అప్గానిస్తాన్: తాలిబాన్‌లు ఐఎస్‌కు వ్యతిరేకంగా రహస్య యుద్ధం చేస్తున్నారా?

అఫ్గానిస్తాన్:జలాలాబాద్‌ లో ఓ తాలిబాన్ సైనికుడు
ఫొటో క్యాప్షన్, జలాలాబాద్‌ లో ఓ తాలిబాన్ సైనికుడు
    • రచయిత, సికిందర్ కిర్మాని
    • హోదా, బీబీసీ న్యూస్, జలాలాబాద్

అఫ్గానిస్తాన్‌ తూర్పు ప్రాంతంలోని జలాలాబాద్ శివార్లలో అప్పుడప్పుడు కొందరు రోడ్డు పక్కన మృతదేహాలను పడేసి వెళుతుంటారు. వాటిలో కొన్ని ఉరితీసినవి, తుపాకులతో కాల్చి చంపినవి ఉంటాయి. కొన్నింటికి తలలు నరికేసి ఉంటాయి.

వీరంతా ఇస్లామిక్ స్టేట్ అఫ్గానిస్తాన్‌ శాఖ సభ్యులంటూ వారి జేబుల్లో చేతి రాతతో కొన్ని చిట్టీలు కనిపిస్తాయి. ఈ ఘోరమైన, చట్టవిరుద్దమైన హత్యలకు బాధ్యత తమదే అని ఎవరు ప్రకటించరు. అయితే, దీనికి బాధ్యత తాలిబాన్‌లదే అని చాలామంది భావిస్తున్నారు.

తాలిబాన్‌ లు కాబూల్‌ను ఆక్రమించుకున్న కొద్దిరోజులకే ఐఎస్ సంస్థ కాబూల్ విమానాశ్రయం ఎదుట ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఇందులో 150మందికి పైగా మరణించారు.

ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ సంస్థ తాలిబాన్లకు ప్రధాన శత్రువుగా మారింది. వీరిద్ధరి మధ్య విభేదాలు దేశంలో రక్తపాతం సృష్టిస్తున్నాయి. జలాలాబాద్‌ నగరం ఈ ఘర్షణలు జరిగే ప్రాంతాలలో ముందుంది.

తాలిబాన్ల ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదురుకుంటున్నాయి. కానీ, తాలిబాన్ దళాలు జలాలాబాద్ ప్రాంతంలో ఐఎస్ సంస్థ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నాయి.

గతంలో తాలిబాన్లు ప్రభుత్వం మీద దాడులు చేసిన రీతిలోనే ఇప్పుడు ఐఎస్ తాలిబాన్‌లపై దాడులకు దిగుతోంది. తాలిబాన్‌లను మతభ్రష్టులుగా అభివర్ణిస్తున్న ఐఎస్ హిట్ అండ్ రన్ పద్ధతిలో దాడులు చేస్తోంది. అయితే, ఐఎస్ సభ్యులే దైవ ద్రోహులను తాలిబాన్లు ఆరోపిస్తున్నారు.

నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్‌లో తాలిబాన్ గూఢచార కేంద్రానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ బషీర్‌కు అత్యంత క్రూరుడిగా పేరుంది. ఆయన గతంలో ఐఎస్‌ను తరిమికొట్టడంలో కీలక పాత్ర పోషించారు.

రోడ్డు పక్కన పడి ఉంటున్న శవాలకు, తాలిబాన్లకు ఎలాంటి సంబంధం లేదని డాక్టర్ బషీర్ అన్నారు. అయితే, తమ ప్రభుత్వం అనేకమంది ఐఎస్ మిలిటెంట్‌లను అరెస్టు చేసిందని ఆయన వెల్లడించారు.

అఫ్గానిస్తాన్‌ కు ఐఎస్ ముప్పును తొలగించామని, శాంతి భద్రతలను పునరుద్ధరిస్తున్నామని బషీర్ చెబుతున్నారు. "మా ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారంతా ద్రోహులే'' అన్నారు బషీర్.

దేశంలో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా పని చేసేవారంతా ద్రోహులేనని డాక్టర్ బషీర్ అన్నారు.
ఫొటో క్యాప్షన్, దేశంలో తాలిబాన్‌లకు వ్యతిరేకంగా పని చేసేవారంతా ద్రోహులేనని డాక్టర్ బషీర్ అన్నారు.

వాస్తవానికి ఐఎస్ అనేది అఫ్గానిస్తాన్‌లో ఒక సంస్థ మాత్రమే కాదు. ఒక ప్రావిన్స్. దీనికి ఐఎస్-ఖొరాసన్ అని పేరు పెట్టారు. మధ్య ఆసియా ప్రాంతానికి ఉన్న పాత పేరునే తమ సైద్ధాంతిక ఇస్లామిక్ సామ్రాజ్యానికి పెట్టుకున్నారు.

ఈ బృందం మొదటిసారిగా 2015లో అఫ్గానిస్తాన్‌లో తన ఉనికిని చాటుకుంది. తరువాతి సంవత్సరాల్లో భయంకరమైన దాడులను నిర్వహించింది. అయితే, అప్గాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి ఐఎస్ సంస్థ సభ్యులు దేశంలో పలుచోట్ల ఆత్మాహుతి దాడులు చేశారు.

ఈ నెల ప్రారంభంలో ఉత్తర నగరం కుందుజ్, తాలిబాన్లకు బాగా పట్టున్న కాందహార్‌లోని షియా మైనారిటీకి చెందిన మసీదులపై ఐఎస్ దాడి చేసింది. అయితే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐఎస్‌ను తుద ముట్టిస్తామని డాక్టర్ బషీర్ స్పష్టం చేశారు.

రెండు దశాబ్దాలుగా తిరుగుబాటులో పాల్గొన్న డాక్టర్ బషీర్ ''గెరిల్లా యుద్ధాన్ని నివారించడం మాకు చాలా సులభం" అని చెప్పారు.

గతంలో తాలిబాన్‌ల తరహా దాడులనే ప్రస్తుతం ఐఎస్ కొనసాగిస్తోంది.
ఫొటో క్యాప్షన్, గతంలో తాలిబాన్‌ల తరహా దాడులనే ప్రస్తుతం ఐఎస్ కొనసాగిస్తోంది.

ప్రస్తుతానికి అఫ్గానిస్తాన్‌లో ఏ భూభాగాన్ని కూడా ఐఎస్ తన అదుపులోకి తీసుకోలేక పోయింది గతంలో నంగర్‌హార్, కునార్ ప్రావిన్సులలో స్థావరాలను ఏర్పాటు చేసుకోగలిగింది. అఫ్గానిస్తాన్‌లో దాదాపు 70 వేలమంది తాలిబాన్‌‌లు ఉండగా, ఐఎస్‌కు కేవలం కొన్నివేలమంది మద్ధతుదారులే ఉన్నారు.

ఐఎస్‌లో పని చేసే చాలామంది సభ్యులు తాలిబాన్‌లలోని తిరుగుబాటు వర్గానికి చెందిన వారో, లేదంటే పాకిస్తాన్ తాలిబాన్‌లో అయ్యుంటారు.

ఇటీవలి కాలంలో డజన్ల కొద్దీ ఐఎస్ సభ్యులు నంగర్‌హార్‌లో డాక్టర్ బషీర్ దళాలకు లొంగిపోయారు. అందులో ఒక మాజీ తాలిబాన్ సభ్యుడు కూడా ఉన్నారు. తాను ఐఎస్‌లోకి వెళ్లిన తర్వాత చేసిన తప్పు తెలుసుకున్నానని ఆయన బీబీసీ ప్రతినిధితో అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ ఎమిరేట్ స్థాపించడమే తమ ఏకైక లక్ష్యం అని తాలిబాన్‌లు చెప్పుకుంటుండగా, అందుకు భిన్నంగా ఐఎస్ ప్రపంచ స్థాయి లక్ష్యాలను పెట్టుకుందని ఆ సభ్యుడు వెల్లడించారు.

''ఐఎస్ ప్రపంచం మొత్తాన్ని బెదిరిస్తోంది. ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటామని చెబుతోంది. కానీ, దాని మాటలకు, చేతలకు పొంతన లేదు'' అని ఆ సభ్యుడు అన్నారు. అఫ్గానిస్తాన్‌ పై ఐఎస్ ఎప్పటికీ నియంత్రణ సాధించలేదని ఆయన అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో ఐఎస్ దాడుల పెరుగుదలను కొత్త రాజకీయ క్రీడగా చాలామంది భావిస్తున్నారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్‌లనే కాదు, సామాన్యులను కూడా ఐఎస్ కార్యకర్తలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇటీవల సివిల్ సొసైటీ కార్యకర్త అబ్దుల్ రెహమాన్ ఓ పెళ్లి నుంచి ఇంటికి వస్తుండగా, దుండగులు కాల్చి చంపారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ప్రకటించుకుంది.

''తాలిబాన్‌లు అధికారం చేపట్టినప్పుడు మనస్ఫూర్తిగా ఆహ్వానించాం. మేం అప్పుడు చాలా ఆశావహ దృక్పథంతో ఉన్నాం. కానీ, ఇప్పుడు కొత్త రూపంలో సమస్య మమ్మల్ని వెంటాడుతోంది'' అని రెహమాన్ సోదరుడు షాద్‌ నూర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)