఆభరణాలు చేయడం సాధ్యం కాదు. అందులో స్ట్రెంథ్ (పట్టు) కోసం ఇంప్యూరిటీస్ (ఇతరత్రా ఖనిజాలు) కలుపుతారు'' అని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్ సత్తు సవిత బీబీసీకి వివరించారు.

995 ప్యూరిటీ ఉంటే 24 క్యారెట్స్‌ బంగారంగా పరిగణిస్తారు. అంటే 1,000 మి.గ్రా. మిశ్రమంలో 995 (99.5శాతం) బంగారం ఉంటే దాన్ని 'ప్యూర్ గోల్డ్'గా పిలుస్తారు.

అదే 958 ఉంటే 23 క్యారెట్, 916 ఉంటే 22 క్యారెట్, 833 ఉంటే 20 క్యారెట్, 750 ఉంటే 18 క్యారెట్, 585 ఉంటే 14 క్యారెట్‌గా పరిగణిస్తారు.

''ఇంప్యూరిటీ కలిపిన తర్వాత బంగారం ఎంత శాతం ఉందనేది కీలకం. నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువ కలిపితే, అప్పుడు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం ముఖ్యం'' అని సవిత చెప్పారు.

బంగారం తూనికలు
ఫొటో క్యాప్షన్, శాంపిల్స్‌ను ప్రాథ‌మిక‌ అంచ‌నా కోసం ఎక్స్ఆర్ఎఫ్ అనే యంత్రం సాయంతో ప‌రీక్షిస్తారు.

స్వచ్ఛత ఎలా కొలుస్తారు?

ఇప్పుడు బంగారంలో నాణ్యత లేదా స్వచ్ఛతను ల్యాబ్‌లో ఎలా పరీక్షిస్తారో తెలుసుకుందాం.

సుమారు 4 గంటల సమయం పట్టే ఈ పరీక్ష చేయించాలంటే కేవలం రూ.45 ఫీజు చెల్లించాలి.

  • ముందుగా హాల్‌మార్క్ ఉన్న బంగారు ఆభ‌ర‌ణాల శాంపిల్స్‌ను షాపుల నుంచి బీఐఎస్ సిబ్బంది సేక‌రిస్తారు. ఆ శాంపిల్స్‌ను ఎక్కడి నుంచి సేకరించారో తెలియకుండా ప్రత్యేక కోడ్ ఇస్తారు. అక్కడి నుంచి తీసుకువచ్చాక బీఐఎస్ ల్యాబ్‌లో మరో కోడ్ ఇస్తారు.
బంగారం కరిగించడం, బరువు కొలత
ఫొటో క్యాప్షన్, బంగారాన్ని క్యుపులేష‌న్ ఫ‌ర్నేస్ యంత్రంలో పెట్టి క‌రిగిస్తారు.

''ఇలా చేయడం వల్ల ఏ దుకాణం నుంచి వచ్చిన శాంపిల్‌ను ఎవరు పరీక్షిస్తున్నారో తెలియకుండా పకడ్బందీగా పరీక్ష సాగుతుంది'' అని చెప్పారు సవిత.

''ఇదంతా పారదర్శకంగా చేసేందుకు ఎంచుకున్న ప్రక్రియ. మా వద్ద నుంచి శాంపిల్స్ వేరే బ్రాంచ్లకు వెళ్తాయి. వేరే బ్రాంచ్ల నుంచి మాకు వస్తుంటాయి'' అని బీఐఎస్ డైరెక్టర్ పీవీ శ్రీకాంత్ చెప్పారు.

  • శాంపిల్స్‌ను ప్రాథ‌మిక‌ అంచ‌నా కోసం ఎక్స్ఆర్ఎఫ్ అనే యంత్రం సాయంతో ప‌రీక్షిస్తారు. బేసిక్ కేరటేజ్‌ను అంచ‌నా వేసి బ‌రువు తూకం వేసి.. న‌మూనాల‌ను రిజిస్ట‌ర్‌లో న‌మోదు చేస్తారు.
బంగారం

''బంగారాన్ని 22 కే, 18 కే, 14 కే కింద విభజిస్తాం. ఏవైనా నిషేధిత పదార్థాలు లేదా ఖనిజాలు ఉంటే శాంపిల్స్‌ను తిరస్కరిస్తాం'' అని సవిత చెప్పారు.

  • నిషేధిత పదార్థాలు లేని పక్షంలో న‌మూనాల‌ను ఫ‌ర్నేస్ యంత్రంలో 1,100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌ మధ్య 5 నుంచి 10 నిమిషాల పాటు క‌రిగిస్తారు.
  • క‌రిగించిన న‌మూనా బ‌రువును ప్రాథ‌మిక అంచ‌నా బ‌రువుతో స‌రిచూస్తారు. ఆ తర్వాత మిశ్ర‌మాన్ని హైడ్రాలిక్ యంత్రంలో ప్రెస్ చేసి ఓ బ‌ట‌న్‌లా త‌యారుచేస్తారు. దాన్ని రోలింగ్ యంత్రం సాయంతో ప‌లుచ‌టి రేకుల్లా మార్చుతారు.
  • రేకుల‌ను క‌త్తెర సాయంతో చిన్న ముక్క‌లుగా క‌త్తిరించి అందులోని 150 మి.గ్రా.లను బ‌ట్ట‌ర్ పేప‌ర్‌లో ఉంచుతారు.
  • సీసంతో ఓ శంఖు ఆకారాన్ని తయారు చేసి బ‌ట్ట‌ర్ పేప‌ర్‌లో ఉంచిన బంగారం మిశ్ర‌మాన్ని, వెండి, కాప‌ర్‌లను అందులో ఉంచుతారు.
  • దీని బ‌రువును మ‌రోసారి కొలిచి, వాటిని బాయిలింగ్ ప్లేయ‌ర్ అనే ప‌రిక‌రం సాయంతో చిన్న బంతుల్లా త‌యారుచేస్తారు. ఆ బంతుల‌ను క్యుపులేష‌న్ ఫ‌ర్నేస్ యంత్రంలో పెట్టి క‌రిగిస్తారు.
  • 1050 - 1080 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 25 నిమిషాల పాటు వేడి చేసే ఈ ప్రాసెసింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి కేవ‌లం బంగారం, వెండి మాత్ర‌మే మిగిలి, మిగ‌తా పదార్ధాలన్నీ ఆక్సిడైజ్ అయిపోతాయి.
  • తర్వాత నైట్రిక్ యాసిడ్, డీ అయొనైజ్డ్ వాటర్‌ను వాడి వెండిని బంగారం నుంచి వేరు చేస్తారు. ఇందుకు దాదాపు 15 నిమిషాల సమయం పడుతుంది.
  • నల్లని రంగులో వచ్చిన బంగారాన్ని రంగు మార్చి, వివిధ గ‌ణాంక సూత్రాల‌ను ఉపయోగించి ఆ బంగారం స్వచ్ఛత లేదా శుద్ధ‌త‌ను లెక్కిస్తారు.

పరీక్ష కోసం దుకాణాల నుంచి తీసుకొచ్చిన శ్యాంపిల్స్ బ‌రువుతో చివ‌రి మిశ్ర‌మాన్ని పోల్చి.. ప‌రీక్ష‌లో ఎంత వృథా పోయిందో లెక్క‌వేసి మిగిలిన మొత్తాన్ని డీ కోడింగ్ చేసుకుంటూ దుకాణాలకు పంపిస్తామని బీఐఎస్ అధికారులు చెప్పారు.

బంగారం స్వచ్ఛత
ఫొటో క్యాప్షన్, పరీక్ష కోసం దుకాణాల నుంచి తీసుకొచ్చిన బంగారం శ్యాంపిల్స్ బ‌రువుతో పరీక్షల తర్వాత వచ్చిన చివ‌రి మిశ్ర‌మాన్ని పోల్చుతారు.

ప్రజలు నేరుగా వచ్చి చెక్ చేసుకోవచ్చా?

''మా వద్దకు వచ్చిన శాంపిల్ తిరస్కరణకు గురైతే మరోసారి శాంపిల్ పంపించేందుకు దుకాణదారులకు అవకాశం ఇస్తాం. ఆ తర్వాత కూడా తిరస్కరణకు గురైతే నిబంధనల ప్రకారం చర్యలుంటాయి'' అని పీవీ శ్రీకాంత్ చెప్పారు.

ప్రజలు నేరుగా హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న బీఐఎస్ ల్యాబ్‌ను సంప్రదించి స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చని సవిత తెలిపారు.

''సాధారణంగా ఇది డిస్ట్రక్టివ్ (ఆభరణాలు కరిగించి ముద్ద చేసే) టెస్టు. వినియోగదారులు హాల్ మార్కింగ్ చూసి, అది ఉంటే నిర్భయంగా కొనొచ్చు. అయినప్పటికీ ల్యాబ్‌లో పరీక్షించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు'' అని ఆమె అన్నారు.

బీఐఎస్ కార్యాలయం
ఫొటో క్యాప్షన్, బీఐఎస్ కార్యాలయం

నిషేధిత పదార్థాలంటే..

బంగారంలో ఇంప్యూరిటీస్ అంటే స్వచ్ఛమైన బంగారం కాకుండా అందులో బలం (పట్టు) పెంచేందుకు వాడే పదార్థాలు అని అధికారులు చెబుతున్నారు.

కాడ్మియం, ఆస్మియం, పల్లాడియం, రోడియం, రుథేనియం, ఇరేడియం వంటివి బంగారు ఆభరణాల్లో వాడటంపై నిషేధం ఉంది.

''వీటిని వాడటం వల్ల బంగారంతో మిశ్రమం ఏర్పడదు. పైగా కాడ్మియం వాడితే మనిషి శరీరంపై ప్రభావం పడుతుంది. అందుకే నిషేధం ఉంది'' అని సత్తు సవిత బీబీసీకి చెప్పారు. వెండి, రాగి, తక్కువ మొత్తంలో జింక్ వాడొచ్చని ఆమె వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)