సుజనా చౌదరి మీద సీబీఐ, ఈడీ దర్యాప్తులు ఎందుకు? కేసులు ఏమిటి?

ఫొటో సోర్స్, YSChowdary/Facebook
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
(ఇది 2019 ఏప్రిల్ 28వ తేదీన ప్రచురితమైన కథనం.)
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని విచారణకు రావాలంటూ బెంగళూరులో సీబీఐ కార్యాలయం సమన్లు జారీచేసింది.
తనకు, సీబీఐ పేర్కొన్న కంపెనీలకు ఎటువంటి సంబంధం లేదని, తగిన చర్యలు తీసుకుంటానని ఏప్రిల్ 25న సీబీఐ సమన్లపై స్పందిస్తూ ఒక పత్రిక ప్రకటన ద్వారా సుజన తెలిపారు.
ఆయన బెంగళూరు వెళ్లారు కానీ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సుజనా చౌదరికి బదులుగా ఆయన ప్రతినిధి సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఆయన ఎందుకు విచారణకు హాజరు కాలేదు, ఆయన స్థానంలో ఎవరు వెళ్లారు అనే అంశాలపై సుజనా చౌదరి బృందం స్పందించలేదు.
బీజేపీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరిని సీబీఐ అసలు ఎందుకు విచారిస్తోంది? అసలు కేసు ఏంటి?

ఫొటో సోర్స్, YSChowdary/Facebook
మూడు బ్యాంకుల ఫిర్యాదులు.. మూడు ఎఫ్ఐఆర్‌లు...
మూడు బ్యాంకులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 2017లో సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్, ఫ్రాడ్ సెల్ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది.
2010 నుంచి 2013 మధ్యలో మూడు బ్యాంకులకు - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్- చెన్నై లోని బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ రూ. 364 కోట్ల నష్టం చేకూర్చిందని ఆరోపించారు.
ఈ కంపెనీ అకౌంట్లను తారుమారు చేసి తప్పుడు స్టేట్‌మెంట్లు చూపించి ఈ మూడు బ్యాంకులు - సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా (రూ. 133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్ (రూ. 71 కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్ (రూ. 159 కోట్లు) వద్ద లోన్లు తీసుకున్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు.
దీనికి సంబంధించి కంపెనీ నలుగురు డైరెక్టర్ల పైన, సుజనా చౌదరి పైన, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకులమర్రి శ్రీనివాస్ కళ్యాణ్, అలాగే కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‍పై కాన్‌స్పిరసీ, ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణల కింద కేసులు నమోదు చేసింది సీబీఐ.

ఫొటో సోర్స్, YSChowdary/Facebook
సీబీఐ కేసుల తర్వాత ఈడీ కేసులు, సోదాలు
సీబీఐ వేసిన కేసుల తరువాత ఈడీ కూడా కేసులు నమోదు చేసి సుజనా చౌదరి ఆస్తులు అటాచ్ కూడా చేసింది. సీబీఐ వేసిన ఈ మూడు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా మనీ లాండరింగ్ చట్ట ప్రకారం అక్టోబర్ 2018లో విచారణ మొదలు పెట్టింది.
అక్టోబర్ 2018లో బీఈసీపీఎల్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లోని కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేశారు. ఈడీ అధికారులు నవంబర్ 2018లో ఇచ్చిన పత్రిక ప్రకటన ప్రకారం, ఈ సోదాల్లో నేరారోపణ చేసే పత్రాలు, అలాగే డొల్ల కంపెనీలకు చెందిన 126 రబ్బర్ స్టాంపులు హైదరాబాద్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సుజనా గ్రూప్ డైరెక్టర్ల వాంగ్మూలం రికార్డు చేశారు.
ఈడీ ఇచ్చిన ప్రకటన ప్రకారం బీఈసీపీఎల్, ఇతర సుజనా గ్రూప్ కంపెనీలు సుజనా చౌదరి అధ్యక్షతన పని చేస్తున్నాయి.
బీఈసీపీఎల్ డైరెక్టర్ల నుంచి మనీ లాండరింగ్ చట్టం కింద సెక్షన్ 50 కింద తీసుకున్న వాంగ్మూలంలో.. తాము కేవలం పేరుకే డైరెక్టర్లమని, కంపెనీకి నిధులు ఎలా వస్తున్నాయి, ఆ నిధులు ఎలా ఉపయోగిస్తున్నారు, ఇతర లావాదేవీల విషయాలు తమకు తెలియదని పేర్కొన్నారని ఈడీ తెలిపింది.

ఫొటో సోర్స్, YSChowdary/Facebook
‘రూ. 5,700 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేశాయి’
మళ్లీ నవంబర్ 23, 2018లో హైదరాబాద్‌లోని 7 స్థానాల్లో, దిల్లీలో ఒక స్థానంలో సోదాలు నిర్వహించింది ఈడీ. ఈ సోదాల్లో సుజనా గ్రూప్ కంపెనీలు రూ. 5,700 కోట్ల పైగా బ్యాంకులను మోసం చేసినట్టు వెల్లడైందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
''సోదాల్లో దొరికిన పత్రాల ఆధారంగా దాదాపు 120 కంపెనీలను సుజనా గ్రూప్ కంట్రోల్ చేస్తునట్టు తెలిసింది. అలాగే ఈ కంపెనీలు కేవలం పేపర్ మీద తప్ప నిజమైన కంపెనీలు కావని వెల్లడైంది'' అని ఈడీ అప్పట్లో పత్రిక ప్రకటనలో వెల్లడించింది.
అంతేకాక సుజనా చౌదరి నివాసంలో ఉన్న ఆరు ఖరీదైన - ఫెరారీ, రేంజ్ రోవర్, బెంజ్ కార్లను నవంబర్‌లో స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 27, 2018న విచారణకు హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేసింది ఈడీ.

ఫొటో సోర్స్, YSChowdary/Facebook
నా ఆస్తుల విలువ అప్పుల కంటే ఎక్కువ: సుజనా చౌదరి
''ఈడీ చేసిన సోదాలపై లీగల్‌గా వెళ్తా.. చర్చలు జరుపుతున్నాం. 2009 ఎన్నికల తరువాత నాపై ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. నిజంగా ఏదైనా అక్రమాలు జరిగితే చట్టపరంగా ఎదుర్కొంటాం. పీఎంఎల్ఐ యాక్ట్ ప్రకారం మాత్రమే సమన్లు ఇచ్చారు. నా ఆస్తుల విలువ అప్పుల కంటే ఎక్కువగానే ఉంది. నా కంపెనీల్లో శ్రీనివాస్ ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదు. ఈడీ చేసిన సోదాలు తొందరపాటు చర్యగా కనిపిస్తోంది'' అని సుజనా చౌదరి అప్పట్లో తెలిపారు.
మళ్లీ ఏప్రిల్ 2019లో సుజనా గ్రూపు నుంచి వైస్రాయ్ హోటల్స్ ఆస్తులు బదిలీ అయ్యాయని గుర్తించిన ఈడీ 315 కోట్ల రూపాయల ఆస్తులను ఎటాచ్ చేసింది.
మనీ లాండరింగ్ చట్ట ప్రకారం వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్‌కి చెందిన దాదాపు రూ. 315 కోట్ల స్థిర, చరాస్తులను ఎటాచ్ చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఒక బ్యాంక్ మోసం కేసులో ఈ చర్య తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
2010-13 మధ్యలో ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్‌లను 364 కోట్ల రూపాయలకు మోసం చేసినట్టుగా సుజనా గ్రూప్ సంస్థ అయిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై బెంగళూరు సీబీఐ కేసు నమోదు చేసింది.

ఫొటో సోర్స్, yschowdary/fb
‘124 కంపెనీల రబ్బరు స్టాంపులు స్వాధీనం’
ఈ కేసు విచారణలో సుజనా గ్రూప్, బీఈసీపీఎల్ సంస్థ, ఆ సంస్థ ఉన్నతాధికారులకు చెందిన చెన్నై, దిల్లీ, హైదరాబాద్‌లలోని పలు ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొన్ని పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. పంజగుట్టలోని సుజనా గ్రూపు కార్యాలయంలో 124 కంపెనీలు, సంస్థలకు సంబంధించిన రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. అనేక డొల్ల కంపెనీలను సృష్టించి నగదు లావాదేవీలు జరిపారని, బోగస్ బిల్లులు సృష్టించారని, లోన్ మొత్తంలో కొంత భాగాన్ని సుజనా గ్రూప్ ఏర్పాటు చేసిన మహల్ హోటల్స్ అనే డొల్ల కంపెనీకి బదిలీ చేశారనీ గుర్తించారు.
అనేక లావాదేవీల తరువాత ఆ డబ్బును వైస్రాయ్ హోటల్స్ లిమిటెడ్ అకౌంట్లలో జమ చేశారని గుర్తించారు. మహల్ హోటల్స్‌కి రూ. 315 కోట్లు బకాయి ఉన్నట్టు వైస్రాయ్ హోటల్స్ వారు అంగీకరించారు. దీంతో వైస్రాయ్‌కి సంబంధించిన 315 కోట్ల స్థిర చరాస్తులను ఎటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. విచారణ ఇంకా కొనసాగుతుందని తెలిపారు.
ఇప్పటికే సుజనా చౌదరికి సంబంధించిన 20కి పైగా కంపెనీలు జీఎస్‌టీ అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండగా, దానిపై ఆయన సంస్థలు కోర్టుకు వెళ్లాయి.
తాజాగా సీబీఐ బెంగళూరుకు ఆంధ్రా బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 71 కోట్ల రూపాయల అప్పుపై విచారణకు పిలవడంతో సుజనా చౌదరి తనకు సీబీఐ పేర్కొంటున్న మూడు కంపెనీలకు ఎటువంటి సంబంధం లేదని ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు.
అయితే, సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరు కాలేదు.
(ఇది 2019 ఏప్రిల్ 28వ తేదీన ప్రచురితమైన కథనం.)
- బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీలు.. ‘దేశ నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’
- ‘టీడీపీని బీజేపీలో విలీనం చేయండి’ - వెంకయ్య నాయుడిని కోరిన సుజనా, సీఎం రమేశ్, గరికపాటి, టీజీ
- శ్రీలంక పేలుళ్ల ‘సూత్రధారిగా భావిస్తున్న హషీమ్’ చెల్లెలు ఏమంటున్నారంటే...
- చెర్నోబిల్: భారీ అణు విషాదానికి 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?
- ‘27 ఏళ్ల తరువాత కోమా నుంచి బయటపడిన అమ్మ నన్ను పేరు పెట్టి పిలిచింది’
- చైనా ఎందుకు ఏటా 600 కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తోంది?
- శ్రీలంకలో దాడులను భారత్ ముందే ఎలా పసిగట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









