భారత పర్యటనకు రావాలన్న నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన పోప్ ఫ్రాన్సిస్.. వాజ్‌పేయి తర్వాత 21 ఏళ్లలో తొలిసారి పోప్‌తో భేటీ అయిన భారత ప్రధాని

రెండు దశాబ్ధాల తర్వాత భారతదేశ ప్రధాన మంత్రి, పోప్‌ కలవడం ఇదే తొలిసారి

ఫొటో సోర్స్, @narendramodi

ఫొటో క్యాప్షన్, రెండు దశాబ్ధాల తర్వాత భారతదేశ ప్రధాన మంత్రి, పోప్‌ కలవడం ఇదే తొలిసారి

పోప్ ఫ్రాన్సిస్‌ను భారత దేశ సందర్శనకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. 2017లో పోప్ పర్యటన దాదాపు ఖరారై, అనంతరం నిలిచిన తర్వాత ఆ దిశగా పడిన అడుగుల్లో ఇది ముఖ్యమైంది.

ఈ ఆహ్వానాన్ని "ఉత్తమ బహుమతి"గా పోప్ ఫ్రాన్సిస్ అభివర్ణించారని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. నరేంద్ర మోదీతో పోప్ ఏకాంతంగా కూడా భేటీ అయ్యారని ఆయన వెల్లడించారు.

భారత పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానాన్ని పోప్ ఫ్రాన్సిస్ అంగీకరించారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

వాటికన్‌లో పోప్‌తో భేటీకి సంబంధించిన ఫోటోలను మోదీ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీ వచ్చిన మోదీ వాటికన్‌సిటీలో పోప్‌తో భేటీ అయ్యారు.

భారతదేశంలో క్రైస్తవులు సహా మతపరమైన మైనారిటీలపై వివక్ష, హింస పెరుగుతోందనే ఆందోళనల నేపథ్యంలో మోదీ ఆహ్వానం ముఖ్యమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

దేశంలో బీజేపీ హిందూత్వ అనుకూల ఎజెండాను అనుసరిస్తోందనే ఆరోపణలున్నాయి. వాటిని మోదీ ఖండిస్తూ వస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వాజ్‌పేయి తర్వాత మోదీయే..

మోదీ చేసిన ట్వీట్‌లో.. పోప్ ఫ్రాన్సిస్‌తో అత్యంత సుహృద్భావ భేటీ జరిగిందని, వివిధ అంశాలను ఆయనతో చర్చించే అవకాశం వచ్చిందని మోదీ తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్‌ను ఇండియాకు రావాలని ఆహ్వానించినట్టు పేర్కొన్నారు.

ఇరువురూ పేదరికం, వాతావరణ మార్పులతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు ది హిందూ వార్తాపత్రిక పేర్కొంది.

అయితే ఈ సమావేశంలో మత పరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు ఎలాంటి సమాచారం లేదు.

వాస్తవానికి ఈ భేటీ 20 నిమిషాలు మాత్రమే జరగాల్సి ఉందని, అయితే గంట వరకు సాగిందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ సందర్భంగా మోదీ పోప్ ఫ్రాన్సిస్‌కు వెండితో తయారు చేసిన కొవ్వొత్తుల స్టాండ్‌ను బహూకరించారు. పోప్ ఫ్రాన్సిస్ మోదీకి కాంస్య ఫలకాన్ని బహుమతిగా ఇచ్చారు.

దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత భారతదేశ ప్రధాన మంత్రి, పోప్‌ కలవడం ఇదే తొలిసారి అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.

2000 జూన్‌ నెలలో అటల్ బిహారీ వాజ్‌పేయి వాటికన్‌ను సందర్శించారు. పోప్ జాన్‌పాల్ 2తో భేటీ అయ్యారు. ఆ తర్వాత పోప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీయే.

అలాగే, 2013లో వాటికన్ చర్చి బాధ్యతలు చేపట్టిన పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయిన తొలి భారత ప్రధాన మంత్రి కూడా నరేంద్ర మోదీ.

రెండు దశాబ్ధాల తర్వాత భారతదేశ ప్రధాన మంత్రి, పోప్‌ కలవడం ఇదే తొలిసారి

ఫొటో సోర్స్, Reuters

భారతదేశంలో పోప్ చివరి పర్యటన ఎప్పుడంటే..

కాగా, భారతదేశంలో పోప్ పర్యటించి కూడా 20 ఏళ్లు దాటింది. చివరిసారి పోప్ జాన్‌పాల్ 2 1999లో భారతదేశాన్ని సందర్శించారు.

భారతదేశ జనాభాలో మెజార్టీ హిందువులు. దేశంలో దాదాపు 2.4 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అంటే దేశ జనాభాలో దాదాపు 2 శాతం. ఆసియాలో అత్యధిక క్యాథలిక్ జనాభా ఉన్న దేశం భారతదేశం.

పోప్ ఫ్రాన్సిస్ భారత్‌ను సందర్శించాలనే తన కోరికను తరచుగా ప్రస్తావిస్తూ వస్తున్నారు.

తప్పకుండా వచ్చే ఏడాది భారత పర్యటన చేసే అవకాశం ఉందని 2016లో ఫ్రాన్సిస్‌ చెప్పారు.

కానీ పొరుగున ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్‌లను సందర్శించినప్పటికీ, భారత క్యాథలిక్ నాయకులు పోప్‌కు ఆహ్వానం పంపించేలా ప్రధాని మోదీని ఒప్పించడంలో విఫలమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)