మసూద్ అజర్ విషయంలో చైనా ఎందుకు పట్టు సడలించింది

ఫొటో సోర్స్, iStock
- రచయిత, స్వరణ్ సింగ్
- హోదా, బీబీసీ కోసం
పాకిస్తాన్‌కు చెందిన జైషే మొహమ్మద్ సంస్థ అధ్యక్షుడు మౌలానా మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ బుధవారం ఐక్యరాజ్య సమితి భద్రతామండలి నిర్ణయం తీసుకుంది.
ఇన్నాళ్లూ ఈ విషయంలో పాకిస్తాన్‌కు బలమైన మద్దతుదారుగా ఉంటూ, మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా వీటో అధికారాన్ని వినియోగిస్తున్న చైనా చివరకు పట్టుసడలించడంతో ఈ చర్య సాధ్యమైంది.
2009లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి అనంతరం మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలనే ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి ముందుకు భారత్ తీసుకొచ్చింది.
ఈ ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితిలో వీటో అధికారం ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుపలికాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశాలు కూడా మద్దతు తెలిపి చైనాను ఒంటరిని చేశాయి. తమ దేశానికి సంబంధించి మసూద్ అజర్ అంతర్జాతీయ తీవ్రవాది అని ఫ్రాన్స్ ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా ఒంటరి
2019 ఫిబ్రవరిలో పుల్వామా దాడి అనంతరం పరిస్థితిని గమనించిన ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా... ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ ముందు తమ ఉమ్మడి ప్రతిపాదనను మళ్లీ సమీక్షించాయి.
ఈ సమయంలో చైనా అయిష్టంగానే ఉంది. చివరి క్షణం వరకు సాంకేతిక కారణాల సాకుతో అడ్డుకునే ప్రయత్నం చేసింది. చైనా ఇలా చేయడం నాలుగోసారి. మరిన్ని చర్చలతో ముందుకు వెళ్లాలని కమిటీని చైనా కోరింది.
అయితే, కొన్ని రోజుల్లోనే చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, అలాగే, దిల్లీలోని చైనా రాయబారి దీనిపై మాట్లాడారు. ఆ తర్వాత ఆరు వారాల్లోపే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై చైనా తన వైఖరి మార్చుకుంది.
ఇలా చైనా తన వైఖరి మార్చుకోవడం వెనుక ట్రంప్ తీసుకున్న చర్యలు (చైనా, అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య యుద్ధం జరుగుతోంది) కూడా కారణం కావొచ్చు. మసూద్ అజర్ విషయం చర్చించాలని గత నెలలో భద్రతా మండలిని అమెరికా కోరింది.
ఈ ప్రతిపాదన చైనాను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎందుకంటే గతంలో ఈ అంశంపై చైనా తన వైఖరిని కమిటీ ముందు నాలుగు గోడల మధ్య చెప్పేది. అసలు చైనా ఏం చేప్పేదో ఎవరికీ తెలిసేదే కాదు. కానీ, అమెరికా ఒత్తిడి మూలంగా భద్రతా మండలిలో ఈ అంశం చర్చకు రావడంతో చైనా పరిస్థితి క్లిష్టంగా మారింది.
ఇలాంటి ఒత్తిడి సమయంలో పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి మహ్మద్ షా ఖురేషి... మసూద్ అజర్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని ప్రచారం ప్రారంభించారు. బలమైన సాక్ష్యాధారాలు ఉంటేనే ఆయనను కోర్టుకు లాగాలని కోరారు.

ఎఫ్‌ఏటీఎఫ్ కఠిన వైఖరి
బీజింగ్‌లో చైనా నిర్వహించిన బెల్ట్ అండ్ రోడ్ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరైన మరుసటి రోజే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం.
చైనా పర్యటన సమయంలో ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ అధక్షుడు జిన్ పింగ్‌తో సహా అనేక మంది నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వారి సమావేశంలో మసూద్ అజర్ అంశం కచ్చితంగా చర్చకు వచ్చి ఉంటుంది. అయితే ఈ చర్య వల్ల పాకిస్తాన్‌కు జరిగే నష్టాన్ని తగ్గించేందుకు చైనా తన వంతు ప్రయత్నం చేసింది. తన వైఖరిని ఐరాస భద్రతా మండలికి తెలియచేయడానికి ఒక్క రోజు ముందు వరకూ కూడా గుట్టుగానే వ్యవహరించింది. ఈ అంశాన్ని తగిన రీతిలో సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎప్పుడూ చెప్పే మాటనే చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. కానీ ఇందుకు గడువు ఏమిటనేది మాత్రం చెప్పలేదు.
ఏడాది నుంచి గమనించినట్లయితే పారిస్ కేంద్రంగా ఉన్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) పాక్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలకు ఆర్థికసాయం కొనసాగించడం నిలిపివేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆ దేశాన్ని గ్రే లిస్టులో పెట్టిన ఎఫ్‌ఏటీఎఫ్ జూన్‌లోపు 'బ్లాక్ లిస్టు'లో పెడతామని హెచ్చరించింది.
ప్రస్తుతం ఎఫ్‌ఏటీఎఫ్‌కు ఉపాధ్యక్షుడిగా ఉన్న చైనా వ్యక్తికే వచ్చే అక్టోబరులో అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో చైనా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
దౌత్య విజయంగా చెప్పుకునే అవకాశం
చివరగా, భారత దౌత్య సంబంధాలు, ప్రధాని మోదీ చేపట్టిన ద్వైపాక్షిక చర్చలు, వివిధ కూటముల్లో ఉగ్రవాద నిరోధక ఎజెండాతో చేపట్టిన కార్యక్రమాలు కూడా ఇందుకు కారణంగా పరిగణించాలి.
గతేడాది ఏప్రిల్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన చర్చల వల్లే ఈ చర్య సాధ్యమైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, మసూద్ అజర్‌పై ఈ సమయంలో చైనా తన నిర్ణయాన్ని ప్రకటించడం భారత్‌లోని అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా కనిపిస్తోంది. మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమతి ప్రకటించడం, చైనా-పాక్‌లకు వ్యతిరేకంగా భారత్ సాధించిన విదేశీ దౌత్య విజయంగా ఎన్నికల సమయంలో అధికార పార్టీ చెప్పుకునే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
హఫీజ్ సయీద్ విషయంలో ఏమైంది?
కానీ, క్షేత్రస్థాయిలో వాస్తవం ఏమిటంటే మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ఒక సాంకేతిక ప్రక్రియ తప్పితే దీనివల్ల పెద్దగా జరిగేదేమి ఉండదు. హఫీజ్ సయీద్ కేసు దీనికి చక్కటి ఉదాహరణ.
ముంబై ఉగ్రదాడి అనంతరం ఉగ్రదాడిలో హఫీజ్ సయీద్ ప్రమేయానికి సంబంధించి సాక్ష్యాలు అందిస్తే కోటి డాలర్లు అందిస్తామని ఒబామా ప్రభుత్వం 2012లో ప్రకటించింది. కానీ, ఆర్థికంగా పతనావస్థలో ఉన్న పాక్ నుంచి ఎవరూ కూడా హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు అందించలేదు.
అంతేకాదు, ఆయన పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అక్కడ ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టారు. జాతీయ అసెంబ్లీకి గత జులైలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ తరపున 80 మందిని పోటీలో నిలబెట్టారు. అలాగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో 185మంది హఫీజ్ పార్టీ తరపున పోటీ చేశారు. మసూద్ అజర్ పరిస్థితి కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ ఉండదు.
(వ్యాసకర్త స్వరణ్ సింగ్ దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్)
ఇవి కూడా చదవండి:
- ఓట్లు లెక్కిస్తూ 272 మంది ఎన్నికల సిబ్బంది మృతి
- సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎందుకు? కేసులు ఏమిటి?
- IPL 2019: కోహ్లీ జట్టు కథ ముగిసింది.. బెంగళూరును ఓడించి ప్లేఆఫ్ చేరిన దిల్లీ
- ఒకప్పటి బార్ డ్యాన్సర్ల జీవితాలు ఇప్పుడెలా ఉన్నాయి
- రామ్ గోపాల్ వర్మను అడ్డుకున్న విజయవాడ పోలీసులు.. ఏపీలో ప్రజాస్వామ్యం లేదన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' దర్శకుడు
- చిలుకను అరెస్టు చేసిన పోలీసులు
- కియా మోటార్స్: 'స్థానికులకు ఉద్యోగాలంటే... స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులేనా'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








