యూదుల ఊచకోతకు నాజీలు పన్నిన కుట్రల గురించి పోప్‌కు ముందే తెలుసా... 1942 నాటి రహస్య లేఖలో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల బయటపడిన ఒక లేఖ పోప్ పియస్, జర్మన్ల గురించి చాలా విషయాలు తెలియజేస్తోంది.
ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, అధికార హోదా అయిన హోలీ సీ నివేదికతో ఇది విభేదిస్తోంది. ఆ సమయంలో నాజీలు చేస్తున్న దురాగతాల గురించి చర్చి వద్ద ఉన్న సమాచారం అస్పష్టమని, ధ్రువీకరించలేదని ఈ లేఖ చెబుతోంది.
ఈ లేఖను వాటికన్ ఆర్కైవిస్ట్ జియోవన్ని కోకో కనుగొన్నారు. ఇది హోలీ సీ అధికారుల ఆమోదంతో "పియస్ XIIకి తెలుసు" అనే శీర్షికతో ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరాలో ఆదివారం ప్రచురితమైంది.
డిసెంబరు 14, 1942 అని తేదీ వేసి ఉన్న ఈ లేఖను జర్మనీలో నాజీలను వ్యతిరేకించిన ఫాదర్ లోథర్ కోనిగ్ వాటికన్‌లోని పోప్ వ్యక్తిగత కార్యదర్శి ఫాదర్ రాబర్ట్ లీబర్‌ను ఉద్దేశించి రాశారు.
ఇందులో మూడు నాజీ శిబిరాలు బెల్జెక్, ఆష్విట్జ్, డాచౌ గురించి ప్రస్తావించారు. అలాగే, కోయినిగ్, లీబర్ మధ్య మరికొన్ని లేఖలు ఉండే అవకాశం ఉందని, అయితే అవి అదృశ్యమవడం లేదా ఇంకా బయటపడి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
ఈ లేఖలో పేర్కొన్న అంశాలను బట్టి ఇది వాస్తవమని, దీని ఆధారంగా యూదులకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాల గురించి కచ్చితమైన, పూర్తి సమాచారం కోసం జర్మనీలోని క్యాథలిక్ చర్చి పియస్ XIIను పంపిందని నిర్ణయానికి వచ్చినట్లు కోకో అభిప్రాయపడ్డారు. అందువల్ల లేబర్ క్యాంపులు నిజంగా మరణ కర్మాగారాలు అని వాటికన్ వద్ద సమాచారం ఉందన్నారు.
చరిత్రకారుడు, ఎన్నో పుస్తకాలు రాసిన డేవిడ్ కెర్జర్ పోప్ పియస్ ఓవెన్స్ గురించి చెబుతున్నారు.
మరోవైపు, ఇది వాటికన్ ఆర్కైవిస్ట్ ద్వారా బయటపడింది.
"వాటికన్‌లో లేదా వాటికన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ చరిత్రను అంగీకరించే ప్రయత్నం జరుగుతుందని నాకు అనిపిస్తోంది" అని అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
బయటపడని పత్రాలు
ఇప్పటి వరకూ ఈ లేఖను వాటికన్ సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో కదిలించకుండా ఉన్న లేఖల్లో ఒకటిగా కోకో భావిస్తున్నారు.
"చర్చి చరిత్రకు భయపడదు" అని పోప్ ఫ్రాన్సిస్ చేసిన ప్రకటనను వాటికన్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఈ ఫైళ్ల విడుదల తెలియజేస్తోందని వాషింగ్టన్‌లోని యునైటెడ్ స్టేట్స్ హోలోకాస్ట్ మెమోరియల్ మ్యూజియంలో ఇంటర్నేషనల్ అకడమిక్ ప్రోగ్రామ్స్ డైరెక్టర్ సుజాన్నె బ్రౌన్ - ఫ్లెమింగ్ అభిప్రాయపడ్డారు.
యుద్ధం నాటి ఆర్కైవ్‌లను తెరవాలని 2019లో ఫ్రాన్సిస్ ఆదేశించారు.
''ఆ పత్రాల్లో వాటికన్‌కు అనుకూల, లేదా ప్రతికూల సమాచారం ఉన్నా శాస్త్రీయంగా నిర్ధరించాలనే కోరిక, అందుకు తగిన మద్దతు ఉన్నాయి'' అని బ్రౌన్ - ఫ్లెమింగ్ అన్నారు.
''మూడేళ్లుగా వాటికన్ ఆర్కైవ్‌లను తెరిచి పరిశీలన ప్రారంభించడంతో, యూరప్‌లో యూదులను అంతం చేసేందుకు తొలి నుంచీ నాజీలు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన సమాచారం పోప్‌కు చేరిందని పత్రాలు చెబుతున్నాయి'' అని కెర్జర్ బీబీసీతో చెప్పారు.
"అందులో ఇది మరొక భాగం మాత్రమే'' అని ఆయన అన్నారు.
ఈ పత్రాలు చెబుతున్న దానికంటే ''కళ్లముందు జరిగిన చరిత్రను ఎదుర్కోవడానికి నిరాకరించడమే వాటికన్ ప్రతిష్టను దెబ్బతీసింది'' అని కెర్జర్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పియస్ XII ప్రతిష్టపై వివాదం
కొత్తగా విడుదల చేసిన పత్రం పియస్ XII లెగసీ, ఆయన వివాదాస్పద బీటిఫికేషన్ ప్రచారంపై చర్చకు ఆజ్యం పోసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం నిలిచిపోయింది.
యూదులకు సాయం చేసేందుకు ఆయన రహస్యంగా పని చేశారని, అలాగే నాజీ-ఆక్రమిత యూరప్‌లో క్యాథలిక్కుల పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు ఆయన నిజాలు వెల్లడించలేదని ఆయన మద్దతుదారులు చెబుతూ ఉంటారు.
జర్మనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న మిత్రదేశాల నుంచి అభ్యర్థనలు వచ్చినప్పటికీ, తన వద్ద ఉన్న సమాచారం తెలియజేసేందుకు కూడా ఆయనకు ధైర్యం లేదని వ్యతిరేకులు వాదిస్తున్నారు.
దురాక్రమణకు పాల్పడకూడదనే ఒప్పందం గురించి హిట్లర్, పియస్ XII మధ్య రహస్యంగా సుదీర్ఘమైన చర్చలు జరిగాయని కెర్జర్ రాసిన ఒక పుస్తకంలో ప్రస్తావించారు.
చివరికి, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పియస్ XII పాత్ర అస్పష్టంగా ఉందని ఆధారాలు సూచిస్తున్నాయి. నాజీయిజాన్ని ఆయన అన్యమత రాజకీయ ఉద్యమంగా భావించినప్పటికీ, అది క్యాథలిక్కులను కూడా ఇబ్బందులకు గురిచేసింది.
అక్కడ జరుగుతున్న దారుణాల గురించి తెలిసినప్పటికీ యూదుల ఊచకోతను ఆయన స్పష్టంగా ఖండించలేదు.
ఇవి కూడా చదవండి:
- గుడిలో పూజారులుగా ఎస్సీ, బీసీ మహిళలు... చరిత్రను తిరగ రాస్తున్నారు
- భర్తను చంపి మురికి నీటి ట్యాంకులో పడేసిన భార్య... తొమ్మిదేళ్ల తర్వాత ఎలా పట్టుబడిందంటే?
- సముద్రంలో మునిగిన ఓడలో అట్టడుగున 60 గంటలు ఎలా బతికాడు... చివరికి ఏమైంది?
- మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి... ఇది ఇన్నేళ్ళుగా ఎందుకు పెండింగ్‌లో ఉంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














