ఇండియా పరపతి ముందు కెనడా ప్రధాని ట్రూడో తేలిపోయారా? ఏకాకి అయ్యారా?

జస్టిన్ ట్రూడో

ఫొటో సోర్స్, REUTERS

    • రచయిత, హోలీ హొండరిచ్
    • హోదా, వాషింగ్టన్

న్యూయార్క్‌లో ఈ వారంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ముఖంలో కనిపించే చిరునవ్వు మసకబారింది.

భారత్‌పై ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణల గురించే రిపోర్టర్ల ప్రశ్నలు ఉండడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు.

కెనడా భూభాగంపై జరిగిన కెనడా పౌరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉండొచ్చని, అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని ట్రూడో ఆరోపణలు చేశారు.

అయితే, హత్యకు గురైన సిక్కు నేతను భారత్ ఉగ్రవాదిగా అభివర్ణిస్తోంది. అయినా, ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ కొట్టిపారేసింది.

మీడియాతో నిదానంగా, జాగ్రత్తగా మాట్లాడిన కెనడా ప్రధాని ట్రూడో మరోమారు అవే తరహా వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం ఎవరినో రెచ్చగొట్టాలనో లేదా సమస్య సృష్టించాలనో అనుకోవడం లేదు. చట్టం అమలుకు కట్టుబడి ఉన్నాం'' అన్నారు.

అయితే, మిత్రదేశాలు ఏమంటున్నాయని రిపోర్టర్లు ప్రశ్నించారు. మీరు ఒంటరి అయినట్టున్నారని మరో రిపోర్టర్ ట్రూడోను అడిగారు.

కెనడా జనాభాతో పోలిస్తే 35 రెట్లు పెద్దదైన, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌తో నేరుగా తలపడడంతో, కెనడా ప్రధాని ట్రూడో ప్రపంచ వేదికపై ఏకాకి అయ్యారనే భావనలు వినిపిస్తున్నాయి.

బైడెన్, ట్రూడో

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌తో వ్యూహాత్మక సంబంధాల ప్రభావం

ప్రధాని ట్రూడో ప్రకటన తర్వాత, ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలోని కెనడా మిత్రదేశాలు కొద్దిరోజులకే బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ, అవేవీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లుగా లేవు.

కెనడా ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని యూకే విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లెవెర్లీ చెప్పారు. ఆస్ట్రేలియా కూడా అదే తరహాలో స్పందించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.

అమెరికా, రెండూ సన్నిహిత దేశాలు అయినప్పటికీ కెనడా తరఫున అమెరికా ఆగ్రహం ప్రదర్శించింది లేదు.

ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పేరును ప్రస్తావించారు కూడా. అయితే, అది ఖండించడానికి కాదు. నూతన ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో సాయం చేసినందుకు ఆయన ప్రశంసించారు.

ఈ నేపథ్యంలో, కెనడాతో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను జో బైడెన్‌ జాతీయ భద్రతా సలహాదారు జేన్ సల్లీవన్ ఖండించారు. కెనడాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన చెప్పారు.

అలాగే, పాశ్యాత్య ప్రపంచంలో భారత్ ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, మిత్రదేశాల ప్రకటనలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయనేంత వరకే పరిమితమయ్యాయి.

భారత్‌తో పాశ్యాత్య దేశాల భారీ వ్యూహాత్మక సంబంధాల నేపథ్యంలో కెనడా తేలిపోయిందని, అదే కెనడాకు సమస్యగా మారిందని నిపుణులు బీబీసీతో చెప్పారు.

''అమెరికా, యూకే సహా పశ్చిమ దేశాలు, ఇండో పసిఫిక్ మిత్రదేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకుంటున్నాయి. ఇప్పుడు వాటిని మధ్యలో వదిలేసే పరిస్థితుల్లో అవి లేవు'' అని విల్సన్ సెంటర్‌‌కి చెందిన కెనడా ఇన్‌స్టిట్యూట్‌లో రీసర్చర్‌గా ఉన్న జేవియర్ డెల్గాడొ చెప్పారు.

''ఇతర దేశాలు ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడం, కెనడాకు మద్దతుగా నిలవకపోవడం ప్రపంచ రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది'' అన్నారు.

కెనడా, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ రాజకీయ వాస్తవికత ఇదేనా?

కెనడాలో యూఎస్ అంబాసిడర్ డేవిడ్ కొహెన్ కెనడియన్ టీవీ నెట్‌వర్క్ సీటీవీతో మాట్లాడుతూ- ''ఈ విషయంలో ఫైవ్ ఐ ఇంటెలిజెన్స్ సభ్య దేశాల నిఘా వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి'' అని చెప్పారు.

కానీ, హత్యను బహిరంగంగా ఖండించాలని కెనడా నుంచి వచ్చిన విజ్ఞప్తులను తిరస్కరిస్తూ అవే మిత్రపక్షాలు ఇచ్చిన నివేదికలో ''ప్రైవేట్ దౌత్య సంభాషణలపై మాట్లాడే అలవాటు మాకు లేదు'' అని పేర్కొన్నారు.

అయినప్పటికీ, ఇతర దేశాల మౌనం ప్రపంచ వేదికపై కెనడా వెనకబాటును సూచిస్తోంది. ఇది నమ్మదగిన పాశ్యాత్య మిత్రదేశమే కానీ, ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైనది కాదు.

''ఇది బలహీన క్షణం'' అని కెనడా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టోఫర్ శాండ్స్ చెప్పారు.

''ప్రస్తుతం మనం కఠినమైన పరిస్థితులను చూస్తున్నాం. కెనడా అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పుడు శక్తి, అధికారం, డబ్బే నిర్ణయాత్మక అంశాలు. అవి ప్రస్తుతం కెనడా వద్ద లేవు'' అని ఆయన అన్నారు.

కెనడా భూభాగంపై జరిగిన రాజకీయ హత్యగా చెబుతున్న విషయాన్ని భారత్‌ వెలుపల నుంచి కొందరు ట్రూడో ద్వారా బహిరంగ పరచాలని భావించారు. అయితే, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు.

భారత్‌తో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరిగిపోవడం, దౌత్యవేత్తల బహిష్కరణలు, ట్రావెల్ అడ్వైజరీ జారీ చేయడం, కెనడా పౌరులకు భారత్ వీసా సేవలు నిలిపివేయడం వంటి పరిణామాలు ప్రపంచ రాజకీయ వాస్తవికతకు అద్దం పడుతున్నాయి. అంటే, కెనడా ప్రధాని ట్రూడో ఒంటరి అయ్యే అవకాశాలను సూచిస్తున్నాయి.

గాయంతో పాటు అవమానం కూడా తోడైనట్లు కెనడా లిబరల్ నేత ట్రూడోకి ఈ వారం ఇబ్బందికరంగా గడిచిందనే చెప్పాలి.

ట్రూడో

ఫొటో సోర్స్, PARLVU

ఎనిమిదేళ్లలో ఎప్పుడూ లేనంత వ్యతిరేకత

ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కెనడియన్లు ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం గురించి కథనాలు వెలువడ్డాయి. వాటి గురించి ట్రూడో, ఆయన క్యాబినెట్‌కి తెలిసినప్పటికీ వాటిని తీవ్రంగా పరిగణించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.

సీరియల్ కిల్లర్ పాల్ బెర్నార్డోను కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలుకి పంపకుండా, ఓ మోస్తరు భద్రత ఉన్న జైలుకి తరలించడంపై కూడా కెనడాలో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ట్రూడో ప్రభుత్వం ఉదాసీన వైఖరికి ఇది నిదర్శమన్న విమర్శలు కూడా వచ్చాయి.

2015లో ప్రధాని పీఠం ఎక్కిన ట్రూడోకి దేశ ప్రజల మద్దతు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. సెప్టెంబర్ నాటికి, 63 శాతం మంది కెనడియన్లు ప్రధానమంత్రిని తిరస్కరించారు.

ఎనిమిదేళ్లలో ఇంత వ్యతిరేకత ఎప్పుడూ లేదని అంగస్ రీడ్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రెసిడెంట్ షాచి కర్ల్ అన్నారు. ''ఆ పదవిని అంటిపెట్టుకుని ఉంటావా? లేక రాజీనామా చేస్తావా'' అంటూ ప్రజలు ప్రశిస్తున్నారని ఆయన చెప్పారు.

సాధారణ నేతగా మొదలై, భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ట్రూడో జీర్ణించుకోలేని మరో కఠోర వాస్తవం ఇది.

''కెనడా రాజకీయాల్లో ఆయనో సెలబ్రిటీ, గతంలో ఎవరికీ ఇంత ఆదరణ దక్కలేదు'' అని గ్లోబ్ అండ్ మెయిల్ న్యూస్‌పేపర్ చీఫ్ పొలిటికల్ రైటర్ క్యాంప్‌బెల్ క్లార్క్ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకు ప్రజాదరణ బాగా పెరిగిందన్నారు.

అయితే, ఎనిమిదేళ్ల పాలన తర్వాత ఇక చాలని కెనడియన్లు అనుకుని ఉండొచ్చని, ముఖ్యంగా ఇటీవల కొద్దినెలలుగా ట్రూడోకి ఆదరణ తగ్గినట్టు కనిపిస్తోందని క్లార్క్ అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ వేదికపై ట్రూడో ఒంటరి అయ్యారని అనిపించొచ్చు, కానీ భారత్‌తో ఈ వివాదంతో స్వదేశంలో ఆదరణ పెరగొచ్చని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.

''అయితే, ఇది దేశీయంగా వ్యక్తమవుతున్న అసంతృప్తి నుంచి ఆయనను పక్కకు నెట్టింది'' అని క్లార్క్ అభిప్రాయపడ్డారు.

వారం రోజులు గడిచే సరికి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పక్కపక్కన నిల్చోవడం ట్రూడోని ఇబ్బందిపెట్టే విషయమేమీ కాకపోవచ్చు. చివరికి, ఒక్కరోజైనా ట్రూడోకి మంచి కంపెనీ దొరికినట్టైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)