ఒసామా బిన్ లాడెన్: ప్రపంచాన్ని వణికించిన అల్ ఖైదా ఇప్పుడు ఏ స్థితిలో ఉంది

- రచయిత, జుల్ఫికర్ అలీ
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా సైనిక బలగాల చేతుల్లో అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ మరణించి 8 ఏళ్లు పూరైంది.
ఒసామా బిన్ లాడెన్ నాయకత్వం వహించిన అల్ ఖైదాను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జిహాదీ గ్రూపుగా భావించేవారు.
ఈ గ్రూప్ జెండాతో ఎంతోమంది మిలిటెంట్లు పోరాటం చేసేవారు. అల్ ఖైదా దగ్గర ఆర్థిక వనరులు కూడా భారీగా ఉన్నాయని భావించేవారు.
కానీ ఒసామా బిన్ లాడెన్ మరణం, ఇస్లామిక్ స్టేట్‌గా చెప్పుకుంటున్న మిలిటెంట్ సంస్థ ఆవిర్భావం తర్వాత అల్ ఖైదా బలం, ప్రభావం చాలా తగ్గిపోయింది.
అలాంటప్పుడు లాడెన్ చనిపోయిన 8 ఏళ్ల తర్వాత, ఇప్పుడు అల్ ఖైదా అసలు ఏ స్థితిలో ఉంది, ప్రపంచానికి దానివల్ల ఏదైనా ముప్పు ఉందా అనే విషయం చర్చకు వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
మెల్లమెల్లగా పెద్దదైంది
ఇటీవల కొన్నేళ్లుగా ఇస్లామిక్ స్టేట్ ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లో నిలుస్తుండడంతో అల్ ఖైదా పూర్తిగా వేరే వ్యూహంతో ముందుకెళ్లింది.
ఎక్కువ టెర్రర్ సృష్టించకుండా మళ్లీ సంస్థను బలోపేతం చేయడం, స్థానిక గ్రూపులతో సంబంధాలు కలుపుకోవడం లాంటి వ్యూహాలను అమలు చేస్తోంది.
"అల్ ఖైదా ప్రస్తుతం అగ్ర నేత నుంచి ఆదేశాలు జారీ చేసే వ్యవస్థను బలోపేతం చేస్తోంది" అని యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ తన తాజా రిపోర్టులో చెప్పింది.
"అల్ ఖైదా పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వ్యతిరేకంగా దాడులు చేయడాన్ని కొనసాగిస్తుంది" అని కూడా అది తమ హెచ్చరికల్లో చెప్పింది.
అంతర్జాతీయ తీవ్రవాదంతో ముప్పు గురించి ఈ ఏడాది ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక రిపోర్ట్ అల్ ఖైదా లక్ష్యాలు పెరుగుతున్నట్టు తెలుస్తోందని చెప్పింది.
"అవసరాన్ని బట్టి తనను తాను మలుచుకునే అల్ ఖైదా సామర్థ్యం ఇప్పటికీ అలాగే ఉంది. చాలా ప్రాంతాల్లో అది చురుకుగా ఉంది. మళ్లీ ప్రపంచం దృష్టిలో పడాలని తహతహలాడుతోంది" అని ఆ రిపోర్టులో తెలిపారు.
"అల్ ఖైదా నుంచి మళ్లీ ప్రమాదం పొంచి ఉంది" అని ఇదే ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ నిఘా చీఫ్ అలెక్స్ యంగ్ కూడా హెచ్చరించారు.

ఫొటో సోర్స్, Getty Images
భాగస్వామ్య సంస్థలతో నెట్‌వర్క్
అమెరికా డ్రోన్ దాడులు, అగ్ర నేత హత్య, ఇస్లామిక్ స్టేట్ ముందున్న సవాళ్లను చూసిన అల్ ఖైదా ఇప్పుడు కొత్త వ్యూహం ఎంచుకుంది.
ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలోని అల్ ఖైదా శాఖలు, ఇతర భాగస్వామ్య సంస్థల ద్వారా ఒక విజయవంతమైన నెట్‌వర్క్ ఏర్పరుచుకుంది.
ఆయా ప్రాంతాల్లో స్థానిక మిలిటెంట్ గ్రూపులను అల్ ఖైదా తన భాగస్వామ్య సంస్థగా ఎంచుకుంది. అవి కూడా అల్ ఖైదా పట్ల విశ్వాసంతో ఉంటామని ప్రమాణం చేశాయి.
ఇస్లామిక్ స్టేట్‌లా కాకుండా అల్ ఖైదా స్థానిక జనాభాకు తాము దూరంగా ఉండేలా జాగ్రత్తపడుతోంది.
స్థానిక మిలిటెంట్ గ్రూపులతో ఒక కూటమిలా ఏర్పడి కలిసి పనిచేయాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
జీహాదీల కోసం గైడ్‌లైన్స్
2013లో అల్ ఖైదా సంస్థలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జిహాదీల కోసం 'గైడ్‌లైన్స్' జారీ చేసింది.
మిలిటెంట్లు నిగ్రహంతో సామాజిక ప్రవర్తనకు అలవాటు పడాలని అల్ ఖైదా ఈ పత్రాల్లో సూచించింది.
స్థానికులు వ్యతిరేకించేవాటిని లేదా వారితో తిరుగుబాటుకు దారితీసే ప్రవర్తనలను విడిచిపెట్టాలని తమ మిలిటెంట్లకు సూచించింది.
"అల్ ఖైదా సమాజంలో అవినీతికి, అట్టడుగు వర్గాల ఆందోళనలకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. జీహాద్‌కు గ్లోబల్ ఎజెండాలో స్థానం కల్పించింది" అని ఆక్స్‌ఫర్డ్ పెంబ్రోక్ కాలేజీలో సీనియర్ ఫెలో ఎలిజబెత్ కాండల్ చెప్పారు.
"అలా అల్ ఖైదా స్థానికుల మధ్య దూతలా పనిచేస్తోందని అది చెప్పుకుంటోంది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లలా కాకుండా అది తమను తాము 'జెంటిల్మన్ జిహాదీ'లుగా చెప్పుకోవాలని భావిస్తోంది."
వివిధ దేశాల్లో శాఖలు, భాగస్వామ్య మిలిటెంట్ సంస్థల నెట్‌వర్క్ ద్వారా అల్ ఖైదా మెల్లమెల్లగా తన దాడులను పెంచుతోంది.
'ది ఆర్ముడ్ కాన్‌ఫ్లిక్ట్ లొకేషన్ అండ్ ఈవెంట్ డేటా ప్రాజెక్ట్' (ఏసీఎల్ఈడీ) గణాంకాల ప్రకారం 2018లో అల్ ఖైదా ప్రపంచవ్యాప్తంగా 316 దాడులు జరిపినట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
అల్ ఖైదా శాఖలు
అల్ ఖైదా ఇన్ ద ఇస్లామిక్ మగ్రిబ్(ఏక్యూఐఎం): 2006లో ఒక అల్జీరియా మిలిటెంట్ సంస్థ అల్ ఖైదాతో చేతులు కలిపినపుడు ఈ సంస్థ ఉనికిలోకి వచ్చింది.
అరబ్ ద్వీపకల్పంలో అల్ ఖైదా(ఏక్యూఏపీ): 2009లో అంతర్జాతీయ జిహాదీ నెట్‌వర్క్ యెమెన్, సౌదీ అరేబియాలో చురుకుగా ఉండే శాఖలతో కలిసిన తర్వాత ఈ సంస్థ ఏర్పాటైంది.
భారత ఉపఖండంలో అల్ ఖైదా(ఐక్యూఐఎస్): ఇది అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్, బర్మా, బంగ్లాదేశ్‌లో చురుకుగా ఉంది. 2014 నుంచి దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
జమాత్ నుస్రత్ అల్-ఇస్లామ్ వల్-ముస్లిమీన్: అల్ ఖైదాకు సంబంధించిన ఒక సంస్థ. మాలీ, పశ్చిమ ఆఫ్రికాలోని చాలా మిలిటెంట్ సంస్థల విలీనంతో ఇది ఉనికిలోకి వచ్చింది.
అల్ షబాబ్: సోమాలియా, తూర్పు ఆఫ్రికాలో ఇది చురుకుగా ఉంది. అల్ ఖైదాతో 2012 నుంచి దీనికి సంబంధాలు ఉన్నాయి.
హయాత్ తహరీర్ అల్-షామ్(ఎచ్‌టీఎస్): సిరియాలోని పలు జిహాదీ గ్రూపుల విలీనం తర్వాత ఇది ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి దీనికి అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం ఉత్తర సిరియాలోని ఇద్లిబ్ ప్రావిన్స్ ఎచ్‌టీఎస్ పట్టులో ఉంది.
ఈజిఫ్టులో అల్-ఖైదా: ఈజిఫ్టులో సినాయ్ ద్వీపకల్పంలో అల్-ఖైదాకు సంబంధించిన ఎన్నో జిహాదీ గ్రూపులు ఉన్నాయి.

అల్ ఖైదా భవిష్యత్తు నాయకుడు
2015లో అల్ ఖైదా ప్రస్తుత నేత అయమాన్ అల్ జవహరి తన ప్రసంగంలో "బిన్ లాడెన్ టెర్రర్ నెట్‌వర్క్ డెన్ నుంచి వచ్చిన ఒక సింహాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను" అని చెప్పారు.
ఈ యువకుడి పేరు హమ్జా బిన్ లాడెన్. ఒసామా బిన్ లాడెన్ కుమారుడైన ఇతడు రాబోవు రోజుల్లో అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తాడని భావిస్తున్నారు.
హమ్జా బిన్ లాడెన్ గురించి సమాచారం ఇచ్చినవారికి 10 లక్షల డాలర్లు (7 కోట్ల రూపాయలకు పైగా) ఇస్తామని అమెరికా ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అల్ ఖైదాకు సంబంధించిన వెబ్‌సైట్‌లో 30 ఏళ్ల ఈ వ్యక్తిని అల్ ఖైదా కాబోయే నాయకుడుగా చెబుతున్నారు.
హమ్జా బిన్ లాడెన్ తర్వాత తరం జిహాదీల్లో స్ఫూర్తి నింపుతాడని, అల్ ఖైదాకు కొత్త ఊపిరి అందిస్తాడని వారు భావిస్తున్నారు.
కొన్నేళ్లుగా హమ్జా ఎన్నో ఆడియో, వీడియో సందేశాలు విడుదల చేశాడు. అమెరికా, దాని మిత్ర దేశాలపై దాడులు చేయాలని, ఒసామా బిన్ లాడెన్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని అతడు తన మద్దతుదారులను ఆ వీడియోల్లో కోరాడు.
చాథమ్ హౌస్‌లో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా విభాగం చీఫ్ లినా ఖాతిబ్ "ఇస్లామిక్ స్టేట్ సామ్రాజ్యం పతనం, అల్ ఖైదా నెట్‌వర్క్ ఇప్పుడు తమ ఆపరేషన్స్ గురించి చాలా తెలివిగా, వ్యూహాత్మకంగా ఆలోచించేలా చేసింది" అన్నారు.
"అల్ ఖైదాకు ప్రస్తుతం మంచి వ్యూహాలు సిద్ధం చేసే నాయకుడు చాలా అవసరం. అల్ ఖైదాలో తన తండ్రి స్థానం అందుకోడానికి హమ్జా బిన్ లాడెన్ మద్దతు కూడగడుతున్నట్టు కనిపించడానికి కారణం అదే" అన్నారు.

ఇవి కూడా చదవండి:
- మసూద్ అజర్ విషయంలో ఇప్పుడేం జరగొచ్చు
- మసూద్ అజర్‌ను జమ్మూ జైలు నుంచి కాందహార్‌కు ఎలా తీసుకువచ్చారు...
- మసూద్ అజర్ విషయంలో చైనా ఎందుకు పట్టు సడలించింది
- బాబ్రీ విధ్వంసానికి 'రిహార్సల్స్' ఇలా జరిగాయి..
- అమెరికా లాడెన్‌ని చంపినట్లు మసూద్ అజర్‌ను ఇంట్లోకి వెళ్లి చంపగలం: అరుణ్ జైట్లీ
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- ఒసామా బిన్ లాడెన్ సాయంతో జైష్-ఎ-మొహమ్మద్ ఎలా ఏర్పాటైంది?
- గోరక్షకుడికి వివేకానందుడి ప్రశ్నలు: గోరక్షణ కోసం భిక్షకు వచ్చినపుడు వివేకానందుడు ఏమన్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









