ఎయిర్ పోర్ట్‌‌ నుంచి 400 కేజీల బంగారాన్ని ఎలా దోపిడీ చేశారు, తర్వాత ఏమైంది?

కెనడాలో బంగారం దోపిడీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నదీన్ యూసఫ్
    • హోదా, బీబీసీ న్యూస్

సంచలన బంగారం దోపిడీ, ఆ తర్వాత వరుస అరెస్టులు.. అమెరికా-కెనడా సరిహద్దుల్లో అక్రమ తుపాకుల మార్కెట్ పై మరోసారి చర్చకు దారి తీశాయి.

ఏడాది కిందట 20 మిలియన్ కెనడియన్ డాలర్లు (రూ.120 కోట్లు) విలువైన వేలకొద్దీ బంగారం దిమ్మలను ఓ కెనడా ఎయిర్‌పోర్టు నుంచి దోపిడీ చేశారు.

ఆ బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో అమెరికా నుంచి తుపాకులు కొనుగోలు చేశారని ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసిన పీల్ ప్రాంతీయ పోలీసు విభాగం అధిపతి నండో ఇయానిక మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది కేవలం బంగారం దోపిడీ కాదు. ఈ బంగారం ఆయుధాలుగా మారుతోంది’’ అని ఆయన అన్నారు.

అమెరికా నుంచి అక్రమ ఆయుధాల స్మగ్లింగ్ సమస్య ఎప్పటినుంచో కెనడాను వేధిస్తోంది. షాట్‌గన్స్, రైఫిల్స్ మినహా చాలా గన్స్‌పై కెనడాలో నిషేధం అమలులో ఉంది.

కెనడాలో బంగారం దోపిడీ

ఫొటో సోర్స్, Getty Images

అదే సమయంలో అమెరికాలో రాజ్యాంగం లైసెన్స్ లేకుండానే తుపాకులతో తిరిగేందుకు అనుమతిని ఇస్తోంది. అందుకే అమెరికాలో గన్లను కొనుక్కోవడం చాలా తేలిక. ఈ అంశం అక్కడి రాజకీయ చర్చల్లోనూ తరచూ ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది.

అమెరికాలో సులువుగా తుపాకులు దొరకడంతో, కెనడాకు వీటి స్మగ్లింగ్ కూడా తేలిక అవుతోంది.

‘‘చాలా మంది స్మగ్లర్‌లు అమెరికాలో తుపాకులు కొని, కెనడాలో అమ్ముతుంటారు’’ అని కెనడా గన్ పోలీస్ కమిటీ హెడ్ బిల్ ఫోర్డీ చెప్పారు.

టొరంటో పోలీసు అధికారి నార్మన్ ప్రోక్టర్ గత ఏడాది ఒక ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో 500 డాలర్లకు కొన్న గన్‌ను కెనడాలో ఇట్టే 5,000 డాలర్లుకు అమ్ముకోవచ్చు’’ అని చెప్పారు.

2020లో కెనడాలోని నోవా స్కాటియాలో ఓ షూటింగ్ ఘటనలో 22 మంది హత్యకు గురయ్యారు. కెనడాలో జరిగిన దారుణమైన నరమేథాల్లో ఇదీ ఒకటి. దీని తర్వాత ఇక్కడి తుపాకుల సంస్కృతిపై చాలా చర్చ జరిగింది.

కెనడాలో బంగారం దోపిడీ

ఫొటో సోర్స్, PEEL REGIONAL POLICE

ఆ ఘటన తర్వాత తుపాకులపై నిషేధం విధించే విధానాలు ఎంతవరకూ పని చేస్తున్నాయని చాలామంది ప్రశ్నలు సంధించారు. ఆ నరమేథానికి ఉపయోగించిన తుపాకులను కూడా అక్రమంగా అమెరికా నుంచి కెనడాకు దిగుమతి చేసుకున్నారు.

సాధారణంగా అమెరికా నుంచి స్మగ్లింగ్ ద్వారా కెనడా తీసుకొచ్చే తుపాకులను దేశంలోని భిన్నప్రాంతాలకు తరలిస్తుంటారు. దోపిడీలు, ఇతర హింసాత్మక ఘటనల్లో వీటిని ఉపయోగిస్తుంటారు.

కెనడాలో జనభా ఎక్కువగా ఉండే ఒంటారియో ప్రావిన్స్‌లో 2023లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఉపయోగించిన తుపాకుల్లో 90 శాతం అమెరికా నుంచి స్మగ్లింగ్ ద్వారా తీసుకొచ్చినవేనని పోలీస్ చీఫ్ బిల్ ఫోర్డీ చెప్పారు.

‘‘తుపాకులు ఎక్కువగా ఒహాయో, టెక్సస్, ఫ్లోరిడా, జార్జియా లాంటి స్టేట్‌ల నుంచి కెనడాకు ఎక్కువగా వస్తున్నట్లు మా విశ్లేషణలో తేలింది’’ అని ఫోర్డీ చెప్పారు.

‘‘చాలావరకు ఈ తుపాకులను ఒకేసారి బల్క్‌లో కొంటారు. భారీ లాభాలకు వీటిని కెనడా మార్కెట్‌లో అమ్ముతారు’’ అని ఆయన అన్నారు.

కెనడాలో బంగారం దోపిడీ

ఫొటో సోర్స్, Getty Images

బంగారం దోపిడీ

గత ఏడాది ఉత్తర అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బంగారం దోపిడీ టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

పోలీసులు ఈ ఘటనను నెట్‌ఫ్లిక్స్‌లోని ‘మనీ హైస్ట్’తో పోల్చారు.

ఎయిర్‌పోర్టులోని ఓ కార్గో సెంటర్‌ నుంచి 400 కేజీల బంగారం, డబ్బును దుండగులు దోచుకెళ్లారు. స్విట్జర్లాండ్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చిన 42 నిమిషాల్లోనే ఈ మొత్తాన్ని దోచుకెళ్లారు.

ఫేక్ షిప్పింగ్ రిసీట్లతో ఈ బంగారాన్ని దోపిడీ చేశారు. చాలా సంక్లిష్టమైన ఈ దోపిడీ దేశ భద్రతా వ్యవస్థపైనే సందేహాలను లేవనెత్తింది.

దొంగ రసీదులను చూపించి బంగారం, డబ్బును ఒక కార్గో ట్రక్‌లోకి ఎక్కించారు. అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ కేసులో అరెస్టుల గురించి వివరాలు తెలియజేస్తూ.. ఓ విమానయాన సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బంది సాయంతో ఈ దోపిడీ జరిగిందని పోలీసులు చెప్పారు.

ప్రస్తుతం ఆ ఉద్యోగులపై కూడా క్రిమినల్ కేసులు నమోదుచేశారు.

ఆ బంగారంతో మొదట బ్రాస్లెట్‌లు తయారుచేశారని, వాటిని అమ్మి డబ్బు సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది.

నిరుడు సెప్టెంబరులో పెన్సిల్వేనియా పోలీసులు 25 ఏళ్ల డ్యూరంటే కింగ్ మెక్‌లీన్‌ను అరెస్టు చేశారు. అనంతర విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

డ్యూరంటే...ఫ్లోరిడా, జార్జియాల నుంచి తుపాకులను కొనుగోలు చేశారు. ఆయనే స్వయంగా అమెరికాకు దీని కోసం వెళ్లారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

కెనడాలో బంగారం దోపిడీ

ఫొటో సోర్స్, PEEL REGIONAL POLICE

ఇది పక్కా ప్రణాళికతో జరుగుతున్న నేర వ్యాపారమని పోలీస్ చీఫ్ ఫోర్డీ చెప్పారు.

ఈ బంగారం దోపిడీ కేసుకు సంబంధించి మరిన్ని అరెస్టులు కూడా జరిగాయి. కొందరికి వారెంట్లు కూడా జారీచేశారు.

ఈ కేసులో ఐదుగురికి బెయిల్ కూడా కోర్టు మంజూరు చేసింది. వీరిలో పరమ్‌పాల్ సంధు, అమిత్ జలోటా, అమ్మద్ చౌధరి, అలీ రెజా, ప్రసాద్ పరమలింగం ఉన్నారు.

మరో ముగ్గురికి వారెంట్లు జారీచేశారు. వారిని ఇంకా అరెస్టు చేయలేదు. వారెంట్లు జారీ అయిన వారిలో సిమ్రన్ ప్రీత్ పనేసార్, అర్చిత్ గ్రోవర్, అరసలాన్ చౌధరి ఉన్నారు.

వీడియో క్యాప్షన్, కెనడా: సాల్మన్ చేపలు ఎందుకు చనిపోతున్నాయి?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)